Asianet News TeluguAsianet News Telugu

ఆర్బీఐ స్వతంత్రకు చెల్లుచీటి!? మోదీ సర్కార్ పూర్తి కంట్రోల్ యత్నం

ఆర్బీఐ స్వతంత్రతకు చెల్లుచీటి ఇచ్చే సమయం వచ్చిందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సెక్షన్ -7 అమలుకు మోదీ సర్కార్ పూనుకోవడంతో ఆర్బీఐతో కేంద్రం విభేదాలు పెరిగాయి. సోమవారం జరిగే బోర్డు భేటీలో పట్టు సాధించేందుకు రంగం సిద్ధమవుతోంది.

From RBI to judiciary, India's fate hinges on autonomy
Author
Mumbai, First Published Nov 17, 2018, 10:31 AM IST

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్బీఐ) స్వతంత్రతను దెబ్బ తీసేందుకు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం పావులు కదుపుతోంది. కేంద్రీయ బ్యాంకు కీలక విధులను తన పర్యవేక్షణలోనే జరిగేందుకు నిబంధనలను మార్చే దిశగా మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆర్థిక స్థిరత్వం, ద్రవ్య నియంత్రణ వ్యవస్థ, ‌విదేశీ మారక నిర్వహణ వంటి కీలక విధులను పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీల ఏర్పాటు కోసం ఆర్బీఐ బోర్డు ముసాయిదా నిబంధనలను రూపొందించాలని ప్రభుత్వం ప్రతిపాదించినట్లు బ్లూమ్‌బర్గ్‌ కథనం పేర్కొంది. 

సోమవారం జరిగే ఆర్బీఐ బోర్డు సమావేశానికి ముందే రిజర్వ్‌బ్యాంక్ ఉనికి ప్రమాదం తెచ్చే ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. రిజర్వ్‌బ్యాంకు ఎలా పనిచేయాలన్న అంశంపై కొత్త నిబంధనలను ప్రభుత్వం తెరపైకి తెస్తున్నది. రిజర్వ్‌బ్యాంకు బోర్డును మేనేజ్డ్ ఇనిస్టిట్యూషన్‌గా మార్చడానికి ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 

ఈ కొత్త ప్రతిపాదనలు సోమవారం బోర్డు సమావేశంలో చర్చించనున్నారు. ఈ ప్రతిపాదనల ప్రకారం రిజర్వ్‌బ్యాంకు చట్టాన్ని సవరించకుండానే, పార్లమెంట్ ఆమోదం లేకుండానే ఆర్బీఐ బోర్డును మేనేజ్డ్ ఇనిస్టిట్యూషన్‌గా మార్చే వీలుంది.దీనిప్రకారం అథారిటీ ఆఫ్ ఆర్బీఐ బోర్డును ఏర్పాటు చేయనున్నారు. 

ఆర్బీఐలో ప్రభుత్వ నామినీలు ఉండే సెంట్రల్‌ బోర్డు సాధికారత పెంచడంతోపాటు కీలక వ్యవహారాలపై పర్యవేక్షణ అధికారం కల్పించడమే ఈ ప్రయత్నం ప్రధానోద్దేశమని ఈ వ్యవహారం గురించి తెలిసిన కొందరు వ్యక్తులు తెలిపారని కథనం తెలిపింది. ప్రభుత్వం, ఆర్బీఐ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. 

ఆర్బీఐ వ్యవహారాలపై పట్టు కోసం మోదీ ప్రభుత్వం తాజా ప్రతిపాదనలు ఇరు వర్గాల మధ్య అగాధాన్ని మరింత పెంచే అవకాశం ఉంది. ఆర్‌బీఐలో బోర్డు పాత్ర, దాని అధికారాలు, నియంత్రణపరమైన నిర్ణయాలు వంటి అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.

కేంద్రంతో విభేదాల నేపథ్యంలో ఆర్బీఐ పాలనాతీరుపై పునఃసమీక్ష జరగాలని ప్రభుత్వ ప్రతినిధులు కోరవచ్చు. ఆర్బీఐ చట్టం ప్రకారం ఇకపై బోర్డు కూడా కీలకపాత్ర పోషించాలని, బ్యాంకుల ఆస్తులు అప్పుల పట్టికలను ప్రభావితం చేసే అంశాలపై చర్చించే హక్కు బోర్డుకు ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. 

కానీ, పూర్తి స్వయంప్రతిపత్తిని కోరుకుంటున్న ఆర్‌బీఐ ఇందుకు సుముఖంగా లేదు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా బ్యాంకుల మూలధన రిజర్వు నిష్పత్తిని తగ్గించాలని, బ్యాంకులపై చేపట్టిన సత్వర దిద్దుబాటు చర్య (పీసీఏ) నియమావళిని సడలించాలని, ఎంఎస్‌ఎంఈ, ఎన్‌బీఎఫ్‌సీలకు రుణ లభ్యత పెంచేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐని కోరుతోంది. ఈ విషయాలపైనా సమాశంలో చర్చ జరగవచ్చని తెలుస్తోంది.
 
ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ ఈ నెల 27న ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షక పార్లమెంటరీ స్థాయీ సంఘం ముందు హాజరు కానున్నారు. పెద్ద నోట్ల రద్దు, ఆర్బీఐలో తాజా సం స్కరణలు, ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుత స్థితిగతులను పటేల్‌ కమిటీకి వివరిస్తారు.

ఆర్బీఐ-కేంద్రం మధ్య విభేదాలపై ఉర్జిత్‌ పటేల్‌ను కమిటీ ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు వీరప్ప మొయిలీ అధ్యక్షతన ఏర్పాటైన ఈ పార్లమెంట్‌ కమిటీలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కూడా సభ్యుడిగా ఉన్నారు. 

దేశ చరిత్రలో ఎన్నడూలేని విధంగా మోదీ ప్రభుత్వం ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌ 7 అధికారాన్ని ప్రయోగిస్తూ కొన్ని అంశాలపై చర్చకు ఆహ్వానించడం సెంట్రల్‌ బ్యాంక్‌, కేంద్రం మధ్య విభేదాలకు కారణమైంది. మొండి బకాయిలతో కుదేలవుతున్న 11 బ్యాంకులపై సత్వర దిద్దుబాటు చర్య (పీసీఏ)ల్లో భాగంగా ఆర్బీఐ కొన్ని ఆంక్షలు విధించింది.

బలహీన ప్రభుత్వ బ్యాంకుల సమస్యతోపాటు మార్కెట్లో ద్రవ్య కొరత, విద్యుత్‌ రంగంలో మొండిబకాయిల పరిష్కారానికి ఆర్బీఐ అనుసరించిన మార్గాలపై అసంతృప్తిగా ఉన్న ఆర్థిక శాఖ ప్రజాప్రయోజనాల పేరుతో ఆర్బీఐ సెక్షన్‌ 7(1) ప్రకారంగా ఈ సమస్యలపై నియంత్రణ మండలితో సంప్రదింపులు కోరింది.
 
ఆర్బీఐ, ఆర్థిక శాఖ మధ్య విభేదాలకు ఎంఎస్ఎంఈ(సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు)లకు రుణ లభ్యత పెంపు అంశం కూడా ఒకటి. ఎంఎస్ఎంఈలకు రుణ లభ్యత పెరగాలంటే సత్వర దిద్దుబాటు చర్యల్లో (పీసీఏ) భాగంగా కొన్ని బ్యాంకులపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని ఆర్బీఐని కేంద్రం కోరుతోంది. 

ఆర్బీఐ డేటా ప్రకారం మాత్రం చాలా వరకు బ్యాంకులు (పీసీఏ నిబంధనల ప్రకారం ఆంక్షలు విధించిన బ్యాంకులతో సహా) లక్ష్యం మేరకు ఎంఎస్ఎంఈలకు రుణాలివ్వగలిగాయని వెల్లడైంది. విధాన లేదా నియంత్రణపరమైన ఆంక్షలతో లఘు పరిశ్రమలకొచ్చిన ఇబ్బందేం లేదని ఆర్‌బీఐ డేటా చెబుతోందని బ్యాంకింగ్‌, పారిశ్రామిక వర్గాలంటున్నాయి. ఎందుకంటే, చాలా వరకు ఆంక్షల నుంచి ఆర్‌బీఐ ఎంఎస్ఎంఈ రుణాలను మినహాయించిందని వారన్నారు.
 
ఆర్థిక అంశాలపై చర్చ, విధానాల రూపకల్పనకు నినాదాలు లేదా జనాకర్షణ నిర్దేశం కారాదని కేంద్ర విత్త మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. వాస్తవాలు, పక్కా సమాచార విశ్లేషణ ఆధారంగా ఇది జరగాలని, నాణ్యత లేని చర్చల కారణంగా ఇప్పటికే దేశం ఎన్నో ఇబ్బందులు పడిందన్నారు.

ఆర్థిక ఆంశాల చర్చల్లో నాణ్యత పెంచేందుకు అందరూ కృషి చేయాలని,ఉత్పాదకత పెంచడంపై దృష్టిపెట్టడం వల్ల సమదృష్టి, సంపన్న వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు వీలుకలుగుతుందని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు.

కమిటీ ఆఫ్ సెంట్రల్ బోర్డు పట్టు సడలిపోనుంది. ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిపై రాజీపడితే అది పెద్ద విపత్తే అని రిజర్వ్‌బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య వ్యాఖ్యానించినప్పటి నుంచి కేంద్రం- రిజర్వ్‌బ్యాంక్ మధ్య విభేదాలు మొదలయ్యాయి.

గతంలో ఎన్నడూ ప్రయోగించని సెక్షన్ 7 ఉపయోగించడంపై ఆర్థికమంత్రి ఆరుణ్‌జైట్లీ ప్రతిపాదించడంతో విభేధాలు మరింత ముదిరాయి. సోమవారం నాటి బోర్డు సమావేశంలో ప్రభుత్వం నామినేట్ చేసిన గురుమూర్తి లాంటి సభ్యులు ఈ కొత్త ప్రతిపాదనల చర్చకు లేవనెత్తనున్నారు. దీంతో బోర్డు సమావేశం వాడివేడిగా జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇప్పటికే ఎస్ గురుమూర్తి లాంటి వ్యక్తిని నియమించి ఆర్బీఐ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం చైర్మన్ వీరప్ప మొయిలీ పేర్కొన్నారు. 2014లో కేంద్రంలో అధికారంలోకి రాగానే ప్రణాళిక సంఘాన్ని నిర్వీర్యం చేసిన ఎన్‌డీఏ ప్రభుత్వం ఇప్పుడు రిజర్వ్‌బ్యాంకును నిర్వీర్యం చేస్తున్నదని వ్యాఖ్యానించారు. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ ఈ ప్రతిపాదన వార్త తప్పు కావాలని అనుకుంటున్నానని చెప్పారు. ఒకవేళ నిజమే అయితే అది దేశ ఆర్థిక వ్యవస్థకు గొడ్డలిపెట్టు వంటిదన్నారు. 

ఆర్బీఐ విధానాలను బోర్డు సభ్యుడు ఎస్ గురుమూర్తి తూర్పారబట్టారు. 2009 నుంచి ఉన్న మొండి బకాయిల సమస్య 2014నాటికి తీవ్రతరమైందన్నారు. 2015 లో మొండిబకాయిలకు కేటాయింపులు జరపాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

ప్రారంభంలోనే కేటాయింపులు చేసి ఉంటే అసలు మొండిబకాయిల సమస్యే ఉత్పన్నమయ్యేది కాదని ఆయన విమర్శించారు. రిజర్వులు సగటున 12నుంచి 19 శాతం వరకు ఉండాలని అధ్యయనాలు వెల్లడించాయి. 

ఆర్బీఐ వద్ద 28 శాతం రిజర్వులున్నాయి. వీటిపై స్పష్టమైన విధానాలు అవసరమని గురుమూర్తి అన్నారు. క్రమానుగత విధానాలను అమలుచేయకుంటే షాక్‌లు ఉత్పన్నమవుతాయని, లేని సంక్షోభాలను ఆహ్వానించినట్టు అవుతుందన్నారు.

ఆర్బీఐ - కేంద్ర ప్రభుత్వాల మధ్య విభేదాలు ఆహ్వానించదగ్గవి కావని, ప్రత్యామ్నాయాలు తప్పనిసరని అన్నారు. దీంతో సోమవారం జరిగే సమావేశంలో గురుమూర్తి తీవ్ర స్థాయిలో ప్రభుత్వ ఎజెండాను బోర్డు ముందుకు తేచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.


 

Follow Us:
Download App:
  • android
  • ios