Asianet News TeluguAsianet News Telugu

పీఎంఓ నిర్ణయం... జోరందుకోనున్న విద్యుత్ వాహనాల ఉత్పత్తి

దేశీయంగా విద్యుత్ వాహనాల వాడకాన్ని పెంచడంపైనే కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్రీకరించింది. అందుకోసం విద్యుత్ వాహనాల తయారీదారులకు అవసరమైన ఇన్సెంటివ్‌లు కల్పించాలని రాష్ట్రాలను కోరుతోంది. విడి భాగాల తయారీ కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి సరుకుపై సుంకాలు విధించొద్దన్న ఉత్పత్తిదారుల అభ్యర్థనను కేంద్రం మన్నించినట్లు తెలుస్తోంది. 
 

PMO okays ministries EV promotion measures
Author
New Delhi, First Published Feb 12, 2019, 3:13 PM IST

న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు వివిధ శాఖలకు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) అనుమతినిచ్చింది. వచ్చే ఐదేళ్లలో రోడ్లపై తిరిగే వాహనాల్లో విద్యుత్ వాహనాలు 15 శాతం ఉండాలని కేంద్రం లక్ష్యం నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. అయితే విద్యుత్ వాహనాల కోసం కేంద్రం ఎటువంటి సమగ్ర విధానాన్ని రూపొందించడం లేదని ఇంతకుముందు అధికార వర్గాలు తెలిపాయి. 

అయితే కొన్ని విధాన నిర్ణయాలను అమలులోకి తెచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు సీనియర్ అధికారులు తెలిపారు. గత నెల 29న జరిగిన సమావేశంలో వివిధ శాఖల నుంచి విద్యుత్ వాహనాల తయారీ దారులకు ఇన్సెంటివ్‌ల కల్పన మొదలు మౌలిక వసతుల కల్పన, కాలిబరేటెడ్ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, జీఎస్టీ రేట్లను హేతుబద్దీకరించాలన్న ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించినట్లు తెలుస్తోంది. 

తద్వారా పోటీ ప్రపంచంలో జాతీయంగా, అంతర్జాతీయంగా విద్యుత్ వాహనాల తయారీ సంస్థలు తమకు విడి భాగాలను తయారు చేసేందుకు అవసరమైన ముడి సరుకు దిగుమతిపై సకాంలు తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరాయి. మరోవైపు వివిధ నగరాలు, జాతీయ రహదారులపై చార్జింగ్ స్టేషన్ల నిర్మాణానికి విద్యుత్ మంత్రిత్వశాఖ మార్గదర్శకాలు రూపొందించింది. 

కాగా వ్యక్తిగత ఇళ్లు, వాణిజ్య సముదాయాల్లో చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు వెసులుబాటు కల్పిస్తూ నిబంధనలను సవరిస్తూ రూపొందించిన నోటిఫికేషన్‌కు హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రణాళిక అమలుకు నీతి ఆయోగ్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనున్నది. 

విద్యుత్ వాహనాల రిజిస్ట్రేషన్, రోడ్డు చార్జీలను తగ్గించాలని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు నీతి ఆయోగ్ లేఖలు కూడా రాసింది. ‘ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ హైబ్రీడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా (ఫేమ్-2)’ స్కీమ్ కింద ఇన్సెంటివ్‌లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇది ముందస్తు షరతు కానున్నది. 

విద్యుత్ వాహనాలపై పన్ను రాయితీ కల్పించే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్రాలను నీతి ఆయోగ్, కేంద్ర ప్రభుత్వం కోరిందని ఓ అధికారి తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యుత్ వాహనాల వినియోగాన్ని వేగంగా అమలులోకి తేవాలంటే సమర్థవంతమైన వ్యూహాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని అధికారులు చెబుతున్నారు. 

బ్యాటరీలతోపాటు అన్ని రకాల కాంపొనెంట్లు కలిపి విద్యుత్ వాహనాలను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసినప్పుడు మాత్రమే లక్ష్యాల సాధనలో విజయం సాధించగలమని ప్రభుత్వం భావిస్తున్నదయి. 2030 నాటికి రోడ్లపై తిరిగే కొత్త వాహనాలన్నీ విద్యుత్ ఆధారిత వాహనాలే కావాలన్నది ప్రభుత్వ అభిమతంగా ఉన్నది. అప్పుడే కర్బన ఉద్గారాల నియంత్రణతోపాటు పెట్రోలియం ఉత్పత్తులను 80 శాతం దిగుమతి చేసుకునే పరిస్థితి తప్పుతుందని ప్రధాని మోదీ భావిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios