Asianet News TeluguAsianet News Telugu

దివాలా దిశగా జెట్‌ ఎయిర్‌వేస్‌?: రుణ వాయిదా చెల్లింపుల్లో డిఫాల్ట్

రుణ వాయిదాల చెల్లింపుల్లో విఫలమైన ప్రైవేట్ విమానయాన సంస్థ ‘జెట్ ఎయిర్వేస్’ దివాళా దిశగా అడుగులేస్తున్నది. టాటా సన్స్ నుంచి పెట్టుబడులు తెచ్చేందుకు ప్రయత్నించి విపలమైన జెట్ ఎయిర్వేస్.. ఇతిహాద్ సంస్థకు మరో 24 శాతం వాటా విక్రయించేందుకు సిద్ధమైనా అది ఇంకా ఖరారు కాలేదని తెలుస్తున్నది.

After default, Naresh Goyal may have to give up Jet Airways to keep it afloat
Author
New Delhi, First Published Jan 3, 2019, 12:07 PM IST

తాజాగా బ్యాంకులకు అప్పులు, వడ్డీలు చెల్లించడంలో విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ విఫలమైంది. విమాన ఇంధన ధరలు పెరుగుదలతోపాటు పలు ప్రతికూల పరిస్థితులతో జెట్ ఎయిర్వేస్ తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే ఎస్బీఐ నేతృత్వంలోని రుణదాత బ్యాంకుల బృందానికి కట్టాల్సిన రుణాలు, వడ్డీ చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని జెట్‌ ఎయిర్‌వేస్‌ అంగీకరించింది. గత నెల 31 నాటికి నిర్దేశిత గడువు మేరకు చేయాల్సిన చెల్లింపులను ఆలస్యం అవుతున్నాయని తెలిపింది.

తాత్కాలికంగా నగదు నిల్వల్లో వచ్చిన తేడాలతో ఈ సమస్య ఏర్పడినట్లు పేర్కొంది. ఈ అంశంపై తాము బ్యాంకుల కన్సార్టియంతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది. 25ఏళ్లుగా విమాన సేవల్లో ఉన్న జెట్‌ ఎయిర్‌వేస్‌ కొన్ని నెలలుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది.

అప్పుల్లో కూరుకుపోవడంతో పైలట్లు, ఇతర సిబ్బందికి జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేని దుస్థితి నెలకొంది. ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ను కొనుగోలు చేయడానికి లేదా అందులో పెట్టుబడులు పెట్టడానికి ఒక దశలో టాటా గ్రూపు చర్చలు జరిపింది.

అబుదాబికి చెందిన ఇతేహాద్ సంస్థకు ఇప్పటికే జెట్ ఎయిర్వేస్ సంస్థలో 24 శాతం వాటా ఉంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో జెట్‌లో పెట్టుబడులు పెంచడానికి ఎతిహాద్‌ కూడా చర్చలు జరుపుతోంది.

ముడిచమురు ధరల పెరుగుదల, బలహీన రూపాయి, చౌక చార్జీలు, తీవ్రమైన పోటీ తదితర అంశాలతో నరేశ్‌ గోయల్‌ సారథ్యంలోని జెట్‌ ఎయిర్‌వేస్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

ఇప్పటికే కొన్ని త్రైమాసికాలుగా భారీ నష్టాలను చవిచూస్తూ  ఉద్యోగుల వేతనాలు చెల్లించడానికి సైతం ఇబ్బందులు పడుతున్న జెట్‌ ఎయిర్‌వేస్‌  ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని దేశీయ బ్యాంకుల కన్సార్షియానికి రుణంలో అసలును, వడ్డీని కలిపి డిసెంబరు 31న చెల్లించాల్సిన వాయిదాలు చెల్లించలేకపోయింది.

తాత్కాలిక నగదు ప్రవాహాల్లో తారతమ్యాలే దీనికి కారణమని జెట్‌ ఎయిర్‌వేస్‌ స్టాక్‌ ఎక్స్చేంజిలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. జెట్‌ ఎయిర్‌వేస్‌ ఖాతాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఎస్‌బీఐ ఇప్పటికే ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు ఆదేశించింది.

వరుసగా గత మూడు త్రైమాసికాలుగా జెట్‌ఎయిర్‌వేస్‌ రూ.1,000 కోట్లకుపైగా నష్టాలను ప్రకటిస్తూ వస్తోంది. నష్టాల తగ్గింపు చర్యల్లో భాగంగా కొంత మంది ఉద్యోగులను తొలగించింది. లాభదాయకం కాని మార్గాల్లో సర్వీసులను కూడా నిలిపివేసింది. 

కాగా, మూలధన అవసరాల కోసం, కొన్ని రకాల చెల్లింపులకు రూ.1,500 కోట్ల మేర స్వల్పకాలిక రుణం తీసుకునే ప్రయత్నాలను సంస్థ ప్రారంభించినట్టు జెట్ ఎయిర్వేస్ కంపెనీ వర్గాలు తెలిపాయి.

ఇదిలా ఉండగా గోటి చుట్టూ రోకటి పోటు అన్నట్లు ఇప్పటికే సమస్యలతో సతమతం అవుతున్న జెట్‌ఎయిర్‌వేస్‌ దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణ సదుపాయాల రేటింగ్‌ను తగ్గిస్తున్నట్టు రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా బుధవారం ప్రకటించింది. 

‘యాజమాన్యం నుంచి లిక్విడిటీ పెంపు చర్యల అమలులో జాప్యం నెలకొంది. దీంతో లిక్విడిటీ సమస్య తీవ్రతరమైంది. కంపెనీ ఇప్పటికే ఉద్యోగుల వేతనాల చెల్లింపులు, విమానాల అద్దె చెల్లింపులనూ ఆలస్యం చేస్తోంది’అని ఇక్రా తన నిర్ణయం వెనుక కారణాలను తెలియజేసింది.

జెట్‌ ఎయిర్‌వేస్‌ 2018 డిసెంబర్‌ నుంచి 2019 మార్చి వరకు రూ.1,700 కోట్ల మేర, 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.2,444 కోట్లు, రూ.2020–21లో రూ.2,167 కోట్ల మేర బకాయిలను తీర్చాల్సి ఉందని ఇక్రా పేర్కొన్నది.

జెట్‌ ఎయిర్‌వేస్‌ రుణ చెల్లింపుల్లో విఫలమైందన్న సమాచారం బయటకు రావడంతో స్టాక్ మార్కెట్లలో కంపెనీ షేర్ల అమ్మకాలకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. దీంతో బీఎస్‌ఈలో ఆరు శాతానికి పైగా నష్టపోయి రూ.263.75 వద్ద క్లోజయింది. ఎన్‌ఎస్‌ఈలో ఏడు శాతం వరకు నష్టపోయింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios