Asianet News TeluguAsianet News Telugu

రుయాల కొలికి: ‘ఎస్సార్’ లక్ష్మి సొంతమయ్యేనా?!

భారతదేశ పారిశ్రామిక రంగంలో అడుగు పెట్టాలని కలలు కంటున్న లక్ష్మీ పుత్రుడు.. ఆర్సెలర్ మిట్టల్ అధినేత లక్ష్మీ మిట్టల్ నాలుగో దఫా ఎస్సార్ స్టీల్ బిడ్ ద్వారా కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. కానీ ఎస్సార్ స్టీల్ ప్రమోటర్లు రుయా ఫ్యామిలీ ఆటంకాలు కల్పిస్తోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

Fourth time lucky? Lakshmi Mittal set to get India foothold
Author
Mumbai, First Published Oct 29, 2018, 8:21 AM IST

ముచ్చటగా మూడుసార్లు భారత దేశ ఉక్కు (స్టీల్) పరిశ్రమలో అడుగు పెట్టాలని కలలు గన్న స్టీల్ దిగ్గజం లక్ష్మీ మిట్టల్ ఇటీవల గెలుచుకున్న ‘ఎస్సార్ స్టీల్’ బిడ్ సాకారం చేస్తుందా? అన్న సందేహాలు మొదలయ్యాయి.

ఎస్సార్ స్టీల్ సంస్థ బిడ్ ను ఖరారు చేస్తూ రుణదాతల కమిటీ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. రుయా కుటుంబ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘ఎస్సార్’ స్టీల్స్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడంతో దివాళా దశకు చేరుకున్నది. దీంతో రుణ బకాయిల వసూళ్ల కోసం రుణదాతలు ఆహ్వానించిన బిడ్లలో ఆర్సెలర్ మిట్టల్ బిడ్ సానుకూలంగా ఉంది. 

అంతా దాదాపు పూర్తయిపోయినట్లేనని భావిస్తున్న తరుణంలో రుయాల కుటుంబం ‘కొలికి’ పెట్టింది. ఇప్పటి దాకా గమ్మున ఉన్న ‘రుయా’లు రుణ బకాయిలన్నీ తామే చెల్లిస్తామని సదరు రుణదాతల కమిటీకి లేఖ సమర్పించారు. గతంలో రుయాలు అనుసరించిన వైఖరితో విసిగిపోయిన బ్యాంకర్లు ఆర్సెలర్ మిట్టల్ బిడ్ ఖరారు చేసేశారు. 

కానీ ఇక్కడే తిరకాసు మొదలవుతున్నది. ఆర్సెలర్‌ మిట్టల్‌ బిడ్‌ను రుణదాతల కమిటీ అంగీకరించడంపై ఎస్సార్‌ గ్రూప్‌ న్యాయపోరాటం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. గతవారం ఎస్సార్‌ స్టీల్‌ను టేకోవర్‌ చేసేందుకు రూ.42వేల కోట్లతో ఆర్సెలార్‌ మిట్టల్‌ దాఖలు చేసిన బిడ్‌ను రుణదాతల కమిటీ అంగీకరించింది. 

అదే సమయంలో ఎస్సార్‌ ప్రమోటర్లైన రుయా కుటుంబం దాఖలు చేసిన రూ.54,389కోట్ల బిడ్‌ను తిరస్కరించింది. తమ బిడ్‌ను అంగీకరిస్తే రుణదాతలకు పూర్తి మొత్తం అందేదని ఎస్సార్‌ గ్రూప్‌ చెబుతోంది. దీంతో దీనిపై న్యాయపోరాటం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. 

ఎస్సార్‌ గ్రూప్‌ ఎస్సార్‌ స్టీల్‌ రుణదాతలకు చెల్లింపులు చేస్తే దాదాపు రూ.1.25లక్షల కోట్ల రుణాలను చెల్లించినట్లు అవుతుంది. ఇప్పటికే ఎస్సార్‌ గ్రూప్‌ అమెరికాలోని ఏజీస్‌ కార్యకలాపాలను విక్రయించడం ద్వారా రూ.4,200 కోట్లు, ఎస్సార్‌ ఆయిల్‌ను విక్రయం ద్వారా రూ.72,000 కోట్లు, ఏజీస్‌ విక్రయం ద్వారా రూ. 2,400 కోట్లు విక్రయించి అప్పులు తీర్చారు.

ఎస్సార్‌ గ్రూప్‌ వ్యాపార విస్తరణ కోసం 2010 నుంచి 2015 వరకు రూ. 1.2 లక్షల కోట్లను వెచ్చించింది. ఇదిలా ఉంటే ఆర్సెలర్ మిట్టల్ సీఈఓ లక్ష్మీ మిట్టల్ ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారతదేశ ప్రగతి ప్రక్రియలో తామూ భాగస్వాములు కావాలని కలలు కంటున్నట్లు చెప్పారు.

తాము ఇప్పటివరకు ఎటువంటి గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టును భారతదేశంలో పొందలేకపోయామన్నారు. కానీ ఎస్సార్ స్టీల్స్ బిడ్ గెలుచుకోవడం ఆనందాన్నిస్తుందన్నారు. కానీ ఈ బిడ్ తుదకంటా ఖరారయ్యే వరకు రకరకాల చిక్కుముళ్లను విప్పాల్సి ఉంది.

ఎస్సార్ స్టీల్ తన స్వాధీనమైతే నూతన టెక్నాలజీతో ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తామని లక్ష్మీ మిట్టల్ చెప్పారు. ఎస్సార్ స్టీల్ రూపురేఖలు మార్చేందుకు తనకు ప్రత్యేక విజన్ ఉన్నదంటారాయన.

Follow Us:
Download App:
  • android
  • ios