Asianet News TeluguAsianet News Telugu

భగ్గుమంటున్న ‘పసిడి’ ధర.. దంతెరస్ ధగధగలు డౌటే

అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ క్షీణత, అంతర్జాతీయ అనిశ్చితి, ఐఎల్ఎఫ్ఎస్ సంస్థలో సంక్షోభంతో ఎన్బీఎఫ్సీల్లో నగదు కొరత, దేశీయంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కోలహాలం నేపథ్యంతో ప్రస్తుత దంతేరాస్ సందర్భంగా పసిడి కొనుగోళ్లు అంతగా ఉండక పోవచ్చునని ప్రపంచ పసిడి మండలి (డబ్ల్యూజీసీ) అంచనా వేసింది. 

Ahead of Dhanteras, WGC raises concerns on gold prices
Author
Delhi, First Published Nov 2, 2018, 11:21 AM IST

దీపావళి పండుగకు రెండు రోజుల ముందు అంటే ఈ నెల ఐదో తేదీన నిర్వహించే ధన త్రయోదశి (దంతేరాస్)కు మూడు రోజుల టైం మాత్రమే ఉంది. ధన త్రయోదశి నాడు లక్ష్మీదేవిని ఆరాధించడంతో పాటు పసిడి, వెండి వంటి విలువైన లోహాలను కొనుగోలు చేస్తే కలిసి వస్తుందనేది ఉత్తర భారతీయుల నమ్మకం.

క్రమంగా ఇది తెలుగు రాష్ట్రాలకూ విస్తరించింది. ఆ మేరకు కొనుగోళ్లు పెరుగుతున్నాయి. కానీ ఈ ఏడాది అంతర్జాతీయంగా ధర అందుబాటులోనే ఉన్నా, డాలర్‌‌పై రూపాయి మారకం విలువ భారీ పతనం వల్ల దేశీయంగా పసిడి ధర భగ్గుమంటోంది.

అందువల్ల ఈసారి దీపావళి-ధన త్రయోదశికి పుత్తడి అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉంటాయని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) అంచనా వేసింది. ‘క్యూ3 గోల్డ్‌ డిమాండ్‌ ట్రెండ్స్‌’ పేరుతో ప్రపంచవ్యాప్తంగా పసిడి గిరాకీపై డబ్ల్యూజీసీ నివేదిక విడుదల చేసింది. 

దేశంలో సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో  బంగారానికి  పటిష్ట డిమాండ్‌ నమోదైంది. గతేడాదితో పోలిస్తే 10 శాతం వృద్ధి నమోదైనట్లు వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (డబ్ల్యూజీసీ) నివేదిక తెలిపింది. పరిమాణం రూపంలో 183.2 టన్నులు.

డాలర్ మారకం విలువతోపాటు అంతర్జాతీయంగా పెరుగుతున్న ధర వల్ల ప్రస్తుత పండుగల సీజన్‌లో మాత్రం బంగారం డిమాండ్‌ అంతంతే ఉండవచ్చని డబ్ల్యూజీసీ అంచనావేసింది. దీనితోపాటు దేశంలో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) సంబంధ సమస్యలూ ఉన్నాయని డబ్ల్యూజీసీ భారత్ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సోమసుందరం తెలిపారు.

మేలిమి బంగారం (999 స్వచ్ఛత) 10 గ్రాముల ధర పన్నులు మినహా రూ.32,000-33,000 పలుకుతోంది. ఇది ఆరేళ్ల గరిష్ఠస్థాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణించడంతో, ధర ఇంతలా పెరిగింది.

అంతర్జాతీయంగా చూస్తే, ఏడాది క్రితం ఔన్సు (31.10 గ్రాములు) మేలిమి బంగారం ధర 1250 డాలర్లు పైనే ఉండగా, ఇప్పుడు 1230 డాలర్లలోపే ఉంది. డాలర్‌ విలువ రూ.64.50 నుంచి రూ.73.50కు చేరడంతో, ఆ ప్రభావం దిగుమతిపైనే ఆధారపడిన బంగారంపై అధికంగా ఉంది.

ఒక డాలర్‌ విలువలోనే రూ.9 తేడా వచ్చింది. అంటే ఔన్సు బంగారం ధర రూ.11,000 అధికమవుతోంది. డాలర్‌ విలువలో వచ్చిన మార్పు వల్లే, ఒక గ్రాము మేలిమి బంగారం ధర, ఏడాది క్రితం కంటే రూ.355 పెరిగింది.

సాధారణంగా దసరా నుంచి బంగారం అమ్మకాలు అధికంగా జరుగుతుంటాయి. సాధారణ-సంపన్నకుటుంబాలతో పాటు వ్యాపారులు/కాంట్రాక్టర్లు, మిగులు నిధులు కలవారు, బంగారం కొంటూ ఉంటారు.

ఈసారి పరిస్థితి మారింది. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నందున ఈసారి రాజకీయ ఖర్చుల కోసం నిధులు తరలిపోతున్నాయి.దీనికి తోడు అధికంగా పసిడి కొనుగోళ్లు రిగే కేరళను వరదలు పోటెత్తడంతో అక్కడ పసిడి కొనే వారు లేరు ప్రస్తుతం. 

ఇక శుభ ముహూర్తాలు కూడా తక్కువగా ఉన్నందున, ఈ సీజన్‌లో ఇతర ప్రాంతాల్లోనూ కొనుగోళ్లు తక్కువగా జరగవచ్చనేది డబ్ల్యూజీసీ అంచనా. మరోవైపు  ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంక్షోభం తర్వాత బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)లకు నగదు లభ్యత తగ్గింది. పసిడి వ్యాపారంపై ఈ ప్రభావమూ ఉంది. ప్రజల వద్ద కూడా మిగులు నిధులు తక్కువగానే ఉన్నాయని భావిస్తున్నారు.

విలువ రూపేణా సెప్టెంబర్‌ త్రైమాసికంలో పసిడి డిమాండ్‌ 14 శాతం పెరిగి రూ.50,090 కోట్లకు చేరింది. 2017 ఇదే త్రైమాసికంలో ఈ విలువ రూ.43,800 కోట్లు. త్రైమాసికంలో ప్రారంభంలో పసిడి ధరలు పన్నులతో కలసి 10గ్రాములు దాదాపు 29,000 లకు పడిపోయింది. డిమాండ్‌ పెరగడానికి ప్రధాన కారణమిది. 

ఇక సెప్టెంబర్‌ నెలతో ముగిసిన త్రైమాసికంలో మొత్తం ఆభరణాల డిమాండ్‌ 10 శాతం వృద్ధితో 134.8 టన్నుల నుంచి 148.8 టన్నులకు ఎగసింది. విలువ రూపేణా 14 శాతం వృద్ధితో రూ.35,610 కోట్ల నుంచి రూ.40,690 కోట్లకు చేరింది. పెట్టుబడుల డిమాండ్‌ చూస్తే, 11 శాతం వృద్ధితో 31 టన్నుల నుంచి 34.4 టన్నులకు ఎగసింది. దీని విలువ మొత్తం రూ.8,200 కోట్ల నుంచి రూ.9,400 కోట్లకు చేరింది.  

ఈ ఏడాది ద్వితీయ త్రైమాసికంలో పసిడి రీసైక్లింగ్‌ ప్రక్రియ పరిమాణం 13.85 శాతం తగ్గింది. 26.7 టన్నుల నుంచి 23 టన్నులకు చేరింది.  ఈ త్రైమాసికంలో పసిడి దిగుమతులు 55 శాతం పెరిగాయి. 173 టన్నుల నుంచి 269 టన్నులకు ఎగశాయి.

త్రైమాసికం ప్రారంభంలో పసిడి ధర తగ్గడం దీనికి కారణం. బంగారం దిగుమతులు ప్రస్తుత  ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో  (ఏప్రిల్‌–సెప్టెంబర్‌) 4 శాతం పెరిగాయి. విలువ రూపంలో 17.63 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 2017 ఇదే కాలంలో ఈ విలువ 16.96 బిలియన్‌ డాలర్లు.  ఆభరణాల పరిశ్రమ డిమాండ్‌ దీనికి నేపథ్యం.  

ఇటీవల రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కూడా కొంత పసిడి కొనుగోలు చేసింది. తాజా గణాంకాల ప్రకారం భారత్‌ విదేశీ మారకపు నిల్వల్లో దాదాపు 20.23 బిలియన్‌ డాలర్ల పసిడి నిల్వలు ఉన్నాయి.  తొమ్మిదేళ్లలో ఆర్‌బీఐ పసిడిని కొనుగోలు చేయడం తొలిసారి. ఈ ఏడాది మొత్తంలో చూస్తే భారత్‌ పసిడి డిమాండ్‌ 700 నుంచి 800 టన్నుల శ్రేణిలో ఉంటుందని భావిస్తున్నామని డబ్ల్యూజీసీ పేర్కొన్నది.   

Follow Us:
Download App:
  • android
  • ios