Asianet News TeluguAsianet News Telugu

ఆయుష్మాన్ భారత్ ‘కీ’: మాకు ప్రోత్సాహకాలివ్వాలంటున్న హెల్త్‌కేర్ కంపెనీలు

ఆయుష్మాన్ భారత్ వంటి ఆరోగ్య బీమా పథకం త్వరలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే మద్యంతర బడ్జెట్‌లో పెద్దపీట వేసేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు ఆరోగ్య పరిరక్షణ, ఔషధాలకు రాయితీలు కల్పించాలని ఆ రంగాల పరిశ్రమలు కోరుతున్నాయి. 

Budget 2019: Will Ayushman Bharat drain money from other core health programmes?
Author
New Delhi, First Published Jan 28, 2019, 12:40 PM IST

‘ఆయుష్మాన్ భారత్’.. దేశంలోని 50 కోట్ల నిరుపేద కుటుంబాల ఆరోగ్య బీమా పథకం.. కానీ మరో వారం రోజుల్లో ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్‌లో త్వరలో జరిగే ఎన్నికల వేళ ప్రధాని మోదీ సర్కార్ ఆయుష్షు పెంపునకు సకల సన్నాహాలు జరుగుతున్నాయి.

గతేడాది బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పిస్తూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ‘మోదీ కేర్’ పథకానికి ప్రాథమికంగా రూ.2000 కోట్లు కేటాయించారు. కానీ ఆయుష్మాన్ భారత్ వ్యయం రూ.10-12 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.

కానీ ఇప్పటికే నిధుల కొరతతో కొడిగట్టిపోతున్న ఆరోగ్య పథకాలను కాదని ‘ఆయుష్మాన్ భారత్’ పథకాన్ని అగ్రాసనం వేసేందుకు విత్తమంత్రి పావులు కదుపుతున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం అన్ని పథకాలకు నిధులు సమపాళ్లలో నిధులు కేటాయించాల్సిన బాధ్యత కలిగి ఉన్నదని కేంద్ర ఆరోగ్యశాఖ మాజీ కార్యదర్శి కే సుజాతరావు పేర్కొన్నారు.

ఒక పథకానికి మాత్రమే అధిక నిదుల కేటాయింపుతో ఆరోగ్య పరిరక్షణ పట్ల సర్కార్ జాగ్రత్తలు వహించినట్లవుతుందా? అని ప్రశ్నించారు. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ సంస్థ ప్రతినిధి ఒమెన్ కురియన్ స్పందిస్తూ చరిత్రాత్మకంగా సరఫరా, డిమాండ్ల మధ్య అడ్డంకులను తొలగించడానికి సరైన అవకాశం అని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా వచ్చే మధ్యంతర బడ్జెట్‌పై ఫార్మా, హెల్త్‌కేర్‌ రంగం పెద్దగా ఆశలు పెట్టుకోకపోయినా కొన్ని విధానపర చర్యల అవసరాన్ని ప్రస్తావించాయి. ఎగుమతులకు ప్రస్తుతం ప్రోత్సాహాలు కల్పిస్తున్న ‘భారత్‌ నుంచి సరుకుల ఎగుమతుల పథకం (ఎంఈఐఎస్‌)’2020 మార్చిలో గడువు తీరిపోతుందని, దీన్ని పొడిగించాలని పరిశ్రమ ప్రధానంగా కోరుతోంది.

ఈ తరహా పథకాలను పొడిగించాలని పరిశ్రమ కోరుకుంటున్నట్టు డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ చైర్మన్‌ సతీష్‌ రెడ్డి తెలిపారు. పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) వ్యయాలపై ఉన్న 150% ప్రామాణిక మినహాయింపును 200% చేయాలని మరో డిమాండ్‌ అని సతీష్‌ రెడ్డి పేర్కొన్నారు. ఆర్‌అండ్‌డీకి ఈ మాత్రం ప్రోత్సాహకం అవసరమన్నారు.  

ఇష్టారాజ్యంగా ఖరారు చేసిన జీఎస్టీ శ్లాబ్‌లను హేతుబద్ధీకరించాలని హెల్త్‌కేర్‌ రంగం కోరుతోంది. పెరిగిన ముడి పదార్థాల ధరలతో ఆరోగ్య సంరక్షణ భారమని అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజ్‌ ఎండీ సునీతారెడ్డి పేర్కొన్నారు.

ఆరోగ్య సేవలను అందుబాటు ధరల్లో ఉంచాలన్న ప్రభుత్వ లక్ష్యానికనుగుణంగా ఈ రంగానికి సరఫరా అయ్యే ముడి పదార్థాలపై జీఎస్టీని మినహాయించాలని సూచించారు. ఈ ధరల భారాన్ని రోగుల నుంచి రికవరీ చేసుకోవడానికి అనుమతించకపోవడంతో, చెల్లించిన జీఎస్టీని సర్దుబాటు చేసుకోలేకపోతున్నట్టు అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజ్‌ ఎండీ సునీతారెడ్డి చెప్పారు.

దీనివల్ల తమ మార్జిన్లపై ప్రభావం పడి, తమ నిధుల లభ్యత ప్రభావితమై అధునాతన టెక్నాలజీలు, నాణ్యతపై వెచ్చించే అవకాశం లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 150%తరుగుదలను అనుమతించే సెక్షన్‌ 35ఏడీని తిరిగి ప్రవేశపెట్టాలని కూడా అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజ్‌ ఎండీ సునీతారెడ్డి డిమాండ్‌ చేశారు.

నూతన ప్రాజెక్టులపై పెట్టుబడులకు ఇది ప్రోత్సాహకాలు కల్పిస్తుందని ఆమె వివరించారు. ఆరోగ్య రంగానికి నిధుల కేటాయింపును గణనీయంగా పెంచాలి. మన దేశంలో ఓ వ్యక్తి ఆరోగ్యం కోసం చేసే సగటు ఖర్చు 85 డాలర్లు (6,035). ఇతర దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ.

రానున్న బడ్జెట్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని నియంత్రణలు లేకుండా ప్రైవేటు రంగానికీ విస్తరింపచేయాలి’అని హెల్త్‌కేర్‌ గ్లోబల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ చైర్మన్, సీఈవో అజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు.  చిన్న పట్టణాల్లోనూ ఆస్పత్రుల ఏర్పాటుకు ప్రోత్సాహకాలను రానున్న బడ్జెట్‌లో ప్రకటించాలని హెల్త్‌కేర్‌ స్టార్టప్‌ ‘లెట్స్‌ఎండీ’ కోరింది.

బీమా వ్యాప్తి కోసం చర్యలు అవసరమని ఈ సంస్థ సీఈవో నివేష్‌ ఖండేల్‌వాల్‌ అన్నారు. ఆరోగ్య సేవల వ్యయాలు పెరిగిపోతుంటే, ఈ రంగంలో బీమా విస్తరణ అతి తక్కువగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.   

ఆయుష్మాన్‌ భారత్‌ పథకం, మెడికల్‌ డివైజెస్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ ఏర్పాటు మొదలైన చర్యలతో కేంద్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా హెల్త్‌కేర్‌ విభాగంపై మరింతగా దృష్టి పెడుతోందని మాక్సివిజన్‌ సూపర్‌ స్పెషాలిటీ గ్రూప్‌ చైర్మన్‌ జీఎస్‌కే వేలు తెలిపారు.

ఈ నేపథ్యంలో రాబోయే బడ్జెట్‌లో వీటికి తగినంత స్థాయిలో నిధుల కేటాయింపు జరుగుతుందని ఆశిస్తున్నామని మాక్సివిజన్‌ సూపర్‌ స్పెషాలిటీ గ్రూప్‌ చైర్మన్‌ జీఎస్‌కే వేలు చెప్పారు. 

ప్రస్తుతం వైద్య పరికరాల రంగం 70 శాతానికి పైగా దిగుమతులపై ఆధార పడుతోందని మాక్సివిజన్‌ సూపర్‌ స్పెషాలిటీ గ్రూప్‌ చైర్మన్‌ జీఎస్‌కే వేలు పేర్కొన్నారు. దీన్నుంచి బయటపడేందుకు మేకిన్‌ ఇండియా నినాదం తరహాలో బై ఇండియా (భారతీయ ఉత్పత్తులే కొనుగోలు చేయడం) విధానాలు కూడా అమలు చేస్తే బాగుంటుందన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios