Asianet News TeluguAsianet News Telugu

నాలుగు కార్లకు పోటీ: ఎస్‌యూవీ మార్కెట్లోకి మహీంద్రా అల్టూరస్‌


మహీంద్రా అండ్ మహీంద్రా ఎస్ యూవీ మోడల్ కార్లలోకి కూడా అడుగు పెట్టేసింది. టయోటా, ఫోర్డ్, హోండా, ఇసుజు సంస్థలకు పోటీగా అల్టూరస్ జీ4 మోడల్‌తో అత్యుత్తమమైన, ఆకర్షణీయమైన కారును మార్కెట్లోకి ప్రవేశ పెట్టింది. 

Mahindra Alturas G4 Launched in India for Rs 26.95 Lakh, 4x4 Priced at Rs 29.95 Lakh
Author
New Delhi, First Published Nov 26, 2018, 10:32 AM IST

న్యూఢిల్లీ: దేశీయ కార్ల తయారీ దిగ్గజం మహీంద్రా విలాసవంతమైన ఎంయూవీల విభాగంలోకి అడుగుపెట్టింది. మహీంద్రా ‘అల్టూరస్‌ జీ4’ ఎస్‌యూవీ మోడల్ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూమ్‌ ప్రారంభ ధర రూ.26.95 లక్షల నుంచి రూ.29.95 లక్షలుగా నిర్ణయించారు. అల్టూరస్‌ 2డబ్ల్యూడీ, అల్టూరస్‌ జీ4 4డబ్ల్యూడి అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనున్నది. మహీంద్రా ఇప్పటి వరకు విక్రయిస్తున్న మోడళ్లలో ఇదే అత్యంత ఖరీదైన మోడల్‌. ఈ మోడల్ కారు ఫోర్డ్‌ ఎన్డీవర్‌, టయోటా ఫార్చ్యూనర్‌, ఇసుజు ఎంయు-ఎక్స్‌, హోండా సీఆర్‌వీలకు పోటీగా దీనిని తయారు చేసింది. 

మహీంద్రా అల్టూరస్‌ను కేవలం డీజిల్‌ ఇంజిన్‌తోనే విడుదల చేసింది. 2017లో శ్సాంగ్ యాంగ్ రెగ్జ్‌టోన్ జీ4 మోడల్ కారు ఆధారంగా మహీంద్రా అల్టూరస్ కారును తీర్చిదిద్దారు. 2018 ఆటో ఎక్స్ పోలో తొలుత దీన్ని ప్రదర్శించారు. ఐదు రంగులు నాపోలీ బ్లాక్, పెర్ల్ వైట్, డ్సాట్ సిల్వర్, రీగల్ బ్లూ, లేక్ సైడ్ బ్రౌన్ రంగుల్లో మహీంద్రా అల్టూరస్ మార్కెట్లోకి రానున్నది. 

ఈ కారులో హెచ్‌ఐడి హెడ్‌ల్యాంప్స్‌లోనే పగటి పూట వెలిగే ఎల్‌ఈడీ లైట్లను అమర్చిన మహీంద్రా.. దీనికోసం 18 అంగుళాల అల్లాయ్‌ చక్రాలను రూపొందించింది.  సిగ్నల్‌ లైట్లు అమర్చిన వోఆర్‌వీఎంతోపాటు రూఫ్‌ మీద ఎల్‌ఈడీ లైట్లు అమర్చిన స్పాయిలర్‌ ప్లస్ రెండు రంగుల్లో ఉన్న నప్పా లెదర్‌ ఇంటీరియర్‌ అదనపు ఆకర్షణ కానున్నాయి. క్యాబిన్‌లో ఎల్‌ఈడీ లైట్లతోపాటు యాంటీ పించ్‌ ఫంక్షన్‌తో సన్‌రూఫ్‌ తోపాటు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు అమర్చారు. 

ఇక డ్రైవర్ తనకు అనువుగా ఎనిమిది రకాలుగా మార్చుకునేందుకు వీలుగా డ్రైవర్‌ సీటు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేకులు, వర్షం పడితే వాటంతట అవే పని చేసే వైపర్లు,  3జోన్‌ క్లైమెట్‌ కంట్రోల్‌, 8అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ వసతులు అందుబాటులో ఉన్నాయి. ఇంకా రియర్‌ పార్కింగ్‌కు అవసరమైన 3డీ రియర్‌ కెమెరా, 9ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్‌, ఈబీడీ, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిలీ ప్రోగ్రాం అందుబాటులో ఉన్నాయి. 

మెర్సిడెస్ బెంజ్ కారులో మాదిరిగా మహీంద్రా ఆల్టూరస్ జీ4లో 133.1. కిలోవాట్ల విద్యుత్, 420 ఎన్ ఎం టార్చ్ సామర్థ్యం ప్లస్ 2.2 లీటర్లతో కూడిన 4 - సిలిండర్ ఇంజిన్,  7- స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ కలిగి ఉన్నాయి. ఇక ప్రయాణ భద్రత కోసం ఆల్టూరస్ జీ4లో తొమ్మిది ఎయిర్ బ్యాగ్‌లు అమర్చారు.  దీంతోపాటు ఎలక్ట్రానిక్ స్టేబిలిటీ ప్రోగ్రాం (ఈఎస్పీ), హిల్ స్టార్ట్ అసిస్ట్ (హెచ్ఎస్ఎ), యాక్టివ్ రోలోవర్ ప్రొటెక్షన్ (ఎఆర్పీ), ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (టీసీఎస్), హిల్ డిస్కెంట్ కంట్రోల్ వసతులు కూడా ఉన్నాయి. 

మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా మాట్లాడుతూ ఆటోమోటివ్ రంగంలో మహీంద్రా నూతన తరం బ్రాండ్‌తో మార్కెట్లోకి అడుగు పెట్టిందన్నారు.  ఆల్టూరస్ జీ4 మోడల్ కారును ఆవిష్కరించడంతో ప్రజల ఆకాంక్షలకు చేరువ కావాలని నిర్ణయించుకున్నదని చెప్పారు. మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ సెక్టార్ అధ్యక్షుడు రాజన్ వధేరా మాట్లాడుతూ డిజైన్, ఇంటీరియర్స్, సేఫ్టీ, ధర విషయంలో మహీంద్రా అల్టూరస్ జీ 4 మోడల్ కారు అత్యుత్తమైందన్నారు. 3డీ ఎరౌండ్ వ్యూ కెమెరా సిస్టమ్, ఈజీ యాక్సెస్ మోడ్, వెంటిలేటెడ్ సీట్లతోపాటు ఇలా ఆకర్షణీయమైన ధరకు ఏ మోడల్ కారు లభించబోదన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios