Asianet News TeluguAsianet News Telugu

ఆయన మా సిటిజన్: చోక్సీ అప్పగింతకు అంటిగ్వా ‘నో’

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణం నిందితులు నీరవ్ మోదీ, ఆయన మేనమామ మెహుల్ చోక్సీలతోపాటు విస్డమ్ డైమండ్స్ అదినేత జతిన్ మెహతాలను పట్టుకునేందుకు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేస్తున్న ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 

Exclusive: Mehul Choksi not being sent to India, says senior Antiguan official
Author
Antigua, First Published Jan 28, 2019, 10:47 AM IST

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) స్కామ్‌లో ప్రధాన నిందితులు  మెహుల్‌ చోక్సీ, నీరవ్ మోదీలను స్వదేశానికి రప్పించేందుకు దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేస్తున్న ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మెహుల్ చోక్సీ ప్రస్తుతం అంటిగ్వా పౌరుడని ఆయనను భారత్‌కు పంపబోమని ఓ అంటిగ్వా అధికారి స్పష్టం చేశారు.

రూ 13,500 కోట్ల పీఎన్బీ స్కామ్‌లో నిందితుడైన చోక్సీతోపాటు ఆయన మేనల్లుడు నీరవ్ మోదీని దేశానికి రప్పించేందుకు భారత్‌ ప్రత్యేక విమానాన్ని కరీబియన్‌ దీవులకు పంపుతోందన్న వార్తల నేపథ్యంలో అంటిగ్వా ప్రధాని గాస్టన్ బ్రౌన్ కార్యాలయ ప్రధాన అధికారి మాక్స్‌ హర్ట్‌ పై విధంగా పేర్కొన్నట్టు ఇండియా టుడే తెలిపింది.  

మెహుల్‌ చోక్సీ కోసం భారత్‌ నుంచి అధికారులు అంటిగ్వా, బార్బుడాలకు వస్తున్నారన్న సమాచారం తమ ప్రభుత్వం వద్ద లేదని ప్రధాని గాస్టన్‌ బ్రౌన్‌ కార్యాలయ సిబ్బంది చీఫ్‌ మాక్స్‌ హర్ట్‌ పేర్కొన్నట్టు సమాచారం.  

మెహుల్‌ చోక్సీ ఇప్పుడు అంటిగ్వా పౌరుడని, ఆయన తన భారత పౌరసత్వాన్ని వదిలివేయడంతో భారత పౌరుడు కారని ఆయన అంటిగ్వా పౌరసత్వాన్ని తాము రద్దు చేయబోమని హర్ట్‌ పేర్కొన్నారు.

వెస్టిండీస్‌ క్రికెట్‌ మ్యాచ్‌ను వీక్షించేందుకు భారత బృందం అంటిగ్వాకు రానుందని తాను భావిస్తున్నాన్నారు. చోక్సీని అరెస్ట్‌ చేయడం లేదా ఆయనను తీసుకువెళ్లేందుకు భారత బృందం అంటిగ్వా వస్తుందని తాము భావించడం లేదన్నారు.

జనవరి 31న వెస్టిండీస్‌తో రెండో టెస్ట్‌ మ్యాచ్‌ అంటిగ్వాలో ప్రారంభం అవుతుండటంతో భారత అధికారులు అంటిగ్వా రావచ్చని చెప్పుకొచ్చారు. ఓ చార్టెడ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో క్రికెట్ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఇండియా నుంచి వస్తుండటం మంచి పరిణామం అని ప్రధాని గాస్టన్‌ బ్రౌన్‌ కార్యాలయ సిబ్బంది చీఫ్‌ మాక్స్‌ హర్ట్‌ వెటకారం చేశారు.

59 ఏళ్ల చోక్సీ గతేడాది ఆంటిగ్వా పౌరసత్వాన్ని పొందగా, అప్పుడే గయానాలోని భారత హైకమిషన్‌కు తన రద్దయిన ఇండియన్ పాస్‌పోర్టు (జెడ్3396732)ను అప్పగించేశాడని గుర్తుచేశారు. 

అంటిగ్వా పౌరసత్వం కోసం 177 డాలర్ల ఫీజునూ చోక్సీ చెల్లించాడని ప్రధాని గాస్టన్‌ బ్రౌన్‌ కార్యాలయ సిబ్బంది చీఫ్‌ మాక్స్‌ హర్ట్‌ చెప్పారు. తనను అప్పగించాలన్న భారత్ అభ్యర్థనపైనా ఆంటిగ్వా కోర్టుల్లో చోక్సీ న్యాయపోరాటం చేస్తున్నట్లు తెలిపారు.

2017 నవంబర్‌లో పెట్టుబడుల ద్వారా ఆంటిగ్వా పౌరసత్వం కోసం చోక్సీ ప్రయత్నించగా, 2018లో అది దక్కింది. జూలైలో చోక్సీ తమ దేశంలోనే ఉన్నాడని ఆంటిగ్వా అధికార వర్గాలు ధ్రువీకరించాయి.

నిరుడు జనవరిలో కుటుంబంతోసహా చోక్సీ దేశం విడిచి పారిపోయిన సంగతి విదితమే. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కుంభకోణంలో గీతాంజలి జెమ్స్ అధినేత మెహుల్ చోక్సీ ప్రధాన నిందితుల్లో ఒకరిగా ఉన్న విషయం తెలిసిందే. 

బ్యాంకులకు రూ.7,000 కోట్లను ఎగవేసి పారిపోయిన విన్సమ్ డైమండ్స్ అధినేత జతిన్ మెహతా కూడా కరేబియన్ దీవుల్లోనే ఉన్నాడని తెలియడంతో చోక్సీ, మెహతాల కోసం సీబీఐ, ఈడీలు అక్కడికి వెళ్లాలని చూస్తున్నారు.

తిరుగు ప్రయాణంలో ఐరోపాలో ఉన్నాడని తెలుస్తున్న నీరవ్ మోదీ కోసం కూడా గాలింపులు చేపట్టనున్నారు. భారత్‌తో ఎలాంటి ఒప్పందాలు లేకపోవడంతో కరేబియన్ దీవుల పౌరసత్వాన్ని పొందుతూ ఆర్థిక నేరగాళ్లు తప్పించుకుంటున్నారు. వీరిని రప్పించడం భారత్‌కు తలనొప్పిగా పరిణమిస్తున్నది.
 

Follow Us:
Download App:
  • android
  • ios