Asianet News TeluguAsianet News Telugu

ఇండియా ‘చేంజ్’: కుప్పకూలిన అమెజాన్, వాల్‌మార్ట్ షేర్లు

భారతదేశంలో కొత్త ఈ-కామర్స్ విధానం అమలులోకి వచ్చిన ఒక్క రోజులోనే ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, వాల్‌మార్ట్‌ కోలుకోలేని దెబ్బ తిన్నాయి. అమెరికా స్టాక్ మార్కెట్లలో వాటి షేర్లు కూప్పకూలాయి. దీంతో ఒక్కరోజే రూ.3,64,400 కోట్ల విలువైన వాటి మార్కెట్ వాల్యూ పడిపోయింది. 
 

Amazon, Walmart lose over $50 billion in market value after e-tail policy change
Author
New Delhi, First Published Feb 3, 2019, 11:37 AM IST

అంతర్జాతీయంగానే అతిపెద్ద మార్కెట్ భారత్‌లో అమల్లోకి వచ్చిన కొత్త ఈ-కామర్స్ పాలసీ ఒక్కరోజులోనే దాని ఎఫెక్ట్ ఏమిటో తేల్చేసింది. ఒక్కరోజులోనే విదేశీ ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజాల మార్కెట్ విలువ ఒక్కసారిగా హరించుకుపోయింది.

అమెరికా ఈ-మార్కెటింగ్ దిగ్గజ సంస్థలు అమెజాన్, వాల్‌మార్ట్‌ శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 50 బిలియన్ డాలర్లకుపైగా మార్కెట్ విలువను కోల్పోయాయి. నాస్‌డాక్ స్టాక్ మార్కెట్‌లో అమెజాన్ షేర్ విలువ 5.38% పతనమై 1,626.23 డాలర్ల వద్ద స్థిరపడింది.

దీంతో 45.22 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ శుక్రవారం ట్రేడింగ్‌లో ఆవిరైంది. న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్‌వైఎస్‌ఈ)లో వాల్‌మార్ట్ షేర్ విలువ 2.06% క్షీణించి 93.86 డాలర్ల వద్ద నిలిచింది. ఫలితంగా సంస్థ మార్కెట్ విలువ 5.7 బిలియన్ డాలర్లు పడిపోయింది.

రెండు సంస్థలు కలిసి 50.92 బిలియన్ డాలర్ల (డాలర్‌తో పోల్చితే ప్రస్తుతం రూపాయి మారకం విలువ ప్రకారం దాదాపు రూ.3,64,400 కోట్లు) మార్కెట్ విలువను నష్టపోయాయి. అమెరికాలో శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి అమెజాన్ మార్కెట్ విలువ 795.18 బిలియన్ డాలర్లు, వాల్‌మార్ట్ మార్కెట్ విలువ 272.69 బిలియన్ డాలర్లుగా ఉన్నది. 

దేశీయ సంప్రదాయ మార్కెట్ ఆందోళనలు, పారదర్శక వ్యాపార విధానమే లక్ష్యంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ కొత్త ఈ-కామర్స్ పాలసీని అమల్లోకి తెచ్చింది. ఈ నెల 1 నుంచి ఈ నూతన విధానం అమల్లోకి రాగా, అప్పటిదాకా ఉన్న ఆన్‌లైన్ మార్కెటింగ్ జోష్ ఒక్కసారిగా చల్లబడింది.

భారీ ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్న ఈ-కామర్స్ సంస్థలు.. ఉత్పాదకదారులతో నేరుగా సంబంధాలు పెట్టుకుంటున్నాయని, ఆయా ఉత్పత్తులను తమ ఆన్‌లైన్ వేదికల్లో విక్రయిస్తున్నాయని, ఇది మార్కెట్ నిబంధనలకు, ఆరోగ్యకరమైన పోటీకి వ్యతిరేకమని సంప్రదాయ మార్కెట్‌దారుల నుంచి కేంద్రానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి.

దీంతో వీటన్నిటికీ చెక్ పెడుతూ నూతన ఈ-కామర్స్ విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. దీంతో అమెజాన్ సంస్థ  రాత్రికిరాత్రి లక్షల వస్తువులను తమ వెబ్‌సైట్ నుంచి తొలగించాల్సి వచ్చింది. వాల్‌మార్ట్‌పైనా కొత్త పాలసీ ప్రభావం పడింది. ప్రపంచ ఆన్‌లైన్ మార్కెట్‌లో భారత్ వాటానే ప్రధానం.

దీంతో బహుళజాతి సంస్థల చూపంతా దేశీయ మార్కెట్‌పైనే. ఈ క్రమంలో కొత్త పాలసీ.. విదేశీ ఆన్‌లైన్ మార్కెటీర్ల దూకుడుకు బ్రేకులు వేయగా, ఈ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన మదుపరులు ఆందోళనలో పడ్డారు. దీంతో స్టాక్ మార్కెట్లలో ఆయా సంస్థల షేర్లు నష్టాలపాలవుతున్నాయి.

నిత్యం ఉరుకులు, పరుగులతో కూడిన ఈ యాంత్రిక జీవనంలో షాపింగ్‌కంటూ కొంత సమయాన్ని కేటాయించడం అసాధ్యమైపోతున్నదంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలోనే ఆన్‌లైన్ మార్కెట్ ఊపందుకున్నది.

మొబైల్ ఫోన్లలో చౌక ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం కూడా ఆన్‌లైన్ మార్కెట్‌ను అత్యంత వేగంగా విస్తరించేలా చేసింది. దీంతో కావాల్సిన వస్తువులన్నీ కూడా మొబైల్ ఇంటర్నెట్‌లోనే అంతా కొనుక్కుంటున్నారు. 

ప్రస్తుతం రోజంతా ఆఫీసుల్లో, ఇతరత్రా పనుల్లో క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్నవారే ఎక్కువ. ఇలాంటివారంతా ఈ-కామర్స్ షాపింగ్‌కే మొగ్గు చూపుతున్నారు. అన్ని రకాల, అన్ని వర్గాలకు అవసరమైన వస్తువులు దొరుకుతుండటం, పైగా భారీ ఆఫర్లకే లభిస్తుండటం కూడా ఆన్‌లైన్ మార్కెట్‌ను బలపరుస్తున్నది. 

దీంతో ట్రాఫిక్ సమస్యలను అధిగమిస్తూ బజార్లోని షాపులన్నీ తిరిగి కొనడం తక్కువైంది. పాత పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన నగదు కొరతనూ ప్రజలు ఆన్‌లైన్ షాపింగ్‌తో అధిగమిస్తున్నారు. ప్రభుత్వం కూడా తగిన ప్రోత్సాహకాలను అందించడం.. దేశంలో ఆన్‌లైన్ మార్కెట్‌ను పరుగులు పెట్టించింది.

కానీ తాజా పాలసీ ఆన్‌లైన్ మార్కెట్ ఆనందాన్ని ఆవిరి చేసింది. కొత్త ఈ-కామర్స్ పాలసీ అమలును మరికొంత కాలం వాయిదా వేయాలని అమెజాన్, వాల్‌మార్ట్‌ కేంద్ర ప్రభుత్వంతో విశ్వ ప్రయత్నాలు సాగిస్తున్నాయి. మరోవైపు సంప్రదాయ మార్కెటీర్లు, వర్తక సంఘాలు దీన్ని అంతే గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి.

4 నెలలు వాయిదా వేయాలని అమెజాన్, 6 నెలలు ఆపాలని వాల్‌మార్ట్ కోరుతున్నాయి. తాజా విధానం ప్రభావం.. తమ అమ్మకాలను పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తున్నాయని, దీనివల్ల అన్ని రకాలుగా నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆన్‌లైన్ మార్కెటీర్లు వాదిస్తున్నారు.

ఇందుకు పారిశ్రామిక విధాన, ప్రగతి శాఖ (డీఐపీపీ) మాత్రం ససేమిరా అంటున్నది. గతేడాది డిసెంబర్‌లో కొత్త విధానాన్ని విడుదల చేశామని, సుమారు మూడు నెలల సమయం ఇచ్చామని గురువారం గుర్తుచేసింది.

ఇక వాయిదా వేయడం కుదరదంటూ శుక్రవారం అమల్లోకి తెచ్చేసింది. అయినా తమ కొనుగోలుదారులు, అమ్మకందారులపై ప్రభావాన్ని తగ్గించడం కోసం అమెజాన్.. ప్రభుత్వ వర్గాలతో సంప్రదింపులను కొనసాగిస్తూనే ఉన్నది.

ప్రపంచంలోనే చైనా తర్వాత అత్యంత జనాభా కలిగిన భారత్‌లో ఉన్న విసృత వ్యాపారావకాశాలను అందిపుచ్చుకోవడానికి విదేశీ సంస్థలు విపరీతమైన ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ క్రమంలోనే అన్ని రంగాల్లోకి పెట్టుబడులు వెల్లువలా తరలివస్తున్నాయి. ఇందుకు ఈ-కామర్స్ మార్కెట్ మినహాయింపు కాదు.

గతేడాది ఫ్లిప్‌కార్ట్‌ను వాల్‌మార్ట్ 16 బిలియన్ డాలర్లతో సొంతం చేసుకున్నది. అమెజాన్ సైతం చిన్నచిన్న రిటైల్ సంస్థలను హస్తగతం చేసుకుంటూ భారతీయ ఆన్‌లైన్ మార్కెట్‌పై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నది.

ఇప్పటిదాకా 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టింది. ఈ నేపథ్యంలో దేశీయ ఆన్‌లైన్ రిటైల్ వ్యాపారంలో ఈ రెండు సంస్థల వాటానే 75-80 శాతానికి చేరింది. అందుకే కొత్త పాలసీ అమలు ప్రభావం మిగతా ఆన్‌లైన్ సంస్థల కంటే కూడా అమెజాన్, వాల్ మార్ట్ సంస్థలపైనే ఎక్కువగా కనిపిస్తున్నది.

కాగా, తాజా ప్రతికూలతల మధ్య భారత్‌లో మరిన్ని పెట్టుబడులకు ఈ సంస్థలు ఆసక్తి చూపడం లేదు. దీంతో విదేశీ పెట్టుబడులు తగ్గిపోవచ్చునని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios