Asianet News TeluguAsianet News Telugu

‘నా సొత్తే’ దూరం.. ఇక సొమ్మెందుకు? జెఫ్‌పై మరోమారు మెకంజీ ప్రేమ

వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్టు ఖషోగ్గి దారుణ హత్యోదంతం ఒక పచ్చని సంసారంలో నిప్పులు పోసింది. దీనిపై ఈ దినపత్రిక వరుస కథనాలు ప్రచురించింది. దీనిపై సౌదీ యువరాజ సౌధం ఆగ్రహించింది. వాషింగ్టన్ పోస్ట్ అధినేత జెఫ్ బెజోస్ వ్యక్తిగత రహస్యాలను తస్కరించి ఆయన ప్రత్యర్థి మీడియా సంస్థ ‘నేషనల్ ఎంక్వైరర్’కు చేరవేసింది. ఇందులో ఒక టీవీ యాంకర్‌ లారెన్‌తో బెజోస్‌కు సంబంధాలు బయటపడటం మెకంజీ మనస్తాపానికి గురయ్యారు. ఇద్దరూ విడిపోయారు. అయితే భరణంగా వచ్చే మొత్తం ఎంతో ప్రేమించే తన మాజీ భర్త జెఫ్ కే వదిలేస్తున్నట్లు ఆమె ట్వీట్ చేశారు. ఎంతైనా మహిళగా భర్త విడిపోయిన తర్వాత వచ్చే వాటాలు, భరణంపై ఆశ లేదని తేల్చేసి ఆదర్శంగా నిలిచారు.
 

Bezos' ex-wife to surrender 75% of couple's Amazon shares
Author
New Delhi, First Published Apr 6, 2019, 9:08 AM IST

న్యూయార్క్‌: ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా.. అర్థం పరమార్థం ఒక్కటే. భార్యాభర్తల బంధంలో మార్పులు ఉండవని తేలిపోయింది. దాదాపు 26 ఏళ్ల పాటు దాంపత్య జీవితాన్ని సాగించిన అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, మెకంజీ బెజోస్ విడాకులు పొందారు. ఫలితంగా ప్రపంచంలోనే నాలుగో అత్యంత సంపన్న మహిళగా తనకు లభించే కీర్తి కిరీటం ఒక ముళ్లకిరీటం అని భావించారు మెకెంజీ జెఫ్. 

ప్రాణపదంగా ప్రేమించిన భర్త నుంచి విడిపోయాక లభించే సంపదపై ఏ మగువకూ వ్యామోహం ఉండదు. అందుకే తన వాటాలపై వచ్చే కీలక హక్కులను, ఇతర అధికారాలను ఎంతగానో ప్రేమించిన మాజీ భర్తకే వదిలేసుకుంది. 

అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌, మెకంజీ బెజోస్‌ల విడాకులు ఖరారయ్యాయి. ఈ క్రమంలో మెకంజీకి భరణం కింద అమెజాన్లో నాలుగు శాతం వాటాలు లభిస్తాయి. వీటి మార్కెట్‌ విలువ 36 బిలియన్‌ డాలర్లు. మన కరెన్సీలో అక్షరాలా రూ. 2.49 లక్షల కోట్లు. 

దీంతో మెకంజీ బెజోస్‌ ప్రపంచంలోనే నాలుగో అత్యంత సంపన్న మహిళగా అవతరించింది. ఇవేవీ ఆమె సంతోషించదగిన అంశాలు కాదు.  తనకు లభించే నాలుగు శాతం వాటాలపై వచ్చే ఓటింగ్‌ హక్కులనూ సంతోషంగా, ప్రేమతో మాజీ భర్త జెఫ్‌బెజోస్‌కు వదిలేసుకున్నారామె. 

‘నాకు ఇష్టమైనవన్నీ ఆయనకు సంతోషంగా ఇచ్చేస్తాను. ది వాషింగ్టన్‌ పోస్ట్‌, బ్లూ ఆరిజిన్‌,75శాతం అమెజాన్‌ వాటాలు, నాకు లభించే వాటాలపై ఓటింగ్‌ హక్కులను జెఫ్‌కే వదులు కుంటున్నాను’ అని 48 ఏళ్ల మెకంజీ బెజోస్‌ ట్వీట్‌ చేశారు. 

దీనికి జెఫ్‌ స్పందిస్తూ ‘నా స్నేహితులు, కుటుంబ సభ్యులు చూపిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. అందరికంటే ముఖ్యంగా మెకంజీకి’అని ట్వీట్‌ చేశారు. 

ఈనాడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ విజయం వెనుక మెకంజీ కీలక పాత్ర పోషించారు. 1992లో న్యూయార్క్‌ నగరంలోని హెడ్జిఫండ్‌ సంస్థ డి.ఈ.షాలో వీరు కలిసి పనిచేశారు. 

ఈ సంస్థకు జెఫ్‌ ఉపాధ్యక్షుడిగా ఉండగా.. మెకంజీ రీసెర్చి అసోసియేట్‌గా పనిచేస్తున్నప్పుడు మొదలైన వీరి పరిచయం ఏడాది తర్వాత పెళ్లికి దారి తీసింది. 1993లో వివాహం చేసుకొన్నారు. మరో ఏడాది తర్వాత  అమెజాన్‌ పేరుతో ఆన్‌లైన్‌ బుక్‌ స్టోర్‌ మొదలు పెడదామని జెఫ్‌ తన భార్య మెకంజీకి తెలిపారు. దీనిపై 2013లో సీబీఎస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెకంజీ వెల్లడించారు. 

‘నాకు వ్యాపారం గురించి పెద్దగా తెలియదు. కానీ, జెఫ్‌ తన ఆలోచన చెబుతున్నప్పుడు అతని కళ్లలో ఉత్సాహాన్ని, పట్టుదలను చూశాను. నేను పిచ్చిగా ప్రేమించే భర్త నాతో కలిసి ఓ సాహసం చేస్తావా అని అడిగితే.. అందులో భాగం కావడం కంటే సంతోషం ఏం ఉంటుంది’అని మెకంజీ అసలు సంగతి బయటపెట్టారు. 

1994లో జెఫ్‌-మెకంజీలు న్యూయార్క్‌ను వీడి సీటెల్‌కు వెళ్లి అమెజాన్‌కు ప్రాణం పోశారు. ఈ సంస్థలో పెట్టుబడుల కోసం జెఫ్‌ అహోరాత్రులు కష్టపడితే.. మెకంజీ అమెజాన్‌ అకౌంటెంట్‌గా లెక్కలు చూసుకొన్నారు. అమెజాన్‌ తొలి కాంట్రాక్టులు మొత్తం మెకంజీనే చూసుకొనేవారు. ఆ సంస్థ ఇంతింతై ఇప్పుడు ప్రపంచలోనే  అత్యంత విలువైన సంస్థల్లో స్థానం సాధించింది. 

జెఫ్‌-మెకంజీ దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు. మెకంజీ మంచి రచయిత్రి కూడా. ఆమె రెండు పుస్తకాలను రాశారు. ఇటీవల అమెజాన్‌ కార్యకలాపాల్లో ఆమె చురుగ్గా వ్యవహరించడంలేదు. సామాజిక కార్యక్రమాలకు మాత్రమే పరిమితం అయ్యారు. 

జెఫ్‌ బెజోస్ కుటుంబానికి చెందిన వాషింగ్టన్‌ పోస్టు పత్రిక కాలమిస్టు జమాల్‌ ఖషోగ్గీ హత్యకు గురయ్యారు. దీంతో వాషింగ్టన్‌ పోస్టు సౌదీ యువరాజు సల్మాన్‌ లక్ష్యంగా కథనాలు రాసింది. 

దీంతో సౌదీ అధికారులు వ్యూహాత్మకంగా జెఫ్‌ బెజోస్‌ ఫోన్‌ను హ్యాక్‌ చేసి వ్యక్తిగత విషయాలను తస్కరించారు.  వాటిని అమెరికాలోని నేషనల్‌ ఎంక్వైరర్‌ పత్రికకు చేర్చారు. ఒక టీవీ యాంకర్‌ లారెన్‌తో బెజోస్‌కు సంబంధాలు ఉన్నట్లు అమెరికా పత్రిక ఎంక్వైరర్‌ సంచలన విషయాలను బయటపెట్టింది. 

అసలు సంగతి బయటపడటంతో మెకంజీ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. వారి మధ్య సర్దుకుపోలేని స్థాయిలో మనస్పర్థలు వచ్చాయి. దీంతో ప్రాణంగా ప్రేమించిన భర్త జెఫ్ బెజోస్ నుంచి విడిపోవడానికి మెకంజీ నిర్ణయించుకొన్నారు. స్నేహితులుగా కొనసాగుతామని వెల్లడించారు. జెఫ్‌తో పెనవేసుకొన్న బంధం విడిపోయిన  ఫలితంగా వచ్చిన సంపదపై ఆమె వ్యామోహం చూపలేదు. అందుకే అత్యధిక భాగం ఆయన పట్ల ప్రేమతో జెఫ్‌కే వదిలేసుకుంది. దటీజ్ వైవాహిక బంధం!
  

Follow Us:
Download App:
  • android
  • ios