Asianet News TeluguAsianet News Telugu

బిట్ కాయిన్ గోవిందా!: వారంలో 700 $ బిలియన్లు హాంఫట్!!

ఏడాది క్రితం క్రిప్టో కరెన్సీకి ఉన్న డిమాండ్, పలుకుబడి ఇప్పుడు లేదు. మదుపర్ల భ్రమలు తొలగిపోతున్నాయి. ప్రభుత్వాలు, కేంద్రీయ బ్యాంకుల నియంత్రణ కూడా దీనికో కారణం అన్న అభిప్రాయం ఉన్నది. ఏతావాతా ఒక్క వారంలోనే 700 బిలియన్ల డాలర్లు కోల్పోయింది. మున్ముందు మరింత పతనమయ్యే అవకాశాలు ఉన్నాయి. సంస్థాగత మదుపర్లు ఎవ్వరూ వీటిల్లో పెట్టుబడులు పెట్టకపోవడం గమనార్హం. 

Crypto losses near $700 billion in worst week since bubble burst
Author
New Delhi, First Published Nov 24, 2018, 10:19 AM IST

న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీ ‘బిట్ కాయిన్’పై ఇప్పటివరకు స్టాక్ ఎక్సేంజీల్లో తొలగని సందిగ్దం.. తొలగిపోతున్నాయి. ప్రత్యమ్నాయ కరెన్సీగా అవతరించిన బిట్‌కాయిన్ పెరిగిన వేగంగా పతనమవుతోంది. గత ఏడాది అక్టోబర్‌లో 4200 డాలర్లు పలికిన బిట్‌కాయిన్ కేవలం మూడు నెలల్లో కాలంలో డిసెంబర్ నాటికి 19900 డాలర్లకు చేరుకుంది. దీంతో అహోఓహో అంటూ అంతా ఎగబడి బిట్‌కాయిన్ ట్రేడింగ్‌లోకి దిగారు. దేశంలో చట్టబద్దం కాకున్నా పలువురు ఇందులో ట్రేడింగ్ చేస్తూ నష్టాలపాలయ్యారు. పల్లెటూళ్లకు సైతం బిట్ కాయిన్ మైకం పాకింది.  క్రిప్టో కరెన్సీలు భారీగా పతనం అయ్యాయి. ఆయా దేశాల ప్రభుత్వాల నియంత్రణ నిబంధనలు కఠినతరమయ్యాయి.అంతేకాదు క్రిప్టో కరెన్సీ కమ్యూనిటీల్లోనూ విభేదాలు మొదలయ్యాయి. 

గమ్మత్తేమిటంటే పదో వసంతంలో అడుగు పెట్టిన బిట్‌కాయిన్‌లో ఈ ఏడాది మార్కెట్లో పెట్టి నష్టపోయిన వాళ్లు.. బిట్‌కాయిన్‌లో పెట్టనందుకు సంతోషించాల్సిన తరుణం. ఎందుకంటే గత డిసెంబర్ గరిష్ఠాలతో పోలిస్తే ఇప్పటికి ఏకంగా 75 శాతానికి పైగా కోల్పోయింది క్రిప్టోకరెన్సీ. మరి భవిష్యత్‌లో మరింత తగ్గుతుందా లేదా అంతక్రితంలా ఉవ్వెత్తున ఎగుస్తుందా అన్నది తేలాల్సి ఉంది.

జామీ డైమన్‌, వారెన్‌ బఫెట్‌, జాక్‌ బోగ్లే వంటి నిపుణులు చెప్పినదానికి జరిగిన దానికి పొంతన లేకుండా పోయింది. 2017లో బిట్‌కాయిన్‌ బుడగ ఏర్పడ్డ సమయంలో ఎవరు లాభపడ్డారంటే.. కేవలం ఇన్‌సైడర్లు అంటే మైనింగ్‌ కంపెనీలు, క్రిప్టో ఎక్స్ఛేంజీలు మాత్రమే. ఇంకా చెప్పాలంటే ముందుగా అందులో పెట్టుబడులు పెట్టి.. గరిష్ఠ స్థాయిల వద్ద దానిని వదిలించుకున్నవారు. జనవరి నుంచి చూస్తే 700 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.49 లక్షల కోట్లు) మేర డిజిటల్‌ నగదు తుడిచిపెట్టుకుపోయిందని లెక్కలు చెబుతున్నాయి. ఒక విభిన్న పెట్టుబడి సాధనం దొరికిందనుకున్న వారికి చుక్కలు చూపింది. 

కానీ ఈ ఏడాది జనవరి నుంచి 19900 ఇప్పటి వరకు పతనం అవుతూ ప్రస్తుతం 4300 డాలర్లకు పడిపోయింది. ఈ పతనం ఇక్కడితో ఆగే సూచనలు కనిపించడం లేదు. నవంబర్ 16వ తేదీ నుంచి బ్లూమ్‌బర్గ్ క్రిప్టో కరెన్సీ ఇప్పటి వరకు 23 శాతం నష్టపోయింది. జనవరి నుంచి ఇప్పటివరకు ఒక వారంలో జరిగిన పతనాల్లో ఇదే అత్యధికం. గత 11 నెలల కాలంలో ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ ట్రేడర్లు దాదాపు 700 బిలియన్ డాలర్ల మేర నష్టపోయారని అంచనా.

ప్రపంచవ్యాప్తంగా రెగ్యులేటరీ నిబంధనలు కఠినతరం కావడం, క్రిప్టో కరెన్సీ కమ్యూనిటీల మధ్య విభేదాలు, క్రిప్టో ఎక్స్చేంజిల సందిగ్ధ ధోరణులు పతనాన్ని శాసిస్తున్నాయి. అనేక క్రిప్టో కరెన్సీలు ఇప్పటికే 70 శాతం పైగా నష్టపోయినా వీటిలో కోలుకునే అవకాశాలు కనిపించడం లేదని క్రిప్టో కరెన్సీ విశ్లేషకుడు స్టీఫాన్ ఇన్నెస్ తెలిపారు. అన్ని రకాల క్రిప్టో కరెన్సీల అమ్మకాల మరింతగా పెరిగి పాతాళానికి పడిపోయే అవకాశాలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. 

కోలుకోవడానికి ఏమాత్రం అవకాశం లేకుండా పతనం అవుతున్నా ఇప్పటికీ అనేక మంది క్రిప్టోలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారని ప్రపంచ వ్యాప్తంగా ఫారెక్స్ సేవలను అందిస్తున్న ఓండా కార్పోరేషన్ ఆసియా, పసిఫిక్ రీసెర్చి అధిపతి అయిన స్టిఫాన్ ఇన్నెస్ అన్నారు.బిట్‌కాయిన్ పతనం కొనసాగితే 3000 డాలర్ల దిగువకు కూడా దిగిపోయే అవకాశం ఉందన్నారు. అలాంటి పరిస్థితిలో ట్రేడర్లంతా మరింత వేగంగా అమ్మకాలకు దిగే అవకాశం ఉందన్నారు. 

వచ్చే జనవరి నాటి బిట్‌కాయిన్ ధర 2,500 డాలర్లకు పతనం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఓండా కార్పోరేషన్ ఆసియా, పసిఫిక్ రీసెర్చి అధిపతి అయిన స్టిఫాన్ ఇన్నెస్ అన్నారు. బుధవారం నాడు కాస్త కోలుకున్నట్టు కనిపించిన గురువారం భారీగా పతనం అయింది. బిట్‌కాయిన్‌కు పోటీగా వచ్చిన ఎథర్, ఎక్స్‌ఆర్‌పీ, లైట్ కాయిన్‌లు కూడా గురువారం 4 శాతం పైగా నష్టపోయాయి. జనవరిలో క్రిప్టో కరెన్సీలన్నింటి విలువ 835 బిలియన్ డాలర్లుండగా, ప్రస్తుతం 140 బిలియన్ డాలర్లకు పతనం అయిందని క్రిప్టోల విలువను మదింపు చేస్తున్న కాయిన్ మార్కెట్ క్యాప్ డాట్‌కామ్ తెలిపింది.

క్రిప్టోల ధరలు ఈ ఏడాది జనవరిలో గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు కొనుగోలు చేసిన రిటైల్ ట్రేడర్లంతా ప్రపంచవ్యాప్తంగా భారీగా నష్టపోయారు. క్రిప్టో కరెన్సీకి అవసరమైన ఎకో సిస్టమ్‌ను అందించిన చిప్ తయారీ దారు ఎన్‌విడియా కార్పోరేషన్ షేర్ కూడా 40 శాతం పైగా కేవలం గత నెల రోజుల్లోనే నష్టపోయింది. క్రిప్టోకరెన్సీ మైనింగ్ చిప్‌లకు డిమాండ్ తగ్గడంతో ఎన్‌విడియా ఆర్థిక ఫలితాలు నిరుత్సాహకరంగా వెలువడ్డాయి. కాగా, క్రిప్టో కరెన్సీల పతనం కారణంగా ఆర్థికవ్యవస్థలపై ప్రభావం చాలా తక్కువగా ఉంది.

సంస్థాగత మదుపర్లు ఎవరూ ఈ వర్చువల్ కరెన్సీలలో పెట్టుబడి పెట్టలేదు. ఒకవేళ పెట్టుబడి పెట్టినా అది చాలా పరిమితంగా ఉంది. సంప్రదాయ ఫైనాన్షియల్ మార్కెట్లలో ఒడిదుడుకుల కారణంగా క్రిప్టో కరెన్సీలలో ఎప్పటికీ అవకాశాలు ఉంటాయని క్రిప్టో కరెన్సీలను ప్రమోట్ చేస్తున్న సంస్థలు వాదిస్తున్నాయి. ఇక సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికపుడు మారుస్తూ ఉండడం కూడా పతనానికి కారణమని చెబుతున్నారు.

బిట్‌కాయిన్‌ నెట్‌వర్క్‌ను జనవరి 2009లో ఒక ఓపెన్‌ సోర్స్‌ సాఫ్ట్‌వేర్‌ రూపంలో రూపొందించిన సంగతి తెలసిందే. అందులోని సభ్యులు ఆ సాఫ్ట్‌వేర్‌ను మెరుగుపరుస్తూనే ఉన్నారు. గతేడాది బిట్‌కాయిన్‌లో ఉన్న సాంకేతిక లోటుపాట్లు తొలగించేందుకు బిట్‌కాయిన్‌కు కొత్త వర్షన్‌గా బిట్‌కాయిన్‌ క్యాష్‌ను విడుదల చేసింది. దీని విషయంలో నెట్‌వర్క్‌లో అభిప్రాయభేదాల వల్ల  రెండు గ్రూపులుగా విడిపోయారు. ట్రేడింగ్‌ విషయంలో ఎక్స్ఛేంజీలు కూడా తికమకపడ్డాయి. క్రిప్టో కరెన్సీని సాధారణ లావాదేవీలకు ఉపయోగపడేలా చేస్తామని చెప్పిన డెవలపర్లు ఆ మాటను నెరవేర్చలేకపోయారు. ఇది కూడా అపనమ్మకానికి, విక్రయాలకు దారి తీసిందని చెప్పవచ్చు.

బిట్‌కాయిన్‌ విలువ బాగా క్షీణించడంతో కొనుగోళ్లకు వీలుగా ఉందని ఆర్థిక విశ్లేషకులు చెబుతుండటంతో భారత మదుపర్లు ఏం చేయాలి? క్రిప్టో కరెన్సీ విషయంలో భారత ప్రభుత్వం ఇంకా ఏమీ తేల్చలేదు. గతేడాది నవంబర్‌లోనే ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ ఆధ్వర్యంలోని కమిటీకి ముసాయిదా నిబంధనలను రూపొందించమని ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ కమిటీ వచ్చే నెలలో నివేదికను సమర్పించనుంది. నిషేధం విధిస్తుందా లేదా నియంత్రిస్తుందా అన్నది తేలాల్సి ఉంది. 

నిషేధం అయితే సాధ్యం కాదని భారత్‌లోని క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీల్లో ఒకటైన వాజిక్స్‌ సీఈఓ నిశ్చల్‌ శెట్టి అన్నారు. ఎక్స్ఛేంజీలను నిషేధించడం ద్వారా వర్చువల్‌ కరెన్సీలపై ప్రైవేట్ వ్యక్తుల హక్కును తొలగించలేమని ఆయన వివరించారు. మదుపర్లు క్లౌడ్‌లో లేదా వ్యక్తిగత వాలెట్లు లేదా యూఎస్‌బీ డ్రైవ్స్‌లో తమ డిజిటల్‌ ఆస్తులను దాచిపెట్టుకోవడానికి వీలుంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో నిషేధం బదులు మెరుగైన నియంత్రణ విధించడం మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios