Asianet News TeluguAsianet News Telugu

కష్టాల్లో జెట్ ఎయిర్వేస్: విలీనాలపై ఎయిర్‌లైన్స్ ఫోకస్!!

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ‘ఎయిరిండియా’తోపాటు ప్రైవేట్ ఎయిర్ లైన్స్ జెట్ ఎయిర్వేస్, ఇండిగోలను ఆర్థిక సమస్యలు సతమతం చేస్తున్నాయి. ఇక జెట్ ఎయిర్వేస్, ఇండిగో మేనేజ్మెంట్లు తమ నిర్వహణ పద్ధతుల్లో మార్పుల్లో భాగంగా సాధారణ విభాగాల్లో సిబ్బందిలో కోత విధిస్తున్నాయి. 

Consolidation is the best way forward for Indias struggling aviation sector
Author
Mumbai, First Published Oct 29, 2018, 9:49 AM IST

జెట్ ఎయిర్ వేస్‌లో ఆర్థిక సంక్షోభం, ఇండిగోలో సిబ్బంది కోత, రుణాల ఊబిలో ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిరిండియా సమస్యలు ఆ రంగంలో విలీనాల దిశగా ముందుకు సాగుతున్నాయి. కొన్నాళ్లుగా లాభాల్లో దూసుకెళ్లిన విమాన సంస్థలు.. మళ్లీ ఈ ఆర్థిక ఏడాది నష్టాల రన్‌వేపై ల్యాండ్‌ కావడంతోపాటు నిర్వహణపరమైన ఒత్తిళ్లు పెరుగుతుండటం విలీన అవకాశాలకు మరింత బలం చేకూరుతున్నది.
 
భారత విమాన సేవల రంగంలో త్వరలోనే ఒకట్రెండు విలీన, కొనుగోలు (ఎం అండ్‌ ఏ) ఒప్పందాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులంటున్నారు. ఇందుకు బలాన్ని చేకూరుస్తూ.. జెట్‌ ఎయిర్‌వేస్‌పై టాటా గ్రూపు కన్నేసినట్లు ఈ మధ్య వార్తలొచ్చాయి.

విస్తారా, ఎయిర్‌ ఏషియా ఇండియాలో ప్రధాన వాటా కలిగిన టాటా సన్స్‌.. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్‌ ఎయిర్‌వేస్‌లో మెజారిటీ వాటా కొనుగోలుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇరు వర్గాల మధ్య చర్చలు ఇంకా కొలిక్కి రాలేదని సమాచారం. 

ఇతర విమాన సంస్థల కొనుగోలుకు ఇండిగో కూడా ఆసక్తిగా ఉంది. ఆకర్షణీయమైన ఆఫర్‌ అయితే గనుక ఇతర ఎయిర్‌లైన్‌ను కొనుగోలుకు సిద్ధమేనని బుధవారం రెండో త్రైమాసిక ఫలితాల విడుదల సందర్భంగా ఇన్వెస్టర్లతో కాల్‌ కాన్ఫరెన్స్‌లో ఇండిగో ప్రమోటర్‌ రాహుల్‌ భాటియా సంకేతాలిచ్చారు.

దేశంలో అత్యధిక నగదు నిల్వలు కలిగిన విమాన కంపెనీ ఇండిగో. ఈ సంస్థ వద్ద రూ.13 వేల కోట్ల మేర నగదు నిల్వలు ఉన్నాయి. 40 శాతం మార్కెట్‌ వాటాతో అతిపెద్ద ఎయిర్‌లైన్స్‌ కంపెనీగా కొనసాగుతున్న ఇండిగో.. అంతర్జాతీయంగా సేవల విస్తరణకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసం ఎయిర్‌ ఇండియా అంతర్జాతీయ కార్యకలాపాల విభాగాన్ని కొనుగోలు చేసేందుకు గతంలో సంస్థ ఆసక్తి ప్రదర్శించింది.
 
దేశీయంగా విమానయాన రంగంలో వ్యాపార అవకాశాలపై విదేశీ ఎయిర్‌లైన్స్‌ కూడా ఆసక్తిగా ఉన్నాయి. జెట్‌లో వాటా కొనుగోలు ద్వారా ఎతిహాద్‌, టాటా గ్రూపుతో సంయుక్త భాగస్వామ్యం ద్వారా ఎయిర్‌ ఏషియా, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌లు ఇప్పటికే భారత మార్కెట్లోకి ప్రవేశించాయి.

ఖతార్‌ ఎయిర్‌వేస్‌, లుఫ్తాన్సాతోపాటు పలు ఇంటర్నేషనల్‌ ఆపరేటర్లు మన దేశీయ మార్కెట్లోకి ప్రవేశించాలని అనుకుంటున్నాయి. ఈ ప్రయత్నాల్లో భాగంగా అవి దేశీయ విమాన సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నాయి.
 
ప్రస్తుతం భారత్‌లో సేవలందిస్తున్న 26 విమాన కంపెనీల్లో 8 కంపెనీలే 98 శాతానికి పైగా మార్కెట్‌ వాటా కలిగి ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్, జెట్ ఎయిర్ వేస్, ఇండిగో, గో ఎయిర్, స్పైస్ జెట్, ఏయిర్ ఆసియా ఇండియా, విస్తారా వంటి సంస్థలే ప్రధాన వాటాదారులు.

ప్రపంచంలో ఏడో అతిపెద్ద విమాన మార్కెటైనా భారత్‌లో విమాన సేవలకు ఇప్పుడిప్పుడే డిమాండ్‌ పెరుగుతోంది. ప్రధాన కంపెనీల సేవల సామర్థ్యం మార్కెట్‌ డిమాండ్‌ కంటే అధిక స్థాయిలో ఉండటంతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు టిక్కెట్లపై భారీ రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పిస్తున్నాయి.

దీంతో వాటి మధ్య పోటీ తీవ్రతరమైంది. పైగా, పెరిగిన ఇంధన ధరలు, నిర్వహణ ఖర్చుల భారాన్ని వినియోగదారులపై మోపే సాహసం చేయలేకపోతున్నాయి. ఫలితంగా కంపెనీలపై ఆర్థికంగా ఒత్తిడి పెరిగింది. ఈ పరిణామం విమాన రంగంలో విలీనాలకు, వాటా విక్రయ ఒప్పందాలకు బాటలు వేయవచ్చని మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు.
 
మార్కెట్‌ వాటా పరంగా అతిపెద్ద విమాన సంస్థ ఇండిగో గతనెలతో ముగిసిన త్రైమాసికానికి రూ.652 కోట్ల నష్టం ప్రకటించింది. 2015 నవంబర్‌లో స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ అయ్యాక సంస్థ నష్టాలు ప్రకటించడం ఇదే తొలిసారి. భారీగా పెరిగిన నిర్వహణ ఖర్చులు, ఇండస్ట్రీలో తీవ్రతరమైన పోటీ సంస్థను నష్టాల్లోకి నెట్టాయి.

గత మూడు నెలల్లో ఇండిగో రాబడి 18% పెరిగి రూ.6,514 కోట్లుగా నమోదైంది. కానీ, అదే కాలానికి ఖర్చులు రూ.7,502.3 కోట్లకు పెరగడం నష్టాలకు కారణమైంది. పెరిగిన ఇంధన ధరల దెబ్బకు జెట్‌ ఎయిర్‌వేస్‌, స్పైస్‌జెట్‌ జూన్‌ త్రైమాసికంలోనే నష్టాల్లోకి మళ్లాయి. జూలై-సెప్టెంబర్ మధ్య ఈ రెండు సంస్థల నష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios