Asianet News TeluguAsianet News Telugu

రూపీ పతనం ఎఫెక్ట్: నాలుగేళ్లలో ఫస్ట్ టైం తగ్గిన మారుతి లాభాలు

రూపాయి మారకం విలువ ప్రభావం వివిధ కార్పొరేట్ సంస్థలన్నింటిపైనా పడింది. దానికి ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి ఇండియా కూడా మినహాయింపు కాలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో 10 శాతం లాభాలు తగ్గాయని సంస్థ చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు.

Maruti Suzuki Q2 profit falls 10% YoY to Rs 2,240 crore, still beats Street estimates
Author
Mumbai, First Published Oct 26, 2018, 9:03 AM IST

అన్ని రంగాల మాదిరిగానే ఆటోమొబైల్ రంగానికి.. అందునా ఆ రంగంలో మొదటి స్థానంలో కొనసాగుతున్న కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్‌ఐ)కు రూపాయి సెగ తాకింది. అమెరికా డాలర్‌పై రూపాయి విలువ తగ్గడం, అధిక కమొడిటీ ధరలు ఆజ్యం పోయడంతో నాలుగేళ్లలో మారుతి సుజుకి లాభాలు తొలిసారి క్షీణించాయి.

ప్రచార వ్యయాలకు భారీగా వెచ్చించడమూ ప్రతికూల ప్రభావం చూపిందని తెలిపింది. గతనెలతో ముగిసిన త్రైమాసికంలో ఈ వాహన తయారీ దిగ్గజం మారుతి సుజుకి లాభం 9.8 శాతం తగ్గి రూ.2,240.40 కోట్లకు పరిమితమైంది. 2017-18 ఇదే త్రైమాసిక నికర లాభం రూ.2,484.30 కోట్లుగా నమోదవ్వడం గమనార్హం.

2013-14 నాలుగో త్రైమాసికం తర్వాత, ఒక త్రైమాసికంలో కంపెనీకి లాభం తగ్గడం ఇదే తొలిసారి. మరోవైపు నికర అమ్మకాలు కూడా రూ.21,438.10 కోట్ల నుంచి స్వల్పంగా పెరిగి రూ.21,551.90 కోట్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో మారుతి సుజుకి మొత్తం 4,84,848 వాహనాలను విక్రయించింది. గతేడాదితో పోలిస్తే కార్ల విక్రయాలు 1.5 శాతం తగ్గాయి.

‘ముడి చమురు ధరలు పెరగడం తీవ్ర ప్రభావాన్ని చూపింది. వాహన కొనుగోలు సమయంలో మూడేళ్లకు ఒకే సారి బీమా ప్రీమియం చెల్లించాల్సి రావడం కూడా కొనుగోలుదారు సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది’ అని మారుతి సుజుకి ఇండియా ఛైర్మన్‌ ఆర్సీ భార్గవ తెలిపారు.

డీజిల్‌ వాహనాల విషయమై వివిధ రకాల తీర్పులు, న్యూఢిల్లీతోపాటు దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌)లో డీజిల్‌ వాహనాలను నడిపే విషయంపై అనిశ్చితి కొనసాగడంతో తమ అమ్మకాలపై ప్రభావం పడి లాభం తగ్గేందుకు కారణమయ్యాయని అన్నారు. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అమ్మకాల్లో 10 శాతం వృద్ధి లక్ష్యాన్ని సాధిస్తామని మారుతి సుజుకి ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ ఆశాభావం వ్యక్తంచేశారు. ఇందుకు అన్ని రకాలుగా కృషి చేస్తామని వెల్లడించారు.

ప్రస్తుత పండగ సీజన్ కూడా అమ్మకాలు పెంచడంలో విఫలమైందని, గతంతో పోలిస్తే పెద్దగా మార్పు రాలేదని అన్నారు. ఈ పండగ సీజన్‌లో దాదాపు 10-15 శాతం అమ్మకాలు పెరుగుతాయని భావించామని చెప్పారు. అలాంటి పరిస్థితేదీ ప్రస్తుతం కనిపించడం లేదని అన్నారు. 

కేంద్ర ప్రభుత్వం సీఎన్‌జీ కార్లకు ఇస్తున్న అధిక ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ తరహా కార్ల తయారీని వేగవంతం చేశామని మారుతి సుజుకి ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. దేశంలో మరో 10,000 సీఎన్‌జీ ఔట్‌లెట్లను ప్రారంభించే యోచనలో కంపెనీ ఉందని అన్నారు. 

‘ప్రస్తుతం సీఎన్‌జీ ఇంజిను ఎంపికకు వీలున్న 8 కార్లను విక్రయిస్తున్నాం. గత ఏడాది ఈ కార్ల అమ్మకాల్లో 50 శాతం వృద్ధి ఉంది. వినియోగదార్ల నుంచి సీఎన్‌జీ వాహనాలకు ఆదరణ పెరుగుతోందనే విషయాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి’ అని మారుతి సుజుకి ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ అన్నారు.

2020 ఏప్రిల్‌ 1 తర్వాత బీఎస్‌-6 వాహనాలు విక్రయించకూడదంటూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా నిర్దిష్ట గడువు లోపే బీఎస్‌-4 మోడల్ వాహనాలన్నీ వదిలించుకుంటామని అన్నారు. 

రూపాయి క్షీణత వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో కంపెనీ మార్జిన్లపై 125 బేసిస్‌ పాయింట్ల మేర ప్రభావం పడిందని మారుతి సుజుకి ముఖ్య ఆర్థిక అధికారి అజయ్‌ సేథ్‌ వెల్లడించారు. అసలైన నొప్పి రెండో అర్థభాగంలో తెలుస్తుందని తెలిపారు.

ఎంఎస్‌ఐ మార్కెటింగ్‌, విక్రయాల విభాగం సీనియర్‌ డైరెక్టర్ ఆర్‌ఎస్‌ కల్సి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలు మెరుగ్గానే ఉన్నా, పట్టణ ప్రాంతాల్లోనే తగ్గుముఖం పట్టాయని చెప్పారు. ప్రస్తుతం అమ్మకాలకు గల ప్రతికూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కొనుగోలుదార్లను ఆకర్షించేందుకు మారుతి సుజుకి పలు రాయితీలు ప్రకటించింది.

ఒక్కో మోడల్‌పై రూ.3000 వరకు తగ్గింపు ఇస్తోంది. ఇది కూడా కంపెనీ లాభంపై ప్రభావం చూపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలోనూ మారుతీ సుజుకీ ప్రదర్శన స్తబ్దంగానే సాగింది. ఏడాది క్రితం ఇదే సమయంతో  పోలిస్తే నికర లాభం 4.3 శాతం పెరిగి రూ.4,215.70 కోట్లు నమోదైంది.

గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో లాభం రూ.4,040.70 కోట్లుగా ఉంది. ఆదాయం 12.4 శాతం అధికమై రూ.43,362.60 కోట్లకు  చేరింది. ఇక మొత్తం 10 శాతం వృద్ధితో 9,75,327 వాహనాలు అమ్ముడయ్యాయి. కాగా, గురువారం బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో మారుతి సుజుకి షేర్ 0.65% నష్టంతో రూ.6724.70 వద్ద ముగిసింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios