Asianet News TeluguAsianet News Telugu

ఆర్బీఐలో కేంద్రం వేలు..దేశానికే నష్టమన్న రిజర్వ్ బ్యాంక్

కేంద్ర ప్రభుత్వంతో ఉన్న విభేదాలను ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విఠల్ ఆచార్య బయటపెట్టడంతో మరో వివాదం తలెత్తింది. ఇప్పటికే సీబీఐలో విభేదాలతో తలబొప్పి గట్టిన కేంద్రం.. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విఠల్ ఆచార్య వ్యాఖ్యలతో దిగ్భ్రాంతికి గురైనట్లు వార్తలొచ్చినా విఠల్ ఆచార్యకు ఆర్బీఐ ఉద్యోగుల సంఘం బాసటగా నిలువడం పరిస్థితి తీవ్రతకు అర్థం పడుతోంది.

Government very upset with RBI for making rift public: Sources
Author
Mumbai, First Published Oct 30, 2018, 9:28 AM IST

పెద్ద నోట్ల రద్దు, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐఎల్ఎఫ్ఎస్ సంస్థలో ఆర్థిక సంక్షోభం.. ఆర్థిక సంస్థల పనితీరును నియంత్రించాల్సిన ఆర్బీఐపై ప్రభుత్వం జోక్యం పట్ల తాజాగా బయటపడింది. అంతేకాదు ఆర్బీఐ స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బ తీయొద్దన్న బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ విఠల్ ఆచార్య చేసిన వ్యాఖ్యలకు ఆర్బీఐ ఉద్యోగుల సంఘం బాసటగా నిలిచింది.

అలాంటి ప్రయత్నం విపరీత పరిణామాలకు దారితీస్తాయని ఆ సంఘం హెచ్చరించింది. అయితే విభేదాలను బహిర్గతం చేయడంతో కేంద్రం చాలా అప్ సెట్ అయిందని సమాచారం. మదుపర్లలో దేశ ప్రతిష్ఠను దెబ్బ తీసిందని ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. 

గత వారం ఎ.డి. షార్ఫ్‌ స్మారకోపన్యాసంలో ఆర్‌బీఐ స్వయంప్రతిపత్తిలో ప్రభుత్వ జోక్యం చేసుకోవడంపై ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య తీవ్రంగా స్పందించారు. ఆచార్య అభిప్రాయాలతో ఉద్యోగులు పూర్తిగా ఏకీభవిస్తున్నారని ప్రభుత్వానికి లేఖ రాసిన ఉద్యోగుల సంఘం.. ఆచార్య చెప్పినట్లు ఆర్‌బీఐ స్వయంప్రతిపత్తిని దెబ్బ తీసే ప్రయత్నం ఏదైనా ఒక విపత్కర పరిస్థితికి దారి తీస్తుందని, అలాంటి ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని సూచించింది.
 
ఆర్‌బీఐ వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యంపై ఆచార్య చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయని, అయినా ఇది ఆకస్మికంగా వెలువడిన ఆందోళన కాదని, చాలా కాలంగా ఏర్పడిన అసంతృప్తి ఫలితమేనని ఉద్యోగుల సంఘం ఆ లేఖలో స్పష్టం చేసింది.

అలాగే ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య అగాధం పెరగడం కూడా ఇందుకు కారణమని పేర్కొంది. సానుకూల దృక్పథంతో ఆలోచించే వారు నిర్దేశిత చట్టాలు, విధానాల పరిధిలో ఆర్‌బీఐ పని చేసుకునే విధంగా చట్టాల్లో తగు మార్పులు చేయాలని ప్రభుత్వానికి నచ్చచెప్పాలని కూడా కోరారు.

ప్రస్తుత డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య తరహాలో గతంలోనూ కొంతమంది ఆర్‌బీఐ గవర్నర్లు కేంద్ర బ్యాంక్‌ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడేందుకు గళం విప్పారు. కేంద్ర బ్యాంకుల స్వయంప్రతిపత్తిలో జోక్యం చేసుకునే ఏ ప్రభుత్వమైనా ఎప్పుడో ఒకసారి ఆర్థిక మార్కెట్ల సంక్షోభాన్ని ఎదుర్కొనక తప్పదని విఠల్ ఆచార్య హెచ్చరించారు.

ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రపంచంలో ఏ దేశంలో అయినా ప్రభుత్వానికి, ఆర్బీఐకి మధ్య విధానపరంగా ఏర్పడే వైరుధ్యం స్వల్పకాలిక టి20 మ్యాచ్‌, టెస్ట్‌ మ్యాచ్‌ల మధ్య వ్యత్యాసంతో సమానంగా ఉంటుందని అన్నారు. 

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ప్రభుత్వానికి అంతకు ముందు ప్రకటించిన ఎన్నికల ప్రణాళికలోని హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత పెరుగుతుందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విఠల్ ఆచార్య చెప్పారు.

అప్పుడు జనాకర్షక విధానాలు ప్రకటించక తప్పని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఇది ప్రభుత్వానికి టి 20 మ్యాచ్‌ అయితే కేంద్రబ్యాంకులు మాత్రం ప్రతీ ఒక్క సెషన్‌లోనూ గెలుపే లక్ష్యంగా టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతూ ఉంటాయన్నారు.
 
కేంద్ర ప్రభుత్వంతో ఆర్బీఐ గవర్నర్లకు విభేదాలు తలెత్తడం ఇదే మొదటి సారేం కాదు. స్వాతంత్యానికి పూర్వం ఆర్బీఐ తొలి గవర్నర్‌ సర్‌ ఓస్‌బర్న్‌ స్మిత్‌కు ప్రభుత్వంతో భేదాభిప్రాయాలు తలెత్తాయి. విదేశీ మారక రేట్లు, వడ్డీ రేట్ల విషయంలో అభిప్రాయ బేధాలు రావటంతో ఆయన తన పదవీ కాలానికి ముందే రాజీనామా చేశారు.

ఈయన తర్వాత ఆర్‌బీఐ తొలి భారతీయ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన సీడీ దేశ్‌ముఖ్‌కు కూడా కేంద్ర బ్యాంక్‌ జాతీయీకరణపై ప్రభుత్వంతో విభేదించారు. అంతేకాదు కేంద్ర బ్యాంక్‌ సర్వ స్వతంత్రంగా వ్యవహరించటమే కాకుండా కేంద్ర ప్రభుత్వ నియంత్రణ కూడా ఉండకూడదని స్పష్టం చేశారు. 

దేశ్‌ముఖ్‌ తర్వాత ఆర్‌బీఐ పగ్గాలు చేపట్టిన సర్‌ బెంగాల్‌ రామారావు కూడా 1957, జనవరి రెండోవారంలో తన పదవీ కాలం విషయమై కేంద్ర ఆర్థిక మంత్రితో భేదాభిప్రాయాలు వచ్చి రాజీనామా చేశారు. 2008 వరకు ఆర్‌బీఐ గవర్నర్‌గా వ్యవహరించిన వైవీ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని సుతిమెత్తగా విమర్శిస్తూ వస్తుండేవారు.
 
రిజర్వ్‌ బ్యాంక్‌ ఎప్పుడూ తన బాధ్యతల నుంచి తప్పుకోదని, కేంద్ర బ్యాంక్‌ చేయలేదని చెప్పిందంటే దాని హక్కులను కాపాడటమే అని 2016 సెప్టెంబర్‌లో అప్పటి ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ స్పష్టం చేశారు.

జీ20 సమావేశాల్లో ఆర్థిక మంత్రులతో కలిసి కేంద్ర బ్యాంక్‌ గవర్నర్లు కూర్చోవటం సరికాదని, విధానపర నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో ఇతర రెగ్యులేటర్లు/కార్యదర్శులను నియంత్రించటం మంచిది కాదని, దీన్ని ప్రజాస్వామ్య దేశం ప్రజలు ఏ మాత్రం హర్షించరని రాజన్‌ అన్నారు.
 
వైవీ రెడ్డి తర్వాత ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన దువ్వూరి సుబ్బారావు కేంద్ర బ్యాంక్‌ అధికారాలపై ప్రభుత్వంతో పూర్తి స్థాయిలో విభేదిస్తూ వస్తుండేవారు. 2010 డిసెంబర్‌లో నియంత్రణ సంస్థల మధ్య తలెత్తుతున్న భేదాభిప్రాయాలను పరిష్కరించేందుకు ఒక సూపర్‌ రెగ్యులేటరీ ఉండాలని అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ చేసిన ప్రతిపాదనను దువ్వూరి సుబ్బారావు పూర్తిగా వ్యతిరేకించారు.

విధానపరంగా మార్పులు చేర్పులు చేపట్టటం ద్వారా నియంత్రణా సంస్థలను దారిలోకి తెచ్చుకోవాలని చూడటం మంచిది కాదని దువ్వూరి స్పష్టం చేశారు. బ్యాంకింగ్‌ వ్యవస్థ నియంత్రణలో కేంద్ర ప్రభుత్వ జోక్యం మంచిది కాదని, ఇది చీలికలకు దారి తీస్తుందని ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ టేల్ తేల్చి చెప్పారు..

బ్యాంకింగ్‌ విభాగంలో రెండంచెల నియంత్రణ పద్ధతి వ్యవస్థను పూర్తిగా దెబ్బతీస్తుందని, ఆర్‌బీఐతో పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా నియంత్రణ చేపట్టాలని చూడటం భావ్యం కాదని ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ అన్నారు.
 
వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ, ప్రభుత్వానికి మధ్య ఎంతో కాలంగా ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. పలు సార్లు పరస్పరం విరుద్ధమైన వైఖరులు ప్రదర్శించాయి కూడా. తన అభ్యర్థనలను తోసిపుచ్చి ఆర్‌బీఐ వడ్డీ రేట్లు పెంచడం పట్ల ఆగ్రహించిన ప్రభుత్వం ఆర్బీఐ అధికారాలకు ముకుతాడు వేయాలని ప్రయత్నించడం వైరానికి ప్రథమ కారణం.

ఉభయుల మధ్య అగాధాన్ని పెంచిన మరో అంశం మొండి బకాయిల పునర్‌ వ్యవస్థీకరణ. ఎన్‌పీఏలను వర్గీకరిస్తూ ఫిబ్రవరి 12వ తేదీన ఆర్‌బీఐ ఒక సర్కులర్‌ జారీ చేసింది. ఆ వ్యవహారంలో ఆర్‌బీఐ చాలా కఠినంగా వ్యవహరించిందని, ఫలితంగా ఒకటి రెండు బ్యాంకులు మినహాయిస్తే మిగతా ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ ప్రమాదకర పరిస్థితుల్లోకి జారుకున్నాయన్నది కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం. 

పంజాబ్ నేషనల్ బ్యాంకులో వెలుగు చూసిన నీరవ్‌ మోదీ కుంభకోణం ఉభయుల మధ్య వివాదానికి కారణమైన మరో అంశం. ఆ కుంభకోణం బయటపడగానే ఆర్‌బీఐ పర్యవేక్షణ లోపాలే దానికి కారణమని ప్రభుత్వం ధ్వజం ఎత్తింది. దాన్ని వెంటనే తిప్పి కొట్టిన ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ ప్రభుత్వ బ్యాంకుల పర్యవేక్షణకు తమకు మరిన్ని అధికారాలివ్వాలని కోరారు.

ఇక పదవీ కాలం ముగియడానికి రెండేళ్ల ముందే కనీస మర్యాద పాటించకుండా నచికేత్‌ మార్‌ను ఆర్‌బీఐ బోర్డు నుంచి ప్రభుత్వం తొలగించడం కూడా ఆర్బీఐకి ఆగ్రహం కలిగించింది. ప్రత్యేక పేమెంట్స్‌ రెగ్యులేటర్ నియామకం ఉభయుల మధ్య వివాదానికి దారి తీసింది.

ప్రభుత్వ చర్యను తాను ఎందుకు సమర్థించడంలేదో తెలియజేస్తూ ఆర్‌బీఐ బహిరంగ ప్రకటన చేయడం, ప్రత్యేక రెగ్యులేటర్‌ను నియమించడంపై అసమ్మతి ప్రకటిస్తూ తమ వెబ్‌సైట్‌లో ఒక నోట్‌ ప్రచురించడం వరకు ఈ వ్యవహారం వెళ్లింది.

ఇటీవల తలెత్తిన ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ చెల్లింపుల సంక్షోభం మరో కారణం. ఈ వ్యవహారం బయటపడగానే నగదు కొరతతో అల్లాడుతున్న ఎన్‌బీఎఫ్‌సీలకు ఊరట కల్పించేలా జోక్యం చేసుకోవాలన్న కేంద్రం అభ్యర్థనను ఆర్బీఐ తిరస్కరించడంతో ఇరువైపులా అగాథం మరింత పెరగడానికి దారి తీసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios