Asianet News TeluguAsianet News Telugu

ఇక ‘గూగుల్‌ పే’తో బంగారమూ కొనేయొచ్చు

పేటీఎం, మొబిక్విక్ లతోపాటు గూగుల్ పే ద్వారా కూడా బంగారం కొనుగోలు చేయొచ్చు. అక్షయ తృతీయ, ధంతేరస్‌ లేదా దీపావళి వంటి పర్వదినాల్లో భారతీయులు అధికంగా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారని గూగుల్‌ పే ఇండియా ప్రొడక్ట్ మేనేజ్మెంట్ డైరెక్టర్‌ అంబరీష్‌ కెంఘే తెలిపారు. 

Google Pay launches gold buying, partners MMTC-PAMP India
Author
Hyderabad, First Published Apr 12, 2019, 9:25 AM IST

న్యూఢిల్లీ: గూగుల్‌ పే యాప్‌ వినియోగదారులు పసిడి క్రయవిక్రయాలు చేసే సౌకర్యాన్ని గూగుల్‌ అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ఎంఎంటీసీ-పీఏఎంపీ ఇండియాతో జత కట్టింది. ఇప్పటికే పేటీఎం, మొబిక్విక్‌, ఫోన్‌పే యాప్‌లు బంగారం కొనుగోలు, అమ్మకాలు చేసే సదుపాయాన్ని అందిస్తున్నాయి.

ఇప్పుడు గూగుల్‌ పే కూడా ఇదే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. రిఫైనరీ సంస్థ ఎంఎంటీసీ-పీఏఎంపీతో ఒప్పందం కుదుర్చుకున్నందు వల్ల గూగుల్‌ పే వినియోగదారులు 99.99 శాతం 24 క్యారెట్‌ బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశం లభిస్తుందని కంపెనీ తెలిపింది. 

‘బంగారం భారతీయుల సంస్కృతి, సంప్రదాయంలో ముఖ్యమైనది.  అందుకే బంగారం వినియోగంలో భారత్‌ ప్రపంచంలో రెండోస్థానంలో ఉంది. అక్షయ తృతీయ, ధంతేరస్‌ లేదా దీపావళి వంటి పర్వదినాల్లో భారతీయులు అధికంగా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు’ అని గూగుల్‌ పే ఇండియా ప్రొడక్ట్ మేనేజ్మెంట్ డైరెక్టర్‌ అంబరీష్‌ కెంఘే తెలిపారు. 

గూగుల్‌ పే వినియోగదారులు తమకు నచ్చినంత బంగారాన్ని కొనుగోలు చేయవచ్చని, దీన్ని వినియోగదారుని తరఫున ఎంఎంటీసీ-పీఎఎంపీ సెక్యూర్‌ వాల్ట్స్‌లో స్టోర్‌ చేస్తుందన్నారు. తాజా ధరలకే ఎప్పుడైనా ఈ బంగారాన్ని కొనడం, అమ్మడం చేయవచ్చునన్నారు. గూగుల్ పే యాప్‌పై సదరు బంగారం వివరాలన్నీ ఉంటాయని, వినియోగదారులు సులభంగానే తెలుసుకోవచ్చని కూడా ఆయన ప్రకటించారు.

కాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతి లేకుండానే గూగుల్ పేలో ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయా? అని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించిన మరునాడే గూగుల్ పే ఈ పసిడి క్రయ, విక్రయాలకు తెరతీయడం గమనార్హం. ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైన నేపథ్యంలో గూగుల్ పే సేవలకున్న అనుమతి విషయంపై అటు గూగుల్ ఇండియాకు, ఇటు ఆర్బీఐకి ఢిల్లీ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసిన సంగతీ విదితమే.

ఢిల్లీ హైకోర్టు నోటీసుల నేపథ్యంలో గూగుల్ పే అన్ని అనుమతుల్ని కలిగి ఉన్నట్లు ఆ సంస్థ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. తమ భాగస్వామ్య బ్యాంకులకు ఓ టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్‌గా సేవలందిస్తున్నట్లు చెప్పారు. ఆయా బ్యాంకుల ఖాతాదారుల చెల్లింపులను చేస్తున్నామని, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా పేమెంట్స్‌కు అనుమతినిస్తున్నామని వివరించారు. 

ఇది పేమెంట్ ప్రాసెసింగ్ లేదా సెటిల్మెంట్‌లో భాగం కాదని, ఇందుకు ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఎటువంటి లైసెన్సులు అక్కర్లేదని గూగుల్ పే అధికార ప్రతినిధి పేర్కొన్నారు. కాగా, డేటా సమాచారాన్ని స్థానికంగానే భద్రపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఈ విషయంలో భాగస్వామ్య బ్యాంకులు, ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నట్లు గూగుల్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios