Asianet News TeluguAsianet News Telugu

సుందర్ పిచాయ్ ఓటు వేశారా! అసలేం జరిగింది?

సుందర్ పిచాయ్ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు అమెరికా నుంచి ప్రత్యేకంగా వచ్చారని ప్రచారం చేశారు. ఇందుకు ఓ ఫొటోను కూడా జతచేశారు. దీంతో నెటిజన్లలో కొందరు ఇది నిజమేనని నమ్మి.. విస్తృతంగా వైరల్ చేశారు.

Elections 2019: Did Google CEO Sundar Pichai Vote? Viral Photo   Fact Checked
Author
New Delhi, First Published Apr 19, 2019, 10:06 AM IST

న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో వాస్తవాల కంటే అవాస్తవాలు, అసత్య ప్రచారాలు, ఊహాజనిత విషయాలే ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి. దీంతో ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలుసుకోవడం కూడా ఇతర నెటిజన్లకు కష్టంగా మారుతోంది. ఏదైనా విషయం సోషల్ మీడియాలో వైరల్ అయితే.. అది నిజమో కాదో అని ఆలోచించకుండానే పలువురు షేర్లు చేస్తూ ఇతరులను కూడా తప్పుదారి పట్టిస్తున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా చోటు చేసుకుంది. 

గురువారం(ఏప్రిల్ 18)నాడు దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని 95 లోక్ సభ స్థానాలకు 2వ దశ లోక్‌సభ పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుని ఇంక్ అంటించుకున్న చేతివేలును చూపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. 

కొందరు నెటిజన్లు అత్యుత్సాహంతో ఓటు వేయని ప్రముఖుల ఫొటోలను కూడా ఓటు వేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఏకంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా గురువారం భారతదేశం వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారని పోస్టులు పెట్టారు. 

సుందర్ పిచాయ్ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు అమెరికా నుంచి ప్రత్యేకంగా వచ్చారని ప్రచారం చేశారు. ఇందుకు ఓ ఫొటోను కూడా జతచేశారు. దీంతో నెటిజన్లలో కొందరు ఇది నిజమేనని నమ్మి.. విస్తృతంగా వైరల్ చేశారు. మరికొందరు ఆ ఫొటోను పసిగట్టి ఫేక్ అంటూ కొట్టిపారేశారు. 

ఆ ఫొటోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సుందర్ పిచాయ్ 2017లో ఐఐటీ ఖరగ్‌పూర్‌ను సందర్శించిన నాటిది కావడం గమనార్హం. ఆ సమయంలో సుందర్ పిచాయ్ ఆ ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.

అయితే, ఈ ఫొటోనే వాడుకున్న కొందరు సోషల్ మీడియాలో నెటిజన్లను తప్పుదోవ పట్టించారు. ఇక అసలు విషయంలోకి వెళితే.. తమిళనాడులోని మధురైలో సుందర్ పిచాయ్ జన్మించారు. 

అయితే, ఆయన ప్రస్తుతం అమెరికా పౌరసత్వం కలిగి ఉన్నారు. అందువల్ల ఆయన మనదేశంలో జరిగే ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉండదు. భారత పౌరసత్వం కలిగి ఇతర దేశాల్లో ఉండే ప్రవాసులకు మాత్రమే ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అనుమతిస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios