Asianet News TeluguAsianet News Telugu

జెట్‌ను నడుపతాం: భారత, బ్రిటీష్‌ పీఎంలకు బ్రిటన్‌ ఇన్వెస్టర్ లేఖ

కారు చీకటిలో ఆశా కిరణం.. ప్రస్తుతానికి మూతపడిన జెట్ ఎయిర్వేస్ సంస్థను నడిపేందుకు సిద్ధమని బ్రిటన్ కేంద్రంగా పని చేస్తున్న పారిశ్రామికవేత్త ముందుకు వచ్చారు. అట్మాస్పియర్ ఇంటర్ కాంటినెంటల్ ఎయిర్ లైన్స్ అధినేత జాసన్ ఈ మేరకు బ్రిటన్ ప్రధాని థెరెస్సా మే, భారత్ ప్రధాని నరేంద్రమోదీ, జెట్ ఎయిర్వేస్ సీఈఓ వినయ్ దూబేలకు లేఖలు రాశారు.

British entrepreneur offers to take control of Jet Airways
Author
New Delhi, First Published Apr 24, 2019, 10:35 AM IST

న్యూఢిల్లీ/ లండన్: జెట్‌ ఎయిర్వేస్‌ సంస్థలో పెట్టుబడి పెట్టేందుకు బ్రిటన్‌కు చెందిన అట్మాస్పియర్‌ ఇంటర్‌కాంటినెంటల్‌ ఎయిర్‌లైన్స్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ జాసన్‌ అన్స్‌వర్త్‌ ఆసక్తి చూపుతున్నారని సమాచారం. ఈ సంస్థ ఈ ఏడాది ఆఖరులో బ్యాంకాక్‌, దుబాయ్‌, భారత్‌లకు విమానయాన సేవలు ఆరంభించబోతోంది. ఇందుకోసం భారత్‌, బ్రిటన్‌, దుబాయ్‌, థాయిలాండ్‌లలో సీనియర్‌ నిపుణుల కోసం దరఖాస్తులను కూడా  ఆహ్వానించింది.

జెట్‌పై నియంత్రణ వాటా పొందేందుకు ఆసక్తి ఉందని తెలుపుతూ జెట్‌ ఎయిర్‌వేస్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) వినయ్‌ దూబేకు జాసన్‌ లేఖ రాశారని మనీకంట్రోల్‌ తెలిపింది.‘దూబే నుంచి నాకు జవాబు వచ్చింది. జెట్‌పై తాజా సమాచారాన్ని ఇచ్చేందుకు సంస్థలోని ఒక సీనియర్‌ అధికారికి బాధ్యతలు అప్పగించారు’ అని జాసన్‌ వివరించారు. 

‘విమానాశ్రయాల్లో సమయాలు (స్లాట్స్‌) సహా మరిన్ని విలువైన ఆస్తులను జెట్‌ కోల్పోకముందే, సాధ్యమైనంత త్వరగా ఆ సంస్థ కార్యకలాపాలు పునఃప్రారంభించి, ఉద్యోగులకు వేతనాలు అందేలా చూడాలన్నది నా ప్రణాళిక’ అని జాసన్ తెలిపారు. ‘జెట్‌ విలువ మరింత హరించుకుపోకుండా చూడాలి. భారత్‌లోని మా విభాగానికి జెట్‌ ఉద్యోగుల నుంచి వందల సంఖ్యలో దరఖాస్తులు అందాయి’ అని వెల్లడించారు.

ఎస్బీఐ సారథ్యంలోని బ్యాంకర్ల కన్సార్టియంకు జెట్‌ చెల్లించాల్సిన బకాయిలపై అవగాహన ఉందని, వాటిని నెరవేర్చే ప్రణాళికలూ తమ వద్ద ఉన్నాయని జాసన్‌ తెలిపారు. ‘అట్మాస్పియర్‌లో కొందరు పెట్టుబడులు పెట్టారు. ఇంకా మరికొందరు కూడా సిద్ధంగా ఉన్నారు. వారికి జెట్‌పైనా ఆసక్తి ఉంది’ అని వివరించారు.

జెట్‌ విదేశీ కార్యకలాపాలపై తనకు ఆసక్తి ఎక్కువని తెలిపారు. చౌకధరల విమానయాన సంస్థలతో పోలిస్తే, పూర్తిస్థాయి సేవలు అందించే జెట్‌ లాంటివి పునరుద్ధరించడం సాధ్యమేనని జాసన్‌ పేర్కొన్నారు. కన్సర్వేటివ్‌ పార్టీ సభ్యుడైన జాసన్‌ బ్రిటిష్‌, భారత ప్రధానులకు కూడా జెట్‌పై ఆసక్తిని వివరిస్తూ, వారి సహకారాన్ని కోరుతూ లేఖలు రాశారు.

రూ.8,500 కోట్ల రుణ భారాన్ని మోస్తున్న జెట్‌లో బ్యాంకర్లకు మెజారిటీ వాటా ఉండగా, దాన్ని విక్రయించేందుకు ఆసక్తి గల సంస్థలు, వ్యక్తుల నుంచి బిడ్లను ఆహ్వానించిన సంగతీ విదితమే. మే 10 బిడ్ల దాఖలుకు చివరి తేదీ. కాగా, ఎతిహాద్ ఎయిర్‌వేస్, టీపీజీ క్యాపిటల్, ఇండిగో పార్ట్‌నర్స్, ఎన్‌ఐఐఎఫ్‌ల బిడ్లను ఇప్పటికే బ్యాంకర్లు ఎంపిక చేశారు. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో స్పందన లేదన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో జాసన్ ఆసక్తి చూపిస్తుండటం.. జెట్ ఉద్యోగుల్లో కొత్త ఆశల్ని చిగురింపజేస్తున్నాయి.

ఈనెల 17 నుంచి కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు జెట్‌ యాజమాన్యం ప్రకటించడంతో, ఆందోళన చెందుతున్న సిబ్బంది, వాటాదార్లకు ‘బ్రిటిష్‌ పెట్టుబడిదారు ఆసక్తి’వార్త సంతోషం కలిగించేదే.  లీజ్‌ చెల్లించనందున విమానాలు నిలిచిపోవడం, 4 నెలలుగా వేతనాలు అందక నిపుణులైన పైలట్లు, ఇతర సాంకేతిక సిబ్బంది రాజీనామా చేసి, ఇతర సంస్థల్లో చేరుతున్నందున, జెట్‌లో వాటా విక్రయానికి బ్యాంకర్లు చేపట్టిన బిడ్డింగ్‌ ప్రక్రియ ఎంతవరకు విజయవంతం అవుతుందనే సందేహాలూ ఉన్నాయి.

ముంబై, ఢిల్లీలకు ఇతర నగరాల నుంచి సర్వీసులు పెంచుతున్నామని స్పైస్‌జెట్‌ ప్రకటించింది. ఈనెల 26 నుంచి రోజువారీ 28 కొత్త సర్వీసులు నిర్వహిస్తామని తెలిపింది. జైపూర్‌, అమృత్‌సర్‌, కోయంబత్తూర్‌ల నుంచి ముంబైకి కొత్త సర్వీసులు ప్రారంభిస్తామని ప్రకటించింది. హైదరాబాద్‌, పాట్నా, ఢిల్లీ, కోల్‌కతాల నుంచి ముంబయికి మరిన్ని సర్వీసులు జతచేరుస్తోంది. మే ఆఖరు నుంచి హాంకాంగ్‌, జెడ్డా, దుబాయ్‌, కొలంబో, ఢాకా, రియాద్‌, బ్యాంకాక్‌, ఖాట్మండులకు ముంబై నుంచి సర్వీసులు నిర్వహించనుంది.

Follow Us:
Download App:
  • android
  • ios