Asianet News TeluguAsianet News Telugu

భారత మార్కెట్లోకి.. ‘ట్రయంఫ్‌’ స్ట్రీట్ ట్విన్ అండ్ స్క్రాంబ్లర్

బ్రిటన్ సూపర్ బైక్ ల తయారీ సంస్థ ట్రయంఫ్ తాజాగా భారతదేశ మార్కెట్లోకి రెండు మోడల్ బైక్ లను ఆవిష్కరించింది. ట్రయంఫ్ స్ట్రీట్ ట్విన్ ధర రూ.7.45 లక్షలు కాగా, స్ట్రీట్ స్క్రాంబ్లర్ ధర రూ.8.45 లక్షలుగా నిర్ణయించారు. 

Triumph launches new versions of Street Twin, Street Scrambler in India
Author
New Delhi, First Published Feb 15, 2019, 1:26 PM IST

బ్రిటన్‌ సూపర్‌బైక్‌ బ్రాండ్‌ ట్రయంఫ్‌ రెండు మోడళ్లలో కొత్త వేరియంట్లను భారత్‌ మార్కెట్లోకి తీసుకొచ్చింది. స్ట్రీట్‌ ట్విన్, స్ట్రీట్‌ స్క్రాంబ్లర్‌ మోడళ్లలో కొత్త వేరియంట్లను అందుబాటులోకి తెచ్చామని ట్రయంఫ్‌ మోటార్‌సైకిల్స్‌ ఇండియా తెలిపింది.

వీటి ధరలు రూ.7.45 లక్షల నుంచి రూ.8.55 లక్షల రేంజ్‌లో ఉన్నాయని కంపెనీ జనరల్‌ మేనేజర్‌ షౌన్‌ ఫారూఖ్‌ పేర్కొన్నారు. ఈ రెండు బైక్‌లను 900 సీసీ హై–టార్క్‌ ప్యారలాల్‌ ట్విన్‌ ఇంజిన్‌తో రూపొందించామని పేర్కొన్నారు.

స్ట్రీట్‌ ట్విన్‌ బైక్‌ ధర రూ.7.45 లక్షలని, స్ట్రీట్‌ స్క్రాంబ్లర్‌  ధర రూ.8.55 లక్షలని తెలిపారు. ఈ బైక్‌ల ‘పవర్‌’ను 18 శాతం పెంచామని, దీంతో వీటి పవర్‌ 65 పీఎస్‌కు పెరిగిందని వివరించారు. పవర్‌ పెంపొందించడంతో పాటు మరిన్ని అదనపు ఫీచర్లతో ఈ వేరియంట్లను అందిస్తున్నామని తెలిపారు.

రెండేళ్ల తయారీ వారంటీని (కిలోమీటర్లతో సంబంధం లేకుండా) ఆఫర్‌ చేస్తున్నామని చెప్పారు. త్వరలో అసోం రాజధాని గౌహతి నగరంలో నూతన డీలర్ షిప్ ప్రారంభించడానికి ప్రణాళికలు రూపొందించామని ట్రయంఫ్ భారత్ జనరల్ మేనేజర్ షౌన్ ఫారూఖ్ తెలిపారు.

వచ్చే మూడు నెలల్లో మరిన్ని కొత్త వేరియంట్లను అందుబాటులోకి తెస్తామని షారూఖ్‌ తెలిపారు. భారత 500 సీసీ కేటగిరీ బైక్‌ల్లో ప్రస్తుతం తమ మార్కెట్‌ వాటా 16 శాతంగా ఉందని వివరించారు. భారత్‌లో వేగంగా వృద్ధి చెందుతున్న ప్రీమియమ్‌ బైక్‌ బ్రాండ్‌ తమదేనని ఆయన తెలిపారు. 

ప్రస్తుతం దేశంలో 16 డీలర్‌షిప్ లు ఉన్నాయని, 2020 నాటికి దాన్ని 20కి చేర్చడమే తమ లక్ష్యమని ట్రయంఫ్ భారత్ జనరల్ మేనేజర్ షౌన్ ఫారూఖ్ పేర్కొన్నారు. 2013లో 10 మోడల్ బైక్‌లతో ‘ట్రయంఫ్’ భారత్ మార్కెట్లో అడుగు పెట్టింది.

ఈ ఏడాది కూడా 1,200 యూనిట్లను విక్రయించే అవకాశం ఉందన్నారు. సంస్థ జూలై-జూన్ మధ్యకాలాన్ని ఆర్థిక సంవత్సరంగా వ్యవహరిస్తున్నది. గతేడాది ట్రయంఫ్ 1,175 యూనిట్ల బైకులను విక్రయించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios