Asianet News TeluguAsianet News Telugu

పెరుగుతున్న డిజిటల్ పేమెంట్స్.. నిర్ధారించిన ఆర్బీఐ

షాపుల్లోనూ, ఇతర సంస్థలతో జరిపే ఆర్థిక లావాదేవీల్లో డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్నాయి. వినియోగదారులు తమ వద్ద ఉన్న డెబిట్ కార్డులతో చెల్లింపులు పూర్తి చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో 27% డెబిట్‌ కార్డు లావాదేవీలు పెరిగాయని ఆర్బీఐ నివేదిక పేర్కొంది.
 

Debit card swipes on PoS terminals rise 27% in March 2019 as per RBI data
Author
Hyderabad, First Published May 19, 2019, 3:35 PM IST

ఏదేనా షాపులోగానీ, వర్తకుడి వద్ద గానీ కొనుగోళ్లు జరిపినప్పుడు నగదు చెల్లింపులు చేసేవారం. కానీ ప్రస్తుతం నగదుకు బదులు డెబిట్‌ కార్డుతో చెల్లింపులు జరిపే భారతీయుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రిజర్వ్‌ బ్యాంక్‌ డేటా ప్రకారం.. ఈ మార్చిలో పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌ (పీఓఎస్‌) టర్మినళ్ల వద్ద డెబిట్‌ కార్డు లావాదేవీలు వార్షిక ప్రాతిపదికన 27 శాతం పెరిగాయి. 

కాగా, ఇదే సమయంలో ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణల్లో వృద్ధి 15 శాతానికి తగ్గింది. గత మార్చిలో డెబిట్‌ కార్డు ద్వారా 40.7 కోట్ల లావాదేవీలు జరిగాయి.  89.1 కోట్ల ఏటీఎం విత్‌డ్రాయల్స్‌ నమోదయ్యాయి. 

2016 మార్చి నుంచి 2019 మార్చి కాలానికి డెబిట్‌ కార్డు ద్వారా వర్తకులకు చెల్లింపులు 250 శాతానికి పైగా పెరిగాయి. 2016, మార్చిలో 11.2 కోట్లుగా నమోదైన లావాదేవీల సంఖ్య 2019 మార్చి నాటికి 40.7 కోట్ల స్థాయికి చేరుకుంది.

ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ లావాదేవీలు మాత్రం కొన్నేళ్లుగా ఎలాంటి వృద్ధి లేకుండా అదే స్థాయిలో కొనసాగుతున్నాయి. నెలవారీ విత్‌డ్రాయల్స్‌ లావాదేవీలు 80 కోట్ల స్థాయికి కొంచెం అటూఇటూ నమోదవుతున్నాయి. 

గతేడాది నవంబర్ నెలలో 86.9 కోట్లుగా నమోదైన ఏటీఎం విత్‌డ్రాయల్‌ లావాదేవీలు.. ఈ మార్చిలో 89 కోట్లకు చేరుకున్నాయి. 2016 నవంబరు 8న మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేశాక దేశంలో డిజిటల్‌ లావాదేవీలు, అందునా కార్డు ద్వారా చెల్లింపులు అనూహ్యంగా పుంజుకున్నాయి.

మర్చంట్‌ పీఓఎస్‌ల వద్ద క్రెడిట్‌ కార్డు లావాదేవీలు 22 శాతం వృద్ధి చెందాయి. 2018 మార్చిలో 12.7 కోట్ల లావాదేవీలు జరగగా.. ఈ ఏడాది అదే నెలకు లావాదేవీలు 16.2 కోట్లు.
దేశంలో పీఓఎస్‌లు గణనీయంగా అందుబాటులోకి వస్తున్నాయి.

గత రెండేళ్లలో భారీ సంఖ్యలో ఏటీఎంలు మూతపడుతుండటం కూడా పీఓఎస్‌లు అందుబాటులోకి రావడంతోపాటు డిజటల్ చెల్లింపుల పెరుగుదలకు కొంత వరకు కారణమని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. కొన్నేళ్లుగా దేశంలోని ఏటీఎంల సంఖ్య 2.2 లక్షల స్థాయిలోనే ఉన్నాయి.

ఈ మార్చి నెలాఖనాటికి దేశంలో పీఓఎస్‌ టర్మినళ్లు 37 లక్షలకు పెరిగాయి. 2017, మార్చిలో నమోదైన 25 లక్షల స్థాయితో పోలిస్తే దాదాపు 50 శాతం మేర వృద్ధి చెందింది. 

దేశంలో పీఓఎస్‌లు డిమాండ్‌కు తగిన స్థాయిలో లేవని మార్కెట్‌ విశ్లేషకులు  పేర్కొంటున్నారు. కేవలం వర్తకులకు చెల్లించే సందర్భాల్లోనే కాదు, ఇతరులతో ఆర్థిక లావాదేవీల్లోనూ నగదుకు బదులు డిజిటల్‌ మార్గాన్ని ఎంచుకునే వారు గణనీయంగా పెరుగుతున్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios