Asianet News TeluguAsianet News Telugu

అనిల్ యూ టర్న్: ఆర్-కామ్‌పై పోరుకు బీఎస్ఎన్ఎల్ సై

మరోవైపు తమ బకాయిల వసూలు కోసం బీఎస్ఎన్ఎల్ న్యాయ ప్రక్రియకు దిగనున్నది. దీనికంతటికి కారణమైన దివాళా ప్రక్రియ నుంచి యూ టర్న్ తీసుకుని.. ఆస్తులు అమ్మైనా అప్పులు కట్టాలని అనిల్ అంబానీ యోచిస్తున్నాయరు. 
 

BSNL to approach NCLT this week against RCom to recover Rs 700 crore
Author
Mumbai, First Published Mar 18, 2019, 11:20 AM IST

కష్టాల్లో ఉన్నప్పుడే మరో సమస్య వస్తుంది. అలా స్వీడన్ మొబైల్ దిగ్గజం ఎరిక్సన్ సంస్థకు బకాయిల చెల్లింపు విషయమై సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయాల్సిన తప్పనిసరి పరిస్థితి రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీది.

కానీ ఆయన పరిస్థితి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా తయారైంది. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా న్యాయ పోరాటానికి దిగనున్న వేళ అనిల్ అంబానీ ‘యూ-టర్న్’ తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

అసలే ఎరిక్సన్ బకాయిల చెల్లింపునకు నానా తంటాలు పడుతున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌-కామ్)పై ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ కూడా పోరాటానికి దిగుతున్నది.

తమకు రావాల్సిన దాదాపు రూ.700 కోట్ల బకాయిల వసూళ్లకు ఈ వారం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)ను బీఎస్‌ఎన్‌ఎల్ ఆశ్రయించనున్నదని సంస్థ అధికార వర్గాలు పీటీఐకి తెలిపాయి.

బకాయిల చెల్లింపుల్లో విఫలమవడంతో ఇప్పటికే ఆర్‌కామ్ ఇచ్చిన సుమారు రూ.100 కోట్ల పూచీకత్తును బీఎస్‌ఎన్‌ఎల్ స్వాధీనం చేసుకున్నది. మిగతా మొత్తం కోసం ఈ ఏడాది జనవరి 4న బీఎస్‌ఎన్‌ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాత్సవ.. ఆర్‌కామ్‌పై న్యాయపరమైన చర్యలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 

ఈ క్రమంలోనే ఎన్‌సీఎల్‌టీలో వాదించేందుకు సింగ్ అండ్ కోహ్లీ న్యాయ సంస్థనూ బీఎస్‌ఎన్‌ఎల్ నియమించుకున్నది. అన్ని సర్కిల్ కార్యాలయాల నుంచి ఇన్వాయిస్‌ల వసూళ్ల కారణంగా ఇప్పటికే ఈ కేసు దాఖలు ఆలస్యమైందని సదరు వర్గాలు చెప్పాయి.

ఎరిక్సన్ బకాయిల చెల్లింపు కేసులో సుప్రీం కోర్టు ఆర్‌కామ్‌కు ఇచ్చిన గడువు మంగళవారంతో ముగియనున్నది. ఎన్సీఎల్‌ఏటీ ముందు ఇరు సంస్థలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ రూ.550 కోట్ల బకాయిల కేసులో ఇంకా ఎరిక్సన్‌కు ఆర్‌కామ్ రూ.453 కోట్లను చెల్లించాల్సి ఉన్నది. 

దీంతో ఈ మొత్తాన్ని నాలుగు వారాల్లోగా (మార్చి 19వ తేదీ నాటికి) చెల్లించాలని ఆర్‌కామ్ అధినేత అనిల్ అంబానీని గత నెల సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈలోగా చెల్లించకపోతే మూడు నెలల జైలుశిక్ష తప్పదని అనిల్ అంబానీని సుప్రీంకోర్టు హెచ్చరించింది కూడా.

ఈ కేసులో ఇప్పటికే ఎరిక్సన్‌కు ఆర్‌కామ్ రూ.118 కోట్లను చెల్లించగా, ఖాతాల్లో ఉన్న రూ.260 కోట్ల ఆదాయం పన్ను (ఐటీ) రిఫండ్స్ విడుదల కోసం అనిల్ అంబానీ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. 

అందుబాటులో నగదు నిల్వలు ఉన్నా, అమ్ముకోవడానికి ఆస్తులున్నా, కుదరకపోవడంతో ‘అడాగ్’ అధినేత అనిల్ అంబానీ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నది. దీనికి కారణమైన దివాలా ప్రక్రియపై ఆర్‌కామ్ యూటర్న్ తీసుకున్నది.

ఈ మేరకు ఎన్‌సీఎల్‌ఏటీలో స్వచ్ఛందంగా ఓ పిటిషన్ కూడా వేసింది. దివాలా ప్రక్రియ నుంచి వైదొలిగితే ఆస్తులను అమ్ముకొనైనా ఈ కష్టాలను గట్టెక్కవచ్చని ఆర్‌కామ్ భావిస్తున్నది. తమ ఖాతాల్లో రూ.260 కోట్ల నగదు ఉన్నా, దివాలా ప్రక్రియలో ఉన్నందునే తీసుకోలేకపోతున్నది.

ఈ నగదు విడుదలకు ఎస్‌బీఐ నేతృత్వంలోని 37 మంది బ్యాంకర్లను ఆదేశించాలని ట్రిబ్యునల్‌లో ఇప్పటికే ఆర్‌కామ్ పిటిషన్ కూడా వేసిన సంగతి విదితమే. అయితే బ్యాంకర్లు ఇందుకు ససేమిరా అంటున్నారు.

ఈ క్రమంలో వచ్చే నెల 8కి ఈ కేసును ట్రిబ్యునల్ వాయిదా వేసింది. అయితే మంగళవారంతోనే సుప్రీం పెట్టిన గడువు తీరిపోతున్న క్రమంలో ఏం జరుగుతుందా? అన్న ఉత్కంఠ నెలకొన్నది.
 

Follow Us:
Download App:
  • android
  • ios