Asianet News TeluguAsianet News Telugu

మహీంద్రా మినహా అంతా మైనస్సే.. టాటా మోటార్స్ ఆశలన్నీ హారియర్ పైనే

పండుగల సీజన్ ముగిసిపోవడంతోపాటు రూపాయి విలువ పతనం.. ఆర్తిక వ్యవస్థలో అనిశ్చితి వల్ల నవంబర్ నెలలో ప్రయాణ వాహనాల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. మారుతి సుజుకిలో కొన్ని మోడళ్లు మినహా మిగతా విభాగాల్లో తగ్గిపోతున్నది. 

Passenger vehicle sales decline in Nov due to adverse macro-economic factors
Author
Delhi, First Published Dec 2, 2018, 1:01 PM IST

వాహన తయారీ సంస్థలకు అమ్మకాల రూపంలో గట్టి ఎదురుదెబ్బతగిలింది. పండుగ సీజన్‌లో టాప్‌గేర్‌లో దూసుకెళ్లిన వాహన విక్రయాలు గత నెలలో తగ్గుముఖం పట్టాయి. కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీతోపాటు టాటా మోటార్స్, ఫోర్డ్, టయోటా కిర్లోస్కర్, హ్యుందాయిలకు నిరాశే ఎదురవగా, మహీంద్రా, ఎస్కార్ట్స్, హోండాలకు మాత్రం ఊరట లభించింది.

దేశ ఆర్థిక పరిస్థితులు నిరుత్సాహంగా ఉండటం, నగదు కొరత తీవ్రతరమవడం, మరోవైపు ఇంధన ధరలు భగ్గుమనడం, అధిక వడ్డీరేట్లతో వినియోగదారుల కొనుగోలు సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. కాకపోతే కంపాక్ట్, మిడ్ సైజ్, యుటిలిటీ విభాగాల వాహనాలకు మాత్రం ఒకింత డిమాండ్ ఉంది. మహీంద్రా అండ్ మహీంద్రా వాహనాలు మాత్రమే రెండంకెల వ్రుద్ధి రేటు నమోదు చేశాయి. 

ఫలితంగా మారుతి సుజుకి అమ్మకాలు 1,53,539 యూనిట్లకు పరిమితమయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలలో 1,54,600 కార్లను విక్రయించింది. వీటిలో దేశీయంగా 1,46,018 కార్లను విక్రయించిన జరిపిన సంస్థ 7,521 కార్లను విదేశాలకు ఎగుమతి చేసింది.

ప్రధానంగా మినీ సెగ్మెంట్‌కు చెందిన ఆల్టో, వ్యాగన్ ఆర్‌లకు డిమాండ్ పడిపోవడం వల్లే మారుతి సుజుకి విక్రయాల్లో ఎదురుదెబ్బ తగిలింది. మిగతా సెగ్మెంట్‌లైన కాంప్యాక్ట్, మిడ్-సైజ్, యుటిలిటీ విభాగాలకు చెందిన వాహనాలకు డిమాండ్ నెలకొన్నది.

నవంబర్‌లో టాటా మోటార్స్ 50,470 యూనిట్ల అమ్మకాలు జరిపింది. 2017 నవంబర్‌లో విక్రయించిన 52,464 యూనిట్లతో పోలిస్తే 3.8 శాతం క్షీణత నమోదైంది. పండుగ సీజన్ తర్వాత డిమాండ్ కొరవడిందని, వీటితోపాటు వడ్డీరేట్లు, చమురు ధరలు కూడా సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయని ఆ కంపెనీ వర్గాలు తెలిపాయి.

వీటిలో వాణిజ్య వాహన అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 5.15 శాతం క్షీణించి 33,468 యూనిట్లకు పడిపోగా, ప్యాసింజర్ వాహనాలు 1.01 శాతం తగ్గి 16,982 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన వాహనాలకు కొనుగోలుదారుల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉన్నదని, వచ్చే ఏడాది ప్రవేశపెట్టనున్న హరియర్‌పై సంస్థ గంపెడు ఆశ పెట్టుకున్నది.

మధ్యస్థాయి, భారీ వాణిజ్య వాహన అమ్మకాలు 24 శాతం తగ్గగా, లైట్ కమర్షియల్ వాహనాలు 2.18 శాతం పెరుగుదల నమోదైంది. హ్యుండాయ్ మోటార్ కార్ల విక్రయాలు 44,008ల నుంచి 43,709 యూనిట్లకు పడిపోయాయి. టయోటా కిర్లోస్కర్ మోటార్(టీకేఎం)కి కూడా నిరాశే ఎదురైంది. గత నెలలో కంపెనీ అమ్మకాలు 15.8 శాతం పతనం చెంది 10,721లకు పరిమితమయ్యాయి. 

కరెన్సీ రేట్లలో నెలకొన్న అనిశ్చితికి తోడు ఇంధన ధరలు భగ్గుమనడం, అధిక వడ్డీరేట్లతో ఆటోమొబైల్ ఇండస్ట్రీ సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని టీకేఎం డిప్యూటీ ఎండీ ఎన్ రాజా తెలిపారు. ఫోర్డ్ అమ్మకాలు కూడా 7,777 నుంచి 6,375లకు తగ్గాయి.

ఈ సందర్భంగా ఫోర్డ్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ అనురాగ్ మెహరోత్రా మాట్లాడుతూ..దేశీయ ఆర్థిక పరిస్థితులపై ప్రస్తుతం నెలకొన్న మందకొడి వృద్ధి భవిష్యత్‌లోనూ కొనసాగనున్నదని ఆయన పేర్కొన్నారు. కానీ, మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు రెండంకెల వృద్ధి నమోదవడం విశేషం.

గడిచిన నెలలో అమ్మకాలు 15 శాతం ఎగబాకి 41,564లకు చేరుకున్నాయని కంపెనీ ప్రెసిడెంట్ ఆటోమోటివ్ సెక్టార్ రాజన్ వాధేరా తెలిపారు. హోండా అమ్మకాలు 10 శాతం పెరిగి 13 వేలకు చేరుకున్నాయి. ఎస్కార్ట్ ట్రాక్టర్ల అమ్మకాలు 56.4 శాతం ఎగబాకి 8 వేల యూనిట్లకు చేరాయి. ద్విచక్ర వాహన తయారీలో అగ్రగామి సంస్థయైన హీరో మోటోకార్ప్ అమ్మకాలు స్వల్పంగా పెరిగి 6,10,252 యూనిట్ల విక్రయాలు జరిపింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios