Asianet News TeluguAsianet News Telugu

ఐసీఐసీఐ-వీడియోకాన్ కుంభకోణం: ఐసీఐసీఐలో ముగిసిన కొచ్చర్ శకం

ఐసీఐసీఐ బ్యాంకులో చందాకొచ్చర్ కథ ముగిసింది. క్విడ్ క్రోప్రోకు పాల్పడ్డారని ఆమెపై వచ్చిన అభియోగాలు నిజమేనన్నట్లు శ్రీక్రుష్ణ కమిటీ నివేదిక ఆధారంగా చందాకొచ్చర్ రాజీనామాను ఉద్వాసనగా పరిగణిస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంకు ప్రకటించింది. 

ICICI Bank fires boss: hurt and shocked, credit decisions not unilateral, says Chanda Kochhar
Author
Mumbai, First Published Jan 31, 2019, 10:37 AM IST

ప్రైవేట్ రంగ బ్యాంకుకు తొలి మహిళా సీఈఓగా పని చేసిన చందాకొచ్చర్ కథ ముగిసింది. కుటుంబం కోసం అశ్రిత పక్షపాతానికి పాల్పడ్డారని తేలడంతో ఐసీఐసీఐ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు కఠిన నిర్ణయం తీసుకున్నది. ఆమె రాజీనామాను తొలగింపుగా పరిగణిస్తున్నట్లు ప్రకటించింది. అంతే కాదు.. 2009 నుంచి ఆమె రిటైర్మెంట్ బెనిఫిట్లను వాపస్ తీసుకుంటున్నట్లు పేర్కొంది.

బ్యాంక్ ప్రవర్తనా నియమావళి ఇలా ఉల్లంఘన
‘ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈఓ చందా కొచ్చర్‌ బ్యాంకు ప్రవర్తనా నియమావళిని, అనేక అంతర్గత నిబంధనలను ఉల్లంఘించారు. ఆమె హయాంలో నిబంధనల ప్రకారం బయటకు వెల్లడించాల్సిన అంశాల్లో పారదర్శకత లేదు’ అని జస్టిస్‌ (రిటైర్డ్‌) బి.ఎన్‌ శ్రీకృష్ణ కమిషన్‌ తేల్చి చెప్పింది. శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఆధారంగా చేసుకుని కొచ్చర్‌కు చెల్లించాల్సిన అన్ని పదవీ విరమణ ప్రయోజనాలను నిలివేయాలని బ్యాంకు సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. 

2009 నుంచి రిటైర్మెంట్ బెనిఫిట్లు నిలిపివేత.. బోనస్ వాపస్
2009 నుంచి పదవీ విరమణ ప్రయోజనాలను నిలిపివేయడమే కాదు. 2009 నుంచి చెల్లించిన బోన్‌సలను వెనక్కి తీసుకోవాలని కూడా బ్యాంకు నిర్ణయించింది. గత అక్టోబర్ నెలలో కొచ్చర్‌ చేసిన రాజీనామాను తొలగింపుగా (టెర్మినేషన్‌ ఫర్‌ కాజ్‌) పరిగణిస్తున్నట్లు ప్రకటించింది.
 
సీబీఐ ప్లస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికలతో ఐసీఐసీఐ కఠిన నిర్ణయం
వీడియోకాన్‌కు రుణాలు మంజూరు చేయడంలో గతంలో చందా కొచ్చర్‌కు క్లీన్‌ చిట్‌ ఇచ్చిన బ్యాంకు బోర్డు ఇప్పుడు ఇటువంటి కఠిన నిర్ణయం తీసుకోవడం విశేషం. వీడియోకాన్‌కు రూ.3,250 కోట్ల రుణాలు ఇచ్చిన కేసులో కొచ్చర్‌పై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన కొద్ది రోజుల్లోనే శ్రీకృష్ణ కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. 

ఇలా 2012లో వీడియో కాన్ కు రూ.3,250 కోట్ల రుణం
వీడియోకాన్‌ గ్రూపునకు ఐసీఐసీఐ బ్యాంక్‌ 2012లో రూ.3,250 కోట్ల రుణం మంజూరు చేసింది. ఇందులో చందా కొచ్చర్‌ భర్త దీపక్‌ కొచ్చర్‌ అయాచిత లబ్ధి పొందారని, కొచ్చర్‌ కుటుంబానికి, వీడియోకాన్‌ అధినేత వేణుగోపాల్‌ ధూత్‌ మధ్య ‘క్విడ్‌ ప్రో కో’ (నీకిది, నాకది) జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ 2017 డిసెంబరులోనే ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. 

వీడియో కాన్ సంస్థకు రుణాల్లో అవకతవకలు
2009 జూన్‌- 2011 అక్టోబర్‌ మధ్య వీడియోకాన్‌ సంస్థలకు ఇచ్చిన రూ.1,875 కోట్ల విలువైన ఆరు రుణాల్లో అవకతవకలు జరిగినట్లు దర్యాప్తు ఏజెన్సీ గుర్తించింది. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపించిన ప్రకారం వీడియోకాన్‌ గ్రూపునకు రెండు టర్మ్‌ లోన్లు చందా కొచర్‌ ఆధ్వర్యంలోని కమిటీ ద్వారా మంజూరయ్యాయి.

నిబంధనలకు విరుద్ధంగా కొచ్చర్ కమిటీ రుణాల మంజూరు
వీడియోకాన్‌ ఇంటర్నేషనల్‌ ఎలక్ట్రానిక్స్‌కు ఇచ్చిన రూ.300 కోట్ల రుణాన్ని 2009, ఆగస్టు 26న, వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌కు ఇచ్చిన రూ.750 కోట్ల రుణాన్ని 2011 అక్టోబరు 31న కొచర్‌ ఆధ్వర్యంలోని కమిటీ మంజూరు చేసింది. బ్యాంకు విధానాలు, నిబంధనలకు విరుద్ధంగా ఈ రుణాలకు కమిటీ క్లియరెన్సులు ఇచ్చింది.

రుణాలు మంజూరైన మరుసటి రోజే దీపక్ కొచ్చర్ సంస్థకు ధూత్ నుంచి నిధులు 
2009 సెప్టెంబర్ 7వ తేదీన వీడియోకాన్‌ ఇంటర్నేషనల్‌కు రూ.300 కోట్ల రుణ నిధులు విడుదల కాగా.. ఆ మరుసటి రోజునే దీపక్‌ కొచర్‌కు చెందిన న్యూ పవర్‌ రెన్యువబుల్‌ లిమిటెడ్‌కు వేణుగోపాల్‌ ధూత్‌ రూ.64 కోట్లు బదిలీ చేశారు. ధూత్‌ స్థాపిత కంపెనీ సుప్రీం ఎనర్జీ ద్వారా ఈ నిధులు బదిలీ అయ్యాయి.

న్యూ పవర్‌ లిమిటెడ్‌ తన తొలి విద్యుత్‌ ప్లాంట్‌ కొనుగోలుకు లభించిన అతిపెద్ద మూలధన పెట్టుబడి అది. ఆ తర్వాత కాలంలో సుప్రీం ఎనర్జీ కూడా దీపక్‌ చేతుల్లోకి వెళ్లింది. దీన్ని బట్టి చందా కొచర్‌ తన భర్త కంపెనీ ద్వారా లంచం పుచ్చుకున్నారని సీబీఐ ఆరోపించింది.
 
ప్రస్తుత ఏడాదిలో 2.7% క్షీణించిన లాభం
ఐసీఐసీఐ బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో స్టాండ్‌ అలోన్‌ నికరలాభంలో 2.7 శాతం క్షీణతను నమోదు చేసింది. మొండి బకాయిలకు కేటాయింపులు పెంచడం లాభంలో క్షీణతకు దారి తీసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంకు లాభం రూ.1650 కోట్లు కాగా అది ఈ ఏడాది మూడో త్రైమాసికంలో రూ.1604.91 కోట్లకు దిగజారింది.

మొత్తం ఆదాయం మాత్రం రూ.16,832.22 కోట్ల నుంచి రూ.20,163.25 కోట్లకు పెరిగింది. అయితే స్థూల మొండి బకాయిలు 7.82 శాతం నుంచి 7.75 శాతానికి, నికర ఎన్‌పీఏలు కూడా 4.20 శాతం నుంచి 2.58 శాతానికి దిగివచ్చాయి.

పన్నులు, కేటాయింపులు రూ.4,244 కోట్లు 
పన్నులు, ఇతర అనుబంధ కేటాయింపులు మాత్రం రూ.4,244.15 కోట్లు ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్ త్రైమాసికంలో ఈ కేటాయింపులు రూ.3,569.56 కోట్లున్నాయి. రూపాయి విలువలో స్థూల మొండి బాకీలు రూ.51,591.47 కోట్లు, నికర మొండి బాకీలు రూ.16,252.44 కోట్ల స్థాయిలో ఉన్నాయి.

కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన లాభం స్వల్పంగా ఒక శాతం క్షీణించి రూ.1,874 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్‌ ఆదాయం రూ.33,433 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయం రూ.28,501 కోట్ల నుంచి రూ.33,433 కోట్లకు చేరగా నికర వడ్డీ ఆదాయం 21 శాతం పెరిగి రూ.6875 కోట్లకు చేరింది.

నిరాశకు గురయ్యానన్న చందాకొచ్చర్
తనను తొలగిస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంకు డైరెక్టర్ల బోర్డు తీసుకున్న నిర్ణయంతో తాను నిరాశకు గురయ్యానని చందాకొచ్చర్ పేర్కొన్నారు. తనకు నివేదిక ప్రతిని ఇవ్వలేదన్నారు. రుణాల మంజూరు నిర్ణయం తాను మాత్రమే ఏకపక్షంగా తీసుకోలేదన్నారు.

ఉమ్మడి నిర్ణయం ప్రకారమే వ్యవహరించానన్నారు. కానీ ఐసీఐసీఐ బ్యాంకు నిర్ణయం తన మనస్సును గాయపరిచిందని, ఆవేదన వ్యక్తం చేశారు. 34 ఏళ్లుగా కష్టపడి అంకిత భావంతో పని చేశానని చెప్పుకొచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios