Asianet News TeluguAsianet News Telugu

జీఎంఆర్‌కు షాక్: ఏవియేషన్ ఆపరేషన్స్ గెలుచుకున్న ఆదానీ

వ్యాపారం అంటేనే పోటీ.. ఎదుటి సంస్థల నుంచి వచ్చే పోటీని.. దాని మెళకువలను గుర్తించకుండా ముందుకు సాగితే చతికల పడాల్సిందే. ప్రస్తుతం మౌలిక వసతుల రంగ సంస్థగా పేరొందిన ‘జీఎంఆర్’ హైదరాబాద్ విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తోంది. తాజాగా ఆరు ఎయిర్ పోర్టుల నిర్వహణ బాధ్యతను చేపట్టేందుకు బిడ్లను ఆహ్వానిస్తే.. ఆదానీ గ్రూపు అత్యదిక ధర కోట్ చేసి ఐదింటిని ఎగురేసుకుపోయింది.

Adani makes a big bang airports entry, bags 5/6 AAI facilities
Author
New Delhi, First Published Feb 26, 2019, 10:30 AM IST

న్యూఢిల్లీ: పౌర విమానయాన రంగంలోకి అదానీ గ్రూప్ అడుగుపెట్టింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ ప్రైవేటీకరణ కోసం ప్రవేశ పెట్టిన ఆరు విమానాశ్రయాల వేలంలో ఐదింటిని సొంతం చేసుకున్నది. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సీనియర్ అధికారి ఒకరు సోమవారం తెలిపారు. 

అహ్మదాబాద్, తిరువనంతపురం, లక్నో, మంగళూరు, జైపూర్ విమానాశ్రయాలను ఈ బిడ్డింగ్‌లో అదానీ గ్రూప్ గెలుచుకున్నదని సదరు అధికారి స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం కొన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, అయిదు విమానాశ్రయాలను అదానీ గ్రూప్‌కు అప్పగిస్తామని వివరించారు. 

ఇప్పటి వరకు విమానాశ్రయాల నిర్వహణ కాంట్రాక్టు వేలంలో ముందంజలో ఉన్న జీఎంఆర్ సంస్థనే తోసి రాజని అతి ఎక్కువ ధరను కోట్ చేసి మరీ ఐదు విమానాశ్రయాల నిర్వహణ కాంట్రాక్టును ఆదానీ గ్రూపు దక్కించుకున్నది.

గౌహతి ఎయిర్‌పోర్టు కోసం బిడ్డింగ్‌ను మంగళవారం తెరుస్తామని పౌర విమానయాన శాఖ అధికారి చెప్పారు. నెలవారీ ప్రయాణికుల ఛార్జీలను పరిగణలోకి తీసుకొని బిడ్‌ విజేతలను ఏఏఐ ఎంపిక చేస్తుంది. ప్రస్తుతం ఏఏఐ ఆధ్వర్యంలో ఉన్న ఆరు విమానాశ్రయాల నిర్వహణకు 10కంపెనీల నుంచి 32 సాంకేతిక బిడ్లు దాఖలయ్యాయి.

గతేడాది నవంబర్ నెలలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో విమానాశ్రయాలను నడపాలనే ప్రతిపాదన కేంద్రప్రభుత్వం తీసుకొచ్చింది. 50 ఏండ్లపాటు ఈ విమానాశ్రయాల ఆధునికీకరణ పనులు, నిర్వహణ అదానీ గ్రూప్ చేయాల్సి ఉంటుందని వెల్లడించింది.

అహ్మదాబాద్‌, జయపుర విమనాశ్రయాలకు ఏడింటి చొప్పున, లఖ్‌నవూ, గువాహటీలకు చెరో ఆరు, మంగళూరు, తిరువనంతపురం విమానాశ్రయాలకు చెరో మూడు బిడ్లు దాఖలయ్యాయి. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, సేవలను అందించే దిశగా విమానాశ్రయాలను తీర్చిదిద్దే లక్ష్యంతో ఏఏఐ ఈ ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాన్ని తీసుకొస్తోంది.

ఎయిర్‌పోర్టుల బిడ్డింగ్‌లో అదానీ గ్రూప్ దాఖలు చేసిన పర్-ప్యాసింజర్ ఫీ.. ఇతర పోటీ సంస్థలకు అందనంత స్థాయిలో ఉన్నది. దీంతోనే ఏకంగా ఐదు విమానాశ్రయాల ఆధునికీకరణ, నిర్వహణ పగ్గాలను చేజిక్కించుకున్నది. ఐదు విమానాశ్రయాల నిర్వహణ బిడ్లను గెలుచుకున్నందుకు ఆనందంగా ఉన్నదని ఆదానీ గ్రూపు ఒక ప్రకటనలో తెలిపింది. 

అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు కోసం రూ.177, జైపూర్ విమానాశ్రయం కోసం రూ.174 చొప్పున ప్యాసింజర్ ఫీలను గౌతమ్ అదానీ సారథ్యంలోని అదానీ గ్రూప్ సమర్పించింది. లక్నో కోసం రూ.171, తిరువనంతపురం కోసం రూ.168, మంగళూరు కోసం రూ.115 చొప్పున బిడ్లను దాఖలు చేసింది. 

ఈ దరిదాపుల్లో కూడా మరే సంస్థ బిడ్లను దాఖలు చేయకపోవడంతో అదానీ గ్రూప్‌దే విజయమైంది. దీంతో ఆయా విమానాశ్రయాల్లో ఒక్కో ప్రయాణీకుడికి 50 ఏండ్లపాటు ఏఏఐకి అదానీ గ్రూప్ ఈ మొత్తాలను చెల్లించాల్సి ఉంటుంది.

ఇప్పటి వరకు మౌలిక రంగ దిగ్గజం జీఎమ్మార్ సంస్థ కూడా.. అహ్మదాబాద్‌కు రూ.85, జైపూర్‌కు రూ.69 చొప్పున పర్-ప్యాసింజర్ ఫీలను ఇస్తామన్న జీఎమ్మార్ గ్రూప్.. లక్నో కోసం రూ.63, తిరువనంతపురం కోసం రూ.63, మంగళూరు కోసం రూ.18 ఇస్తామంటూ బిడ్లు వేసినట్లు ఏఏఐ ప్రకటనలో వివరించింది. ప్రస్తుతం దేశీయంగా హైదరాబాద్, ఢిల్లీ విమానాశ్రయాలను జీఎమ్మార్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 

ఇకపోతే అహ్మదాబాద్, జైపూర్ ఎయిర్‌పోర్టుల కోసం నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్‌ఐఐఎఫ్), జ్యూరిచ్ ఎయిర్‌పోర్టు ఇంటర్నేషనల్ ఏజీ కూడా సంయుక్తంగా బిడ్లను దాఖలు చేశాయి. వరుసగా రూ.146, రూ.155 చొప్పున పర్-ప్యాసింజర్ ఫీలను సమర్పించాయి. లక్నో ఎయిర్‌పోర్టు కోసం ఏఎంపీ క్యాపిటల్ రూ.139 బిడ్‌ను వేయగా, తిరువనంతపురం ఎయిర్‌పోర్టు కోసం కేరళ రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ రూ.135 బిడ్‌ను కోడ్ చేసింది. మంగళూరు ఎయిర్‌పోర్టు కోసం కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ రూ.45 బిడ్ వేసినట్లు ఏఏఐ తెలియజేసింది. 

ఆదానీ గ్రూపు ఓ బహుళ వాణిజ్య సంస్థగా వ్యాపార విస్తరణ వైపు వేగంగా అడుగులేస్తున్నది. ఈ క్రమంలోనే విమానయాన రంగంపై గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే ముంబై ఎయిర్‌పోర్టులోనూ వాటాను దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలను చేస్తున్నారు. 23.5 శాతం వాటా కొనుగోలుకు అదానీ గ్రూప్ పోటీ పడుతున్నది. 

దక్షిణాఫ్రికాకు చెందిన ఎయిర్‌పోర్ట్స్ కంపెనీ సౌత్ ఆఫ్రికా (ఏసీఎస్‌ఏ), బిడ్‌వెస్ట్‌లకు చెందిన ఈ వాటా కోసం ఇప్పటికే వాటాదారైన జీవీకే గ్రూప్ కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నది. దీంతో ఈ వాటా రేసు రసవత్తరంగా తయారైంది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (ఎంఐఏఎల్)ను జీవీకే, ఏసీఎస్‌ఏ, బిడ్‌వెస్ట్‌లు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios