Asianet News TeluguAsianet News Telugu

ఉర్జిత్ సారథ్యంలో ఆర్థిక స్థిరత్వం: మోదీ

వ్యక్తిగత కారణాలతో ఆర్బీఐ గవర్నర్ గా రాజీనామా చేశానని పేర్కొన్న ఉర్జిత్ పటేల్‌ను ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రశంసల్లో ముంచెత్తారు. కానీ ఇటీవలి వివాదాల నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ విమర్శనాస్త్రాలు సంధించింది. కార్పొరేట్లు, ఆర్థిక వేత్తలు గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.

"Will Miss Him": PM Modi Tweets His Farewell To RBI Governor Urjit Patel
Author
Delhi, First Published Dec 11, 2018, 7:22 AM IST

ఉర్జిత్‌ పటేల్ నాయకత్వంలో ఆర్‌బీఐ ఆర్థిక స్థిరత్వం సాధించిందని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. స్థూల ఆర్థిక విషయాల గురించి లోతుగా అర్థం చేసుకోగలిగే వ్యక్తి ఆయన అని పేర్కొన్నారు. బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఉన్న గందరగోళాన్ని తొలగించి, ఆ వ్యవస్థను క్రమశిక్షణలో పెట్టారని ట్వీట్ చేశారు.

భవిష్యత్‌ తరానికి గొప్ప మార్గదర్శిగా నిలిచారని ఆయనలో ఎటువంటి తప్పులూ పట్టలేని విధంగా నిజాయతిగా నడుచుకున్నారని డిప్యూటీ గవర్నర్‌, గవర్నర్‌గా ఆయన ఆర్‌బీఐలో ఆరేళ్లుగా విధులు నిర్వహించారని పేర్కొన్నారు.

‘ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా మన ఆర్థిక వ్యవస్థకు, ఆర్‌బీఐకి, ప్రభుత్వానికి మంచిది కాదు. ఆయన కనీసం వచ్చే ఏడాది జులై వరకైనా ఆ పదవిలో ఉండాలి. ఆ లోగా తదుపరి ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆయనతో ప్రధాని మోదీ మాట్లాడాలి. ఆయన రాజీనామా చేయడానికి గల కారణాలను తెలుసుకుని, ఆయన నిర్ణయం వెనక్కి తీసుకునలా నచ్చచెప్పాలి’ అని బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి పేర్కొన్నారు. 

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ స్పందిస్తూ ‘ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా, గవర్నర్‌గా ఉర్జిత్‌ పటేల్‌ అందించిన సేవలు ప్రశంసనీయం. ఆయనతో కలిసి పని చేయడం నాకు కూడా గొప్ప అనుభూతినిచ్చింది.

ఆయన మరికొన్నేళ్లు ప్రజా సేవను కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. ఆయనతో కలిసి పనిచేయడం నిజంగా నాకు గర్వకారణం. ఇకముందూ ఆయనకు మంచే జరుగాలి’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబాల్ స్పందిస్తూ ‘స్వయంగా మోదీ నియమించిన అధికారులే రాజీనామాలు చేస్తున్నారు.

మొదట సీఈఏ అర్వింద్‌ సుబ్రహ్మణియన్‌.. ఇప్పుడు ఉర్జిత్‌ పటేల్. ఆర్థిక వ్యవస్థ సమస్యలతో సతమతమవుతోంది. మోదీ తనకు తానే గొప్ప ఆర్థిక వేత్తనని భావిస్తున్నారు. తనకు ఇతరుల సాయం అవసరం లేదని అనుకుంటున్నారు. అందుకే వీరందరూ రాజీనామాలు చేస్తున్నారు’ అని విమర్శించారు.

ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పందిస్తూ ‘ఊర్జిత్ పటేల్ నిర్ణయాన్ని గౌరవించాలి. అయితే దీని వెనుక కారణాలనూ తప్పక తెలుసుకోవాలి. దేశ ప్రగతి, అభివృద్ధి కోసం రాజ్యాంగ, వ్యవస్థాగత నియంత్రణ సంస్థల బలోపేతం అవసరం. ఈ దిశగా ఇప్పుడు భారతీయులంతా కూడా ఆలోచించాలి’అని వ్యాఖ్యానించారు. 

మాజీ ఆర్థిక శాఖ మంత్రి పీ చిదంబరం స్పందిస్తూ ‘పటేల్ రాజీనామా ఊహించినదే. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. మోదీ సర్కారు పాలనలో ఆత్మ గౌరవానికి స్థానం లేదు. మరో పరాభవం ఎదురుకాకముందే పటేల్ మంచి నిర్ణయం తీసుకున్నారు. చివరిసారిగా ఆర్బీఐ బోర్డు సమావేశమైన నవంబర్ 19.. ఓ చీకటి రోజు’ అని ఆందోళన వ్యక్తం చేశారు. 

‘ఆశ్చర్యం. ఆర్బీఐ, కేంద్రం మధ్య విభేదాలకు సంబంధించి ఓ పరిష్కార మార్గం కనిపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఊర్జిత్ పటేల్ రాజీనామా ఎదురుదెబ్బే. నవంబర్ 19న జరిగిన ఆర్బీఐ బోర్డు సమావేశాన్ని మీడియాతోసహా అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు’ అని ఆర్బీఐ బోర్డు స్వతంత్ర డైరెక్టర్ ఎస్ గురుమూర్తి స్పష్టం చేశారు. 

‘ఇది నిజంగా మాకు దిగ్భ్రాంతిని కలిగించింది. ఊర్జిత్ పటేల్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఊహించలేదు. కేంద్రం, ఆర్బీఐ మధ్య విభేదాలు.. ముఖ్యంగా ఆర్బీఐ స్వేచ్ఛ, మిగులు నిధుల తరలింపు అంశంపై చర్చల నడుమ పటేల్ తప్పుకోవడం బాధాకరం’ అని ఆర్బీఐ ఉద్యోగుల సంఘం పేర్కొన్నది. 

‘పటేల్ రాజీనామాపై ఎలా స్పందించినా అది రాజకీయ రంగును సంతరించుకుంటుంది. అయినప్పటికీ ఈ అంశం ఎలాంటి సంకేతాలను ఇస్తుందన్నదానిపై ప్రభుత్వం తప్పక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. మరో సమర్థుడితో పటేల్ స్థానం భర్తీ అవుతుందని ఆశిస్తున్నాం’ అని పీహెచ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి  రాజీవ్ తల్వార్ వ్యాఖ్యానించారు. 

సీఐఐ అధ్యక్షుడు రాకేశ్ భారతీ మిట్టల్ స్పందిస్తూ ‘వ్యక్తిగత కారణాలతో ఆర్బీఐ గవర్నర్ పదవికి పటేల్ రాజీనామా చేశారు. ఈ లోటు దేశ ఆర్థిక వ్యవస్థపై పడకుండా చర్యలు తీసుకోవాలి. ఆర్బీఐ స్వతంత్రతకు ఎలాంటి భంగం కలుగబోదనే మేమూ విశ్వసిస్తున్నాం. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో అనవసర భయాలు మంచివి కావు’ అని హితవు చెప్పారు. 

అసోచాం ప్రధాన కార్యదర్శి ఉదయ్ కుమార్ వర్మ స్పందిస్తూ 
‘ఈ విషయంపై ఏవిధంగానూ స్పందించలేని పరిస్థితి. ఇది కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐకి మధ్యనున్న అంశం. తాజా పరిణామంతో దేశ ఆర్థిక పరిస్థితులకు ఇబ్బంది కలుగకుండా ఆర్థిక మంత్రిత్వ శాఖ దృష్టి పెట్టాలి. ద్రవ్య విధానాలకు ఆటంకం ఏర్పడకుండా చూడాలి’ అని పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios