Asianet News TeluguAsianet News Telugu

సెకండ్ వరల్డ్‌వార్ నుంచి ఇదే రికార్డు: గోల్డ్ కొనుగోళ్ల రీజనిదే...

ఇటీవల వివిధ దేశాల్లో నెలకొన్న పరిణామాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏదైనా ముప్పు పొంచి ఉందా? అన్న అనుమానం వ్యక్తమతున్నది. ఇటీవలి కాలంలో వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకులు ఎడాపెడా తమ చేతిలో ఉన్న సొమ్ముతో బంగారం కొనుగోలు చేస్తున్నాయి. 

Central banks are buying the most gold since the end of the Second World War - here's why
Author
Hyderabad, First Published Feb 17, 2019, 1:42 PM IST


న్యూఢిల్లీ: ఇటీవల వివిధ దేశాల్లో నెలకొన్న పరిణామాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏదైనా ముప్పు పొంచి ఉందా? అన్న అనుమానం వ్యక్తమతున్నది. ఇటీవలి కాలంలో వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకులు ఎడాపెడా తమ చేతిలో ఉన్న సొమ్ముతో బంగారం కొనుగోలు చేస్తున్నాయి. 

దీనికి తోడు చైనాలో అప్పుల భారం పెరిగిపోయిందని, ఎప్పుడో ఒకసారి ఆ దేశం ఆర్థికంగా చిక్కుల్లో పడుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. మరోపక్క అమెరికాలో ఆర్థికాభివృద్ధి మందగిస్తుందనే వాదన వినిపిస్తున్నది. అమెరికాలో వడ్డీ రేట్లు పెంచడంతో రుణలభ్యత కష్టమవుతోంది. 

అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం ముదిరి పాకాన పడుతుందని, ఇది ఆ రెండు దేశాలతోపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కుంగదీస్తుందని ఆర్థికవేత్తలు సందేహిస్తున్నారు.  వచ్చే ఏడాది చివర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నందున ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనాతో రాజీ పడే అవకాశాలు లేవు. 

అదే సమయంలో ‘బ్రెగ్జిట్‌’ బ్రిటన్‌ను ఆర్థికంగా క్లిష్టమైన పరిస్థితుల్లోకి నెట్టేసింది. ఇవన్నీ 2008లో వచ్చిన ఆర్థిక మాంద్యాన్ని పునరావృతం చేసే పరిస్థితులేనని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. దీన్ని ముందుగానే పసిగట్టిన కేంద్ర బ్యాంకులు పుత్తడి వెంట పడుతున్నాయని అంటున్నారు.

సంక్షోభ పరిస్థితుల్లో బంగారానికి ఎనలేని గిరాకీ ఏర్పడటంతోపాటు శరవేగంగా ధర పెరుగుతుంది. పైగా దేశ ఆర్థిక వ్యవస్థలకు వెన్నుదన్ను బంగారమే. అందువల్ల శక్తిమేరకు బంగారాన్ని నిల్వ చేసుకునేందుకు వివిధ దేశాలు ప్రయత్నిస్తుంటాయి. ఇప్పుడు అదే జరుగుతోందని కొందరు నిపుణులు విశ్వసిస్తున్నారు.

సాధారణంగా సంస్థాగత మదుపుదార్లు, వ్యాపార సంస్థలు, ధనికులు ఏటా కొంతమేరకు అమెరికా డాలర్లను కొంటారు. భద్రమైన ఆస్తుల్లో అత్యధిక ప్రతిఫలాన్ని ఇచ్చే పెట్టుబడి సాధనంగా డాలర్‌కు పేరుంది. పైగా అమెరికా డాలర్‌ అంతర్జాతీయ కరెన్సీ. ఏ దేశం వెళ్లినా చెల్లుతుంది. 

అందుకే డాలర్‌కు ఆకర్షణ. కేంద్ర బ్యాంకులు మాత్రం ఇటీవల కాలంలో బంగారం కొనుగోలు చేయడానికి మొగ్గు చూపడమే అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇటీవల కాలంలో కేంద్ర బ్యాంకులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేయటం ‘ప్రపంచ స్వర్ణ మండలి’ దృష్టిని కూడా ఆకర్షించింది. 

‘ప్రపంచ దేశాలను 2008లో ఆర్థిక మాంద్యం కుంగదీసింది. దాని నుంచి బయటకు రావటానికి చాలా ఏళ్లు పట్టింది. ఇప్పటికీ పూర్తిస్థాయిలో సానుకూలమైన పరిస్థితులు లేవు. ఎటు చూసినా అనిశ్చితి రాజ్యమేలుతోంది. అందుకే ఆర్థిక, రాజకీయ, సామాజిక ఒత్తిళ్లను తట్టుకోవడం కోసం వివిధ దేశాల్లోని కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి’అని ప్రపంచ స్వర్ణ మండలి పేర్కొంది.

కొంతకాలం పాటు ఈ ధోరణి కొనసాగొచ్చని అంచనా వేస్తోంది. దీనికి తగ్గట్లుగా... వచ్చే ఏడాది వ్యవధిలో తాము ఇంకా బంగారం కొనుగోలు చేయనున్నట్లు పలు దేశాల కేంద్ర బ్యాంకులు సంకేతాలు ఇస్తున్నాయి. వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకుల వద్ద గల బంగారం నిల్వల్లో అమెరికా ఫెడ్ రిజర్వుదే పై చేయి. 

ఇప్పటివరకు అమెరికా కేంద్రీయ బ్యాంకు వద్ద 8,133 టన్నుల బంగారం నిల్వ ఉంది. తర్వాతీ స్థానాల్లో జర్మనీలో 3,372 టన్నులు, ఇటలీలో 2,451 టన్నులు, ఫ్రాన్స్ల్‌లో 2436 టన్నులు, రష్యా లో 1890 టన్నులు, చైనాలో 1852 టన్నులు, స్విట్జర్లాండ్‌ లో1040 టన్నులు, జపాన్‌లో 765 టన్నులు, నెదర్లాండ్స్‌లో 612 టన్నుల బంగారం నిల్వ ఉండగా, భారతీయ రిజర్వు బ్యాంకు వద్ద 560 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. 

మూడేళ్లుగా పది గ్రాముల బంగారం ధర దాదాపు  రూ.30,000-  32,500 మధ్య ఉంది. కానీ అనూహ్యంగా ఇటీవల పసిడి ధరలకు రెక్కలు వచ్చాయి. పది గ్రాముల బంగారం ధర రూ.34,000 కు మించిపోయింది. మళ్లీ ఇప్పుడు కొంత తగ్గింది. 

అయినా ధర పెద్దగా తగ్గే అవకాశం లేదని, ఇంకా ఈ ఏడాదిలో పెరిగే అవకాశమే కనిపిస్తున్నట్లు బులియన్‌ నిపుణులు పేర్కొంటున్నాయి. వివిధ దేశాలకు చెందిన కేంద్ర బ్యాంకులు గత ఏడాదిలో పెద్దఎత్తున బంగారం కొనుగోలు చేశాయి.

ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) గణాంకాల ప్రకారం 2018లో కేంద్ర బ్యాంకులు 651.5 టన్నుల బంగారాన్ని సొంతం చేసుకున్నాయి. మొత్తం అంతర్జాతీయ కొనుగోళ్లలో ఇది 15 శాతానికి సమానం. అంతకు ముందు ఏడాదితో పోల్చితే ఇది 74% అధికం.

వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకులు ముఖ్యంగా గత ఏడాది అక్టోబర్- డిసెంబర్ మధ్యకాలంలోనే 168 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయని ప్రపంచ స్వర్ణ మండలి పేర్కొంది. అంతక్రితం ఏడాది అక్టోబర్- డిసెంబర్ నెలల మధ్యకాలం నాటి కొనుగొళ్లతో పోల్చితే ఇది 126 శాతం ఎక్కువ. 

1971లో అప్పటి అమెరికా అధ్యక్షుడు అప్పటి వరకూ అమల్లో ఉన్న ‘గోల్డ్‌ స్టాండర్డ్‌’ను రద్దు చేశారు. దీంతో ఆ ఏడాదిలో బంగారం కొనుగోళ్లు భారీగా జరిగాయి. ఆ తర్వాత ఒక ఏడాదిలో అత్యధికంగా బంగారం కొనుగోళ్లు నమోదు కావటం ఇదే.

ఓపక్క కేంద్ర బ్యాంకులు బంగారం వెంట పడుతున్నాయి. మరోవైపు ఆభరణాలకు అంత గిరాకీ లేదు. అదేవిధంగా బంగారంపై రిటైల్‌ పెట్టుబడులు కూడా తక్కువే. ఇక గోల్డ్‌- ఈటీఎఫ్‌ (ఎక్స్ఛేంజి ట్రేడెడ్‌ ఫండ్స్‌) విభాగంలో డిమాండ్‌ క్షీణించింది. అంతకు ముందు ఏడాదితో పోల్చితే 2018లో బంగారు ఆభరణాల అమ్మకాలు కేవలం ఒక టన్ను మాత్రమే ఎక్కువ. 

గోల్డ్‌- ఈటీఎఫ్‌లోనైతే 68.9 టన్నుల తక్కువ డిమాండ్‌ నమోదైంది. బంగారం కడ్డీలు, నాణేల్లో రిటైల్‌ పెట్టుబడుల్లో కేవలం నాలుగు శాతం వృద్ధి మాత్రమే కనిపించింది. దీన్నిబట్టి కేంద్ర బ్యాంకులు వెంటపడుతున్నందు వల్లే బంగారానికి డిమాండ్‌ పెరిగినట్లు స్పష్టమవుతోంది.

రష్యా కేంద్ర బ్యాంకు గత 13 ఏళ్లలో 1726 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. గత ఒక్క ఏడాదిలోనే 274 టన్నులను సొంతం చేసుకుంది. ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఇదే అత్యధికం. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ టర్కీ 51.5 టన్నులు, కజకిస్తాన్‌ 50 టన్నులు చొప్పున కొన్నాయి. 

భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) 40 టన్నులు కొనుగోలు చేసింది. ఇందులో ఎక్కువ భాగాన్ని గత నాలుగైదు నెలల్లోనే కొన్నారు. దీంతో ఆర్‌బీఐ వద్ద ఉన్న బంగారం  నిల్వలు మొత్తం 598 టన్నులకు పెరిగాయి.  ఆసక్తికరమైన అంశమేమిటంటే.. యూరోపియన్‌ కేంద్ర బ్యాంకులు తమ వద్ద ఉన్న బంగారం నిల్వలను తగ్గించుకోవడం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios