Asianet News TeluguAsianet News Telugu

నా డబ్బుతో జెట్‌ను ఆదుకోండన్న మాల్యా

పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు విజయ్ మాల్య.. భారత ప్రభుత్వ రంగ బ్యాంకులు, కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయని ఆరోపించారు. 

After Jet Airways bailout Vijay Mallya criticises public sector banks
Author
New Delhi, First Published Mar 26, 2019, 12:10 PM IST

 ప్రభుత్వ రంగ బ్యాంకులు డబుల్ స్టాండర్డ్స్ (ద్వంద ప్రమాణాలు) పాటిస్తున్నాయని పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు, మద్యం వ్యాపారి విజయ్‌మాల్యా ఆరోపించారు. జెట్‌ ఎయిర్‌వేస్‌ సంక్షోభానికి పరిష్కారం దిశగా అడుగులు పడుతున్న వైనంపై హర్షం వ్యక్తం చేశారు. 

అప్పుల ఊబిలో కూరుకున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ను కాపాడేందుకు ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకర్లు ప్రతిపాదించిన పరిష్కార ప్రణాళికకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగానే ‘జెట్’ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌, ఆయన భార్య అనితా గోయల్ బోర్డు నుంచి వైదొలిగారు. 

ఆర్థిక సంక్షోభంలో ఉన్న విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ను, సంస్థ, ఉద్యోగులను కాపాడేందుకు తన డబ్బులను తీసుకోవాలని బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. ఇప్పటికైనా దీనిపై బ్యాంకులు పునరాలోచించాలని కోరారు.  సంక్షోభంలో ఉన్న తనపట్ల ఎన్డీఏ సర్కార్ డబుల్‌​ స్టాండర్డ్స్‌ని  అవలంబిస్తోందంటూ మంగళవారం వరుస ట్వీట్లతో మండిపడ్డారు.  

‘జెట్‌ ఎయిర్వేస్‌ను ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆదుకుని ఎందరో ఉద్యోగాలను, సంస్థను కాపాడటం ఆనందంగా ఉంది. కింగ్‌ఫిషర్‌ను కూడా ఇలాగే ఆదుకొని ఉంటే బాగుండేది. కింగ్‌ఫిషర్‌ను కాపాడండి అంటూ అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు నేను రాసిన లేఖలపై బీజేపీ ప్రతినిధులు ఎన్నో ఆరోపణలు చేశారు.

యూపీఏ హయాంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌కు తప్పుగా మద్దతిస్తున్నాయని ఆరోపించారు. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వ హయాంలో పరిస్థితి ఎందుకు మారిందో మరి. నాకైతే ఆశ్చర్యంగానే ఉంది’ అని మాల్యా విమర్శలు చేశారు.

దేశ అత్యుత్తమ వైమానిక సంస్థ, ఉద్యోగులు, వ్యాపారం నిర్దాక్షిణ్యంగా విఫలం అవుతోంటే ఎన్‌డీఏ ఆధ్వర్యంలోని  ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎందుకు స్పందించలేదని విజయ్ మాల్యా ట్వీట్‌ చేశారు. సంక్షోభంలో ఉన్న కింగ్‌ఫిషర్‌ సంస్థను, సంస్థ ఉద్యోగులను కాపాడేందుకు 4వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టానని మాల్యా పేర్కొన్నారు.

తాను భారీగా పెట్టుబడులు పెట్టిన సంగతిని గుర్తించకుండా  తనను అన్ని విధాలా ఇబ్బందులకు గురి చేశారని విజయ్ మాల్య అన్నారు. ఉత్తమ ఉద్యోగులు, మంచి సేవలు అందిస్తూ అత్యుత్తమ కంపెనీగా ఉన్న కింగ్‌ఫిషర్‌ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇదే ప్రభుత్వ రంగ బ్యాంకులు నిర్దాక్షిణ్యంగా వదిలేశాయని ఆరోపించారు.

అలాగే తన లిక్విడ్‌ ఆస్తులను తీసుకోవాలని గౌరవనీయమైన కర్నాటక్‌ హైకోర్టు ముందు ఇప్పటికే తన ప్రతిపాదనను ఉంచానని కానీ ప్రభుత్వ బ్యాంకులు, ఇతర రుణ దాతలు ఎందుకు సమ్మతించడం లేదని విజయ్ మాల్య ప్రశ్నించారు.  తన  సొమ్మును తీసుకోవడం ద్వారా జెట్‌  ఎయిర్‌వేస్‌ని కాపాడాలని మాల్యా బ్యాంకులను కోరాడు.

జెట్ ఎయిర్‌వేస్‌ లాంటి సంక్షోభ పరిస్థితినే మాల్యా సొంతమైన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ ఎదుర్కొంది. దివాళా వల్ల కింగ్ ఫిషర్ 2012లో కుప్పకూలింది.  దీంతో బ్యాంకులకు 9వేల కోట్ల మేర రుణాలను ఎగవేసి విదేశాలకు పరారైన లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా ప్రస్తుతం లండన్‌లో కేసు విచారణను ఎదుర్కొంటున్నారు. 

గతవారం ఫెరా (విదేశీఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్) ఉల్లంఘన కేసులో బెంగళూరులోని విజయ్ మాల్యా ఆస్తులను అటాచ్ మెంట్ చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. దీనిపై తదుపరి వాదనలు జూలై 10వ తేదీన జరగనున్నాయి.

కాగా జెట్‌ ఎయిర్‌వేస్‌ ఛైర్మన్ నరేష్ గోయల్ సోమవారం దిగివచ్చారు. ఆయన భార్య అనితాతోపాటు సంస్థ బోర్డును వీడుతున్నట్టు ప్రకటించారు. దీంతో బ్యాంకర్లు 1500 కోట్ల రూపాయల బెయిల్  అవుట్‌ ప్యాకేజీకి  అంగీకరించిన సంగతి తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios