Asianet News TeluguAsianet News Telugu

చందాకొచ్చర్‌కు ‘ఈడీ’ కష్టాలు.. తెల్లవార్లూ ప్రశ్నల వర్షం

ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందాకొచ్చర్ వీడియోకాన్ మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాల్ ధూత్‌కు మంజూరు చేసిన రుణాల కుంభకోణంలో కష్టాల్లో చిక్కుకున్నారు. శుక్రవారం ఇంట్లో తనిఖీలు.. ఆ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో విచారణతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 

Chanda Kochhar, Questioned Till 4 AM, Visits Probe Agency's Office Again
Author
Mumbai, First Published Mar 2, 2019, 3:56 PM IST

ముంబై: ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందాకొచ్చర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సమన్లు జారీ చేసింది. వీడియోకాన్‌కు ఐసీఐసీఐ బ్యాంకు రుణ మంజూరు విషయమై విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఆమెతో పాటు వీడియోకాన్‌ ఎండీ వేణుగోపాల్‌ ధూత్‌ను కూడా విచారణకు హాజరు కావాలని పేర్కొంది.

అంతకుముందు వీరి ఇళ్లు, కార్యాలయాల్లో శుక్రవారం ఈడీ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. చందాకొచ్చర్ ఇంట్లో తనిఖీలు జరిపిన తర్వాత ఈడీ అధికారులు శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల వరకు ఆమెను ప్రశ్నించినట్లు తెలుస్తున్నది. శనివారం మధ్యాహ్నం విచారణ కోసం తమ కార్యాలయానికి రావాలని ఆదేశించారని సమాచారం.

తదనుగుణంగా ఆమె ముంబైలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇప్పటికి చందాకొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ ఎన్ ఫోర్స్ మెంట్ కార్యాలయంలోనే ఉన్నారని సమాచారం. ఈ కేసులో వీడియో కాన్ మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాల్ ధూత్ ఇంకా ఈడీ కార్యాలయానికి చేరుకోలేదు. శుక్రవారం రాత్రి 11 గంటల వరకు వేణుగోపాల్ థూత్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. 

2012లో వీడియోకాన్‌ గ్రూప్‌నకు రూ.3250కోట్ల విలువైన రుణాలను మంజూరు చేసేందుకు క్విడ్‌ప్రోకో ప్రాతిపదికన సాయం చేసినట్లు చందాకొచ్చర్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ, ఆదాయపు పన్ను శాఖ అధికారులు విచారణ చేపట్టారు.

ఐసీఐసీఐ కూడా స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఈ క్రమంలో అవకతవకలు జరిగినట్టు ప్రాథమిక విచారణలో నిర్ధరించిన సీబీఐ వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. రుణ మంజూరుకు ప్రతిగా చందాకొచ్చర్‌ భర్త దీపక్‌ కొచ్చర్‌కు చెందిన కంపెనీల్లో వీడియోకాన్‌ పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.

చందాకొచ్చర్ దంపతులు, వేణుగోపాల్ థూత్ విదేశాలకు పారిపోకుండా సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేశాయి. కానీ తానొక్కదానినే ఏకపక్షంగా వీడియో కాన్ సంస్థకు రుణం మంజూరు చేయలేదని చందా కొచ్చర్ పునరుద్ఘాటించారు. 34 ఏళ్లుగా అంకిత భావంతో కష్టపడి పని చేసిన తాను కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు ఎన్నడూ వెనుకాడలేదన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios