Asianet News TeluguAsianet News Telugu

ఆర్బీఐ వార్నింగ్: స్థిరత్వానికి పొంచిఉన్న ‘క్రూడ్‌ ధర’ ముప్పు


అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పెరిగినా కొద్దీ భారత ఆర్థిక వ్యవస్థకు సవాలేనని ఆర్బీఐ అధ్యయన నివేదిక హెచ్చరించింది. బ్యారెల్ ముడి చమురుపై 65 డాలర్ల తర్వాత 10 డాలర్ల ధర పెరిగినా దేశీయ ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. మరోవైపు ఆంధ్రాబ్యాంక్ తన లావాదేవీల నిర్వహణ కోసం 1600 మంది బిజినెస్ కరస్పాండెంట్లను నియమించుకోనున్నది. ఎనిమిదేళ్లుగా బిజినెస్ కరస్పాండెంట్లతో ఖాతాదారులకు ఆంధ్రా బ్యాంక్ సేవలందిస్తోంది. 

Crude shocker can be rude shocks for economy: RBI
Author
Mumbai, First Published Jan 7, 2019, 11:31 AM IST

ముంబై: ముడి చమురు ధరల పెరుగుదలతో దేశ ఆర్థిక స్థిరత్వానికి విఘాతమేనని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) హెచ్చరించింది. క్రూడ్‌ ధరలు ఒక్కసారిగా పుంజుకుంటే అంతర్జాతీయ వాణిజ్యంలో కరెంట్‌ ఖాతా లోటు, ద్రవ్య లోటు అదుపు తప్పుతుందని ఆర్‌బీఐ ఆర్థిక వేత్తల అధ్యయన నివేదిక తెలిపింది. తద్వారా ధరల సూచీ మళ్లీ ఎగబాకుతుందని, గరిష్ఠ స్థాయి వృద్ధికి గండి పడుతుందని పేర్కొంది. 

80 శాతం దిగుమతులపైనే భారత్ ఇంధన అవసరాలు
భారత్‌ ఇంధన అవసరాల కోసం ప్రధానంగా (80 శాతానికి పైగా) దిగుమతులపైనే ఆధారపడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధం (ఏప్రిల్‌-సెప్టెంబర్)లో ముడి చమురు ధరలు 12 శాతం మేర పెరిగాయి. డిమాండ్‌ అన్యూహంగా పెరగడంతోపాటు ప్రపంచ వృద్ధి పునరుద్ధరణ బాట పట్టడం, భౌగోళిక రాజకీయ సంక్షోభాలతో సరఫరా తగ్గడం ఇందుకు ప్రధాన కారణం అని ఆర్బీఐ వివరించింది.
 
నవంబర్ ద్వితియార్థం నుంచి తగ్గిన చమురు సెగలు
నవంబర్ ద్వితీయార్ధం నుంచి ముడి చమురు సెగలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ముడి చమురు ధర బ్యారెల్‌పై 85 డాలర్లకు చేరిన పక్షంలో కరెంట్‌ ఖాతా లోటు 10,640 కోట్ల డాలర్లకు (జీడీపీలో 3.61 శాతం) పెరగవచ్చని ఆర్బీఐ అధ్యయన నివేదిక అంచనా వేసింది. బ్యారెల్ ముడి చమురు ధర 10 డాలర్లు పెరిగితే లోటు 1,250 కోట్ల డాలర్లు పెరగవచ్చని, ఇది జీడీపీలో 0.43 శాతానికి సమానమని నివేదిక హెచ్చరించింది.

65 డాలర్ల తర్వాత 10 డాలర్లు పెరిగితే ద్రవ్యోల్బణం ఇలా 
ఇక బ్యారెల్ ముడి చమురు 65 డాలర్ల నుంచి మరో పది డాలర్లు పెరిగితే టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 0.49 శాతం మేర ఎగబాకుతుందని, 55 డాలర్ల నుంచి పది డాలర్లు పెరిగితే 0.58 శాతం పుంజుకుంటుందని ఆర్థికవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. ఒకవేళ ప్రభుత్వం చమురు ధరా భారాన్ని వినియోగదారులపైకి బదిలీ చేయని పక్షంలో ప్రతి పది డాలర్ల పెరుగుదలకు ద్రవ్య లోటు 0.43 శాతం మేర ఎగబాకుతుందని అధ్యయన నివేదిక పేర్కొంది.

1,600 మంది బిజినెస్‌ కరస్పాండెంట్ల నియామకానికి ఆంధ్రాబ్యాంక్
ఫైనాన్షియల్‌ ఇంక్లూజన్‌ ప్రాజెక్టులో భాగంగా 1,600 మంది బిజినెస్‌ కరస్పాండెంట్ల నియమకానికి ప్రభుత్వ రంగంలోని ఆంధ్రా బ్యాంక్‌ సిద్ధమవుతోంది ఖాతా ప్రారంభం, ఇంటి వద్దకే బ్యాంకింగ్‌ సేవలు, ఏటీఎం సేవలు, మొండి బకాయిల వసూలు వంటి వాటి కోసం వీరిని నియమించుకోనున్నట్లు బ్యాంక్‌ తెలిపింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో ఎక్కువగా బిజినెస్‌ కరస్పాండెంట్లను నియమించుకోనున్నట్లు పేర్కొంది. 

8 ఏళ్లుగా బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా ఖాతాదారులకు ఆంధ్రాబ్యాంకు సేవలు
ఆంధ్రా బ్యాంక్‌ 2010 నుంచి బిజినెస్‌ కరస్పాండెంట్‌ మోడల్‌ ద్వారా మైక్రో ఏటీఏం/కియోస్క్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీ వంటి సేవలను వినియోగదారులకు అందిస్తోంది. తాజాగా ఇతర ఆర్థిక, ఆర్ధికేతర లావాదేవీలైన రుణాల రికవరీ, సామాజిక పథకాల ఎన్‌రోల్‌మెంట్‌ స్కీమ్‌ వంటి సేవలను కూడా చేపడుతోంది. ఇదే సమయంలో ఆధార్‌, మొబైల్‌, పాన్‌ సీడింగ్‌, బీమా ఉత్పత్తుల విక్రయం, బ్యాంకింగ్‌ లావాదేవీల వంటి వాటిని బిజినెస్‌ కరస్పాండెంట్ల ద్వారా ఆఫర్‌ చేస్తోంది. ఈ నెల 31 నాటికల్లా కొత్త బిజినెస్‌ కరస్పాండెంట్లను నియమించుకోవాలని ఆంధ్రా బ్యాంక్‌ భావిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios