Asianet News TeluguAsianet News Telugu

కారణమిదే: సెకండ్ హ్యాండ్ లగ్జరీ కార్లకు ఫుల్ గిరాకీ

ప్రతి ఒక్కరికీ లగ్జరీ కారులో తిరగాలని ఆశగా ఉంటుంది. కానీ  కానీ దాని ధరను చూసి వెనకడుగు వేస్తారు. తమ బంధువుల్లో ఎవరికైనా లగ్జరీ కారు ఉంటే దాన్ని నడిపి సరదా తీర్చుకునే వారు కూడా కొంత మంది ఉంటారు

Second-hand luxury cars pip new ones
Author
New Delhi, First Published Jan 27, 2019, 11:15 AM IST


న్యూఢిల్లీ: ప్రతి ఒక్కరికీ లగ్జరీ కారులో తిరగాలని ఆశగా ఉంటుంది. కానీ  కానీ దాని ధరను చూసి వెనకడుగు వేస్తారు. తమ బంధువుల్లో ఎవరికైనా లగ్జరీ కారు ఉంటే దాన్ని నడిపి సరదా తీర్చుకునే వారు కూడా కొంత మంది ఉంటారు. ఇప్పుడు మాత్రం పరిస్థితి మారుతోంది. సెకండ్‌ హ్యాండ్‌ లగ్జరీ కార్లు విపరీతంగా అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో వాటిని కొనే వారి సంఖ్య పెరుగుతోంది. 

సంపన్నుల ఇంట్లో రెండు మూడు కంపెనీల లగ్జరీ కార్లు ఉంటాయి. కొత్త మోడళ్లు రాగానే పాతవాటిని మార్చేస్తుంటారు. సెకండ్ హ్యాండ్ కార్ల ధరలు తక్కువగా ఉండటంతో లగ్జరీ కార్లపై మోజున్న వారు కొనుక్కుంటున్నారు. గత ఏడాదిలో సెకండ్‌ హ్యాండ్‌ లగ్జరీ కార్ల అమ్మకాలు 15 శాతం నుంచి 30 శాతం వరకు పెరిగాయి. 

సెకండ్‌ హ్యాండ్‌ కార్లనే కొంటున్న వారి సంఖ్య పెరుగుతున్నందు వల్ల కొత్త కార్ల అమ్మకాలపై ప్రభావం పడుతోంది. గత ఏడాదిలో కొత్త లగ్జరీ కార్ల అమ్మకాలు కేవలం 3-4 శాతం మాత్రమే పెరిగాయి. ఇది గత దశాబ్దిలో అత్యల్పం అని గణాంకాలు చెబుతున్నాయి. ఇంతకు ముందు సెకండ్‌ హ్యాండ్‌ కార్లను కొనేందుకు ఫైనాన్స్‌ లభించేది కాదు. ఇక వాటి నిర్వహణకు  ఇబ్బందులు ఉండేవి.

కానీ ఇప్పుడు సెకండ్‌ హ్యాండ్‌ కారుకు కూడా ఫైనాన్స్‌ దొరుకుతోంది. మెయింటెనెన్స్‌కు కంపెనీలు హామీ ఇస్తున్నాయి. వీటికి మించి రెండు, మూడేళ్లు నడిచిన కార్లు 25 శాతం నుంచి 40 శాతం వరకు తక్కువ ధరలకు దొరుకుతున్నాయి. అందుకే ఈ కార్లకు గిరాకీ ఎక్కువగా ఉంటోందని పరిశీలకులు చెబుతున్నారు. 

గత ఏడాది సెకండ్‌ హ్యాండ్‌ లగ్జరీ కార్ల అమ్మకాలు 15 శాతం పెరిగి 50,000కు చేరినట్టు ఓ సంస్థ చెబుతోంది. 2017లో 40,000కు పైగా కార్లు అమ్ముడయ్యాయని మహీంద్రా ఫస్ట్ చాయిస్ వీల్స్ (ఎంఎఫ్సీడబ్ల్యూ) పేర్కొంది. ఇది 23 శాతానికి వెళ్లొచ్చని అంచనా. మెర్సిడెస్‌ బెంజ్‌, బీఎండబ్ల్యూ, జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌, ఆడీ తదితర కంపెనీలకు చెందిన సెకండ్‌ హ్యాండ్‌ కార్లు మార్కెట్లో లభిస్తున్నాయి.

గమ్మత్తేమిటంటే టాటా మోటార్స్ అనుబంధ సంస్థ జాగ్వార్ అండ్ లాండ్ రోవర్ సంస్థ 2017తో పోలిస్తే 77 శాతం కార్లు అధికంగా విక్రయించడం స్ఫూర్తిదాయంగా ఉంది. అయితే ఎన్ని కార్లు అమ్ముడు పోయాయన్న విషయం ఈ సంస్థ ఎండీ రోహిత్ సూరి బయటపెట్టలేదు. మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ మార్టిన్ స్క్యూవెంక్ సైతం సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయాలు రెండంకెల వ్రుద్ధి సాదిస్తోందన్నారు. 

అయితే జీఎస్టీ తగ్గింపు అంశం సంఘటిత డీలర్లు, అసంఘటిత డీలర్ల వద్ద కార్ల విక్రయాలపై ప్రభావం చూపుతోంది. అసంఘటిత డీలర్లు పన్ను ఎగవేతకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. గత 10 ఏళ్లలో మూడు లక్షలకు పైగా లగ్జరీ కార్లు మార్కెట్లోకి వచ్చాయి. వాటిల్లో చాలా వరకు అప్ డేటెడ్ కార్లు తాజాగా మార్కెట్లోకి రావడంతో పాత కార్లను విక్రయించేసి కొత్త వాటిని కొనుగోలు చేసేవారు పెరిగిపోయారు. నూతన కార్ల కొనుగోళ్లపై బీమా భారం పడటం కూడా సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలుపై ద్రుష్టి పెరుగడానికి కారణం అన్న అభిప్రాయం కూడా ఉంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios