Asianet News TeluguAsianet News Telugu

ఆ పరిస్థితి రావొద్దు: ఏటీఎంలు ‘నిండుకుంటున్నాయి’.. పార్లమెంటరీ స్థాయి సంఘం ఆందోళన

రోజురోజుకు నిండుకుంటున్న ఏటీఎం సెంటర్లను పూర్తిగా నింపాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం ఆర్బీఐని కోరింది. ప్రజలకు నిధుల కొరత సమస్య ఎదురు కాకుండా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించింది. 

Dry ATMs: Parliament panel nudges RBI to fix the problem
Author
New Delhi, First Published Jan 7, 2019, 11:29 AM IST

న్యూఢిల్లీ: దేశంలో నగదు లేకుండా దర్శనమిస్తున్న ఏటీఎంల్లో నగదు నిండుగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచించింది. ఈ పరిస్థితి ద్రవ్య కొరతకు దారి తీయవద్దని కమిటీ పేర్కొంది. నగదు నిండుగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. తగినన్ని ఏటీఎంలను అందుబాటులోకి తేవాలని బ్యాంకులనూ కోరింది.

ఔట్ ఆఫ్ సర్వీస్ ఏటీఎంలకు మరమ్మతులు చేయండి
ఔట్ ఆఫ్ సర్వీస్ ఏటీఎంలకు మరమ్మతులు చేయాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచించింది. బ్యాంకుల ద్వారా జన్ ధన్ ఖాతాలు భారీగా తెరుచుకున్నాయని, ఆ ఖాతాదారులకు సరిపడా ఏటీఎంలు లేకుండా ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన ఈ స్టాండింగ్ కమిటీ గత వారం పార్లమెంట్‌లో తమ నివేదికను ప్రవేశపెట్టింది. 

దేశంలో 2.21 లక్షల ఏటీఎంల సేవలు
గతేడాది సెప్టెంబర్ నాటికి దేశంలో 2,21,492 ఏటీఎంలు ఉన్నాయని ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 1,43,844 ఏటీఎంలు ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏటీఎంలు, 59,645 ఏటీఎంలు ప్రైవేట్ రంగ బ్యాంకులవి, 18,003 విదేశీ బ్యాంకులు, పేమెంట్స్ బ్యాంకులు, చిన్నతరహా ఆర్థిక బ్యాంకులతోపాటు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు చెందిన, నిర్వహిస్తున్న వైట్ లేబుల్ ఏటీఎంలు కూడా ఉన్నాయి. 

తగ్గుతున్న డిజిటల్ పేమెంట్స్.. ట్రెడిషనల్ లావాదేవీలకే పెద్దపీట
కాగా, డిజిటల్ లావాదేవీలు తగ్గుముఖం పట్టి, తిరిగి సంప్రదాయ నగదు లావాదేవీలు పెరుగుతున్నాయని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయ పడింది. ఏటీఎంలలో నగదు లభ్యత లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నది. గ్రామీణ, తృతీయ, ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఏటీఎంలు చాలావరకు నో క్యాష్ బోర్డులతో కనిపిస్తున్నాయన్నది. 

కొత్త నియామకాలు చేపట్టండి: బ్యాంకులకు పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచన
పదవీ విరమణలతో ఖాళీ అవుతున్న స్థానాలను కొత్త నియామకాలతో భర్తీ చేయాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు పార్లమెంటరీ ప్యానెల్ సూచించింది. సమీప భవిష్యత్‌లో పెద్ద ఎత్తున ఉద్యోగులు రిటైర్ కానుండటంతో జూనియర్, మధ్య స్థాయిల్లోని వారితో ఆ లోటును పూడ్చుకోవాలన్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2019-20)లో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని 95 శాతం జీఎం స్థాయి ఉద్యోగులు, 75 శాతం డిప్యూటీ జీఎం స్థాయి ఉద్యోగులు, 58 శాతం అదనపు జీఎం స్థాయి ఉద్యోగులు పదవీ విరమణ తీసుకుంటున్నారు. 

ఒత్తిడి తగ్గించాల్సి ఉన్నదని వ్యాఖ్యానించిన పార్లమెంటరీ స్థాయీ సంఘం
ఈ క్రమంలో బ్యాంకింగ్ సిబ్బంది ఎంపిక ఇనిస్టిట్యూట్ వివరాల ప్రకారం క్లరికల్, ప్రొబేషనరీ ఆఫీసర్, స్పెషలిస్ట్ ఆఫీసర్ స్థాయిల్లో ఉద్యోగుల సంఖ్య పడిపోతున్నదన్న కమిటీ.. ఎక్కువ పని గంటలు, ఒత్తిడితో కూడిన విధులు, తక్కువ వేతనాలు వంటివి బ్యాంకింగ్ రంగ ఉద్యోగార్థులకు నిరుత్సాహకరంగా ఉన్నాయని పేర్కొన్నది. కాబట్టి ఈ అంశాలపై దృష్టి సారించి సమస్యను అధిగమిస్తే బాగుంటుందని సూచించింది.

మరో 69 విదేశీ శాఖల మూసివేతకు ప్రభుత్వరంగ బ్యాంకుల యోచన
ప్రభుత్వరంగ బ్యాంకులు మరో కీలక నిర్ణయం తీసుకున్నాయి. విదేశాల్లో ఉన్న శాఖల ద్వారా అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. పునర్ వ్యవస్థీకరణలో భాగంగా వచ్చే కొన్ని నెలల్లో ఈ శాఖలకు తాళం వేయనున్నట్లు ప్రకటించాయి. ఇప్పటికే 35 బ్రాంచ్‌లను మూసివేసిన బ్యాంకులు, మరో 69 శాఖల మూసివేతకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
 
గతేడాది జనవరి నాటికి విదేశాల్లో 165 శాఖలతో బ్యాంకుల సేవలు
గతేడాది జనవరి 31 నాటికి 165 విదేశాల్లో శాఖలు నిర్వహిస్తున్నాయి ప్రభుత్వరంగ బ్యాంకులు. వీటిలో అత్యధికంగా ఎస్‌బీఐ 52 శాఖలను, బ్యాంక్ ఆఫ్ బరోడా 50, బ్యాంక్ ఆఫ్ ఇండియా 29 శాఖలను ఏర్పాటు చేశాయి. బ్రిటన్‌లో 32 శాఖలను ఏర్పాటు చేసిన పీఎస్‌బీలు..హాంకాంగ్, అరబ్ దేశాల్లో 13 చొప్పున, సింగపూర్‌లో 12 నిర్వహిస్తున్నాయి. 2016-17లో 41 శాఖలు మూతపడ్డాయి. వీటిలో ఎస్‌బీఐ తొమ్మిదింటిని మూసివేయగా, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎనిమిది, బ్యాంక్ ఆఫ్ బరోడా ఏడు శాఖలకు తాళం వేశాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios