Asianet News TeluguAsianet News Telugu

ఆటో ఇండస్ట్రీకి షాక్: నిస్సాన్‌ ఛైర్మన్‌ కార్లోస్‌ అరెస్ట్‌


నష్టాల్లో ఉన్న నిస్సాన్ సంస్థకు పునర్జీవనం కల్పించిన సంస్థ సీఈఓ కం చైర్మన్ కార్లోస్ ఘోష్ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న వార్తలతో యావత్ ఆటోమొబైల్ పరిశ్రమ నివ్వెరపోయింది. వివిధ దేశాల్లో పని చేసిన కార్లోస్ ఘోష్ ప్రస్తుతం నిస్సాన్, రెనో, మితుబిషి సంస్థల కూటమికి అధిపతిగా ఉన్నారు. దీంతో ఈ కూటమి భవితవ్యం ప్రశ్నార్థకం అవుతుందా? నిలదొక్కుకుంటుందా? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.  

Nissan boss Carlos Ghosn's arrest in Japan shocks auto industry
Author
Tokyo, First Published Nov 20, 2018, 10:22 AM IST

టోక్యో: ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై వాహన దిగ్గజం నిస్సాన్‌ ఛైర్మన్‌ కార్లోస్‌ ఘోన్‌ (64) అరెస్ట్‌ అయ్యారు. కంపెనీ సొమ్మును వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకున్నారన్న ఆరోపణలపై కొన్ని నెలలుగా విచారణ జరుగుతోంది. తాజాగా ఆయన్ను ప్రశ్నించిన జపాన్‌ ప్రాసిక్యూటర్లు.. తర్వాత అదుపులోకి తీసుకున్నట్లు జపాన్‌ అధికారిక మీడియా ఎన్‌హెచ్‌కే, ఇతర సంస్థలు తెలిపాయి. 

కార్లోస్ ఉద్వాసనకు సిద్ధమైన నిస్సాన్
దీంతో కార్లోస్‌ను పదవి నుంచి తప్పించడానికి నిస్సాన్‌ సిద్ధమైంది. ఆర్థిక అవకతవకలకు పాల్పడటం, ఎక్స్ఛేంజీ చట్టాన్ని దుర్వినియోగం చేశారన్న అనుమానంతో నిస్సాన్‌ ఛైర్మన్‌ కార్లోస్‌ను టోక్యో డిస్ట్రిక్ట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కార్యాలయం అరెస్ట్‌ చేసిందని ఎన్‌హెచ్‌కే తెలిపింది.  కార్లోస్‌ అరెస్ట్‌పై టోక్యో ప్రాసిక్యూటర్‌ కార్యాలయం స్పందించలేదు. 

ఆటోమొబైల్ రంగానికి షాక్
అంతర్జాతీయ ఆటోమొబైల్ పరిశ్రమకు పెద్ద షాక్‌. వాహన దిగ్గజాల్లో ఒకరైన కార్లోస్‌ ఘోన్‌ అరెస్ట్‌ కావడం ఆటోమొబైల్ రంగాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సంక్షోభంలో కూరుకున్న సంస్థలను గాడిలో పెట్టగల దిట్టగా పేరున్న కార్లోస్‌ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న వార్తలు నివ్వెరపరిచాయి. సుదీర్ఘకాలం పాటు ఆటోమొబైల్ సంస్థల ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన వారిలో ఆయన ఒకరు. 

నష్టాల నిస్సాన్‌కు పునర్జీవనం ఇలా..
‘కాస్ట్‌ కిల్లర్‌’గా పిలుచుకునే ఆయన నిలబెట్టిన సంస్థల్లో రెనో, నిస్సాన్‌ తదితరాలు ఉన్నాయి. నష్టాల్లో  కూరుకున్న నిస్సాన్‌కు పునరుజ్జీవం పోసిన కార్లోస్‌.. అనతికాలంలో పేరు ప్రఖ్యాతలు పొందారు. కీర్తి గడించిన చోటే అవకతవకలకు పాల్పడి పరువు పొగొట్టుకున్నారు. ప్రస్తుతం రెనో, నిస్సాన్‌, మిత్సుబిషి భాగస్వామ్యానికి కార్లోస్‌ నేతృత్వం వహిస్తున్నారు. తాజా అరెస్ట్‌తో ఈ భాగస్వామ్యం డోలాయమానంలో పడింది.

అసలేం జరిగిందంటే..
ఛైర్మన్‌ కార్లోస్‌ ఘోన్‌, రిప్రజెంటివ్‌ డైరెక్టర్‌ గ్రెగ్‌ కెల్లీ అవకతవకలకు పాల్పడుతున్నారని కొన్ని నెలల క్రితం నిస్సాన్‌కు అందిన రహస్య సమాచారం మేరకు కంపెనీ విచారణ జరిపింది. ‘కార్లోస్‌, కెల్లీ గత కొన్నేళ్లుగా టోక్యో స్టాక్‌ ఎక్స్ఛేంజీలో పెట్టుబడులు పెట్టారు. వీటిపై భారీగా ప్రతిఫలాలను అందుకున్నారు. ఈ ఆదాయాన్ని వెల్లడించలేదు. 2011 నుంచి అయిదేళ్లలో ఆదాయాన్ని 44 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.310 కోట్లు) తక్కువ చేసి చూపారు. 

ఇలా వ్యక్తిగత దుష్ప్రర్తనపై ఆధారాలు
వ్యక్తిగత దుష్ప్రవర్తనపై ఆధారాలు లభించాయి. కంపెనీ ఆస్తులను వ్యక్తిగత అవసరాలకు వాడారు. ఇందులో కెల్లీ ప్రమేయం సైతం ఉన్నట్లు రుజువైంది’ అని నిస్సాన్‌ తెలిపింది. దర్యాప్తులో వెల్లడైన విషయాలను జపాన్‌ ప్రాసిక్యూటర్లకు అందించినట్లు కంపెనీ వివరించింది. బోర్డు డైరెక్టర్ల సమావేశంలో కార్లోస్‌, కెల్లీలను తొలగించడానికి ప్రతిపాదించనున్నట్లు వెల్లడించింది.  

కార్లోస్ ప్రస్థానం ఇలా..
కార్లోస్‌కు వివిధ దేశాల్లో పనిచేయడం ఎప్పుడూ కష్టంగా మారలేదు. బ్రెజిల్‌లో స్థిరపడ్డ లెబనాన్‌ తల్లిదండ్రులకు ఆయన జన్మించారు. అయిదేళ్ల వయసులోనే హారన్‌ ధ్వని బట్టి కారు మోడల్‌ పేరు చెప్పేవారంట. ఆరేళ్ల వయసులో లెబనాన్‌కు వెళ్లిన కార్లోస్‌ అక్కడే ప్రాథమిక విద్య అభ్యసించారు. తర్వాత పారిస్‌లో ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. టైర్ల తయారీ సంస్థ మిష్లిన్‌లో కార్లోస్‌ వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. బ్రెజిల్‌లో పని చేసిన కొద్ది రోజుల్లోనే.. కంపెనీ ఉత్తర అమెరికా కార్యకలాపాలు పుంజుకున్నాయి. దీంతో తక్కువ కాలంలో ఉన్నత పదవులను అధిరోహించారు. 

1996లో రెనోలో కార్లోస్ చేరిక
1996లో రెనోలో చేరిన కార్లోస్‌.. సీఈఓ లూయిస్‌ స్విట్జర్‌తో కలిసి కంపెనీ లాభాల్లోకి అడుగుపెట్టేందుకు దోహదపడ్డారు. మూడేళ్ల లోపే కొత్తగా కొనుగోలు చేసిన నిస్సాన్‌ గ్రూప్‌ బాధ్యతలు చేపట్టారు. రెండేళ్లలో లాభాలు తీసుకురావాలన్న లక్ష్యాన్ని ఆయన ఏడాదిలోనే పూర్తి చేశారు. ఫలితంగా వాహన పరిశ్రమలో కార్లోస్‌ పేరు మార్మోగింది. జపాన్‌లో ఆయన హీరోగా మారారు. ఫోక్స్‌వ్యాగన్‌, టయోటా సంస్థలకు సవాల్‌ విసిరే స్థాయికి ఈ సంస్థలను తీసుకెళ్లారు. 

నాయకుడికి స్వేచ్ఛ ఉండాలన్న కార్లోస్
‘నాయకుడికి 100 శాతం స్వేచ్ఛ ఉండాలి. ఇదే సమయంలో తీసుకున్న నిర్ణయాలకు 100 శాతం బాధ్యత వహించాలి. ఈ నియమాన్ని నేను ఎప్పుడు విస్మరించలేదు. ఎవరూ జోక్యాన్ని నేను సహించలేను’ అని కార్లోస్‌ ఒకసారి పేర్కొన్నారు. రెనో, నిస్సాన్‌లు ఆర్థికంగా పుంజుకున్నాక మరింత దూకుడుగా వ్యవహరించారు. పరిశ్రమలోనే తొలిసారిగా విద్యుత్‌ వాహనాల అభివృద్ధికి పిలుపునిచ్చారు.

దిగ్గజ కూటమి భవితవ్యంపై నీలినీడలు..
గతేడాది రెనో, నిస్సాన్‌, మిత్సుబిషి కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద వాహన భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. దీనికి కార్లోస్‌ అధిపతిగా ఉన్నారు. 4,70,000 మంది ఉద్యోగులు ఉన్న ఈ వాహన త్రయం.. గతేడాది 1.06 కోట్ల వాహనాలను విక్రయించింది. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 122 ఫ్యాక్టరీలు ఉన్నాయి. కార్లోస్‌ను జపాన్‌ పోలీసులు అరెస్ట్‌ చేయడంతో ఈ గ్రూప్‌ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

కార్లోస్‌కు వివాదాలు మామూలే..
జపాన్‌, ఫ్రాన్స్‌ దేశాల్లో అత్యధిక వేతనాన్ని అందుకుంటున్న ఎగ్జిక్యూటివ్‌లో ఒకరైన కార్లోస్‌కు వివాదాలు కొత్తేమీ కాదు. ప్రస్తుతం ఆయన రెనో-నిస్సాన్‌-మిత్సుబిషి ఛైర్మన్‌గా, రెనో సీఈఓగా, నిస్సాన్‌, మిత్సుబిషి ఛైర్మన్‌గా వివిధ వేతనాలు అందుకుంటున్నారు. రెనోలో 20 శాతం ఉన్న ఫ్రాన్స్‌ ప్రభుత్వం కార్లోస్‌ వేతనంపై పలుమార్లు అభ్యంతరాలు తెలిపింది. 

వేతనంపై ఫ్రాన్స్ హెచ్చరికలతో ఇలా దారికి..
గతేడాది ఆయన వేతనంగా 14.8 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.105 కోట్లు) అందుకున్నారు. 2016లో ఆయన వేతన ప్యాకేజీకి వ్యతిరేకంగా వార్షిక కంపెనీ సమావేశంలో ఫ్రాన్స్‌ ప్రభుత్వం ఓటువేసింది. అయితే రెనో బోర్డు దీన్ని తిరస్కరించింది. ఆ తర్వాత కొత్త వేతన చట్టాన్ని తీసుకువస్తామని ఫ్రాన్స్‌ ప్రభుత్వం హెచ్చరించడంతో కార్లోస్‌ వేతన కోతకు అంగీకరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios