Asianet News TeluguAsianet News Telugu

బీ రెడీ: రూ.20 వేలు దాటితే ఐటీ నిఘా.. త్వరలో నోటీసులు?

ఆస్తి కొనుగోళ్లలో రూ.20 వేలకు మించి నగదు చెల్లింపులు జరిపారా? అయితే మీపై ఆదాయం పన్నుశాఖ ‘నిఘానేత్రం’ పడినట్లే. ప్రస్తుతానికి ఇది ఢిల్లీ నగరానికి పరిమితమైనా.. మున్ముందు దేశవ్యాప్తంగా ఆదాయం పన్నుశాఖ అమలు చేసే అవకాశాలే మెండుగా ఉన్నాయి. 

I-T Dept to issue notice where cash transaction is above Rs 20,000 in property purchase
Author
New Delhi, First Published Jan 20, 2019, 11:26 AM IST

ఆస్తుల కొనుగోలులో రూ.20 వేలకు మించి నగదు లావాదేవీలు జరిగితే ఆదాయం పన్నుశాఖ స్పందించేందుకు సిద్ధమవుతోంది. ప్రత్యేకించి అటువంటి లావాదేవీలు జరిపిన వారికి  నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ పరిమితి దాటి నగదు లావాదేవీలు జరిపిన వారికి నోటీసులను జారీ చేయడం ప్రస్తుతానికి దేశ రాజధాని ఢిల్లీకి పరిమితం.

తర్వాతీ కాలంలో దీన్ని దేశమంతా వర్తింపజేసే అవకాశాలు లేకపోలేదు. తద్వారా ప్రభుత్వాదాయం పెంపొందించేందుకు గల అవకాశాలు మెరుగు పరిచేందుకు ఆదాయం పన్నుశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు.

ఆస్తుల కొనుగోళ్లలో రూ.20వేలు, ఆపై నగదు లావాదేవీలపై ప్రత్యేక డ్రైవ్‌  నిర్వహణకు ఆదాయం పన్ను శాఖ సిద్ధమవుతోందని పేరు వెల్లడించటానికి ఇష్టపడని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే ఆదాయం పన్ను శాఖ, ఢిల్లీ డివిజన్‌ ఆస్తుల కొనుగోలులో రూ.20 వేలకు పైబడిన నగదు చెల్లింపులను షార్ట్‌లిస్ట్‌ చేసిందని పేర్కొన్నారు. 

మరోవైపుం ఆదాయ పన్ను శాఖ ఢిల్లీలోని 21 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 2015, జూన్‌ 1 నుంచి 2018 డిసెంబర్ వరకు జరిగిన ఆన్ని రిజిస్ట్రేషన్లను క్షుణ్ణంగా పరిశీలిస్తోందని ఆ శాఖ అధికారి ఒకరు తెలిపారు. వచ్చే నెల నుంచి కొనుగోలుదారులు, విక్రయదారులకు ఆదాయం పన్ను శాఖ అస్సెస్ మెంట్ అధికారి ఈ నోటీసులు పంపిస్తారని చెప్పారు.
 
ఒకవేళ విక్రయదారుడు జరిమానా చెల్లించేందుకు సిద్ధపడితే అంగీకరిస్తామని, అయితే ఇదే సమయంలో కొనుగోలుదారుడిని మాత్రం సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో వివరాలు వెల్లడించాలని కోరనున్నట్లు ఆ అధికారి పేర్కొన్నారు. స్థిరాస్తుల లావాదేవీల్లో అత్యధికంగా నల్లధనం చలామణి అవుతున్న సంగతి విదితమే. 

నల్లధన లావాదేవీలకు అడ్డుకట్ట వేసేందుకే ఆదాయం పన్ను శాఖ ఈ నిర్ణయం తీసుకుందని ఐటీ శాఖ అధికారి తెలిపారు.  కాగా ఈ తరహా లావాదేవీలను పరిశీలించేందుకు 2015లోనే రియల్‌ ఎస్టేట్‌ రంగానికి సంబంధించి ఆదాయం పన్ను చట్టం సెక్షన్‌ 269ఎస్‌ఎస్ లో కొన్ని మార్పులు చేశారని ఆ అధికారి తెలిపారు.

వ్యవసాయ భూమి సహా రియల్‌ ఎస్టేట్‌లో రూ.20,000కు అంతకు పైబడిన ప్రతి లావాదేవీని అకౌంట్‌ పే చెక్‌ లేదా ఆర్‌టీజీఎస్‌, ఎలక్ట్రానిక్ విధానంలో చేపట్టాలని 2015, జూన్‌ ఒకటో తేదీ నుంచి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios