Asianet News TeluguAsianet News Telugu

ఆఫర్లు, డిస్కౌంట్లతో లాభం లేదు... ఆటోమొబైల్ రంగాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి: సియామ్

ఐదు నెలలుగా వాహనాల విక్రయాలు తగ్గుముఖం పట్టడంతో ఆందోళన చెందుతున్న ఆటోమొబైల్ రంగం తమకు పన్ను రాయితీలు కల్పించాలని కేంద్రాన్ని అభ్యర్థిస్తోంది. వాణిజ్య వాహనాలపై దిగుమతి సుంకం పెంచి.. సాదారణ ప్రజలు కొనుగోలు చేసే ద్విచక్ర వాహనాలు, కార్లపై తగ్గించాలని సియామ్ అభ్యర్థించింది. కాలుష్య నియంత్రణ వాహనాల తయారీకి రీసెర్చ్, డెవలప్మెంట్‌పై నిధులను కేటాయిస్తున్నందున మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు కేటాయించాలని కోరుతోంది.

Increase customs duty for commercial vehicle CBUs, says SIAM
Author
New Delhi, First Published Jan 26, 2019, 8:27 AM IST

న్యూఢిల్లీ: అసలే ఐదు నెలలుగా వాహనాల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. వాహనాల అమ్మకాల్లో అంతంత మాత్రమే వృద్ధి నమోదవుతుండటంతో ప్రభుత్వ ప్రోత్సాహం కోసం ఆటోమొబైల్ పరిశ్రమ వేచి చూస్తోంది. రకరకాల ఆఫర్లు, డిస్కౌంట్లు ఇచ్చినా అధిక వడ్డీరేట్లు, నగదు కొరత, పన్నుల మోత, బీమా వ్యయాలతో వాహనాల అమ్మకాలు నిరాశాజనకంగా సాగుతున్నాయని పరిశ్రమవర్గాలు అంటున్నాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-డిసెంబర్ మధ్య ఆటోమొబైల్‌ పరిశ్రమ కేవలం 4.37 శాతం వృద్ధితోనే సరిపెట్టుకుంది. పది నెలల్లో కంపెనీలు 25,33,321 కార్లను విక్రయించాయి. ఈ నేపథ్యంలో దిగుమతి చేసుకునే ఫుల్లీ బిల్ట్‌ కమర్షియల్‌ వెహికిల్స్‌పై కస్టమ్స్‌ సుంకాన్ని వచ్చే బడ్జెట్‌లో ప్రస్తుత 25 శాతం నుంచి 40 శాతానికి పెంచాలని భారత ఆటోమొబైల్‌ తయారీదారుల సంఘం (సియామ్‌) కోరింది. 

కార్లు, టూవీలర్ల విషయమై కంప్లీట్లీ బిల్ట్‌ యూనిట్‌ (సీబీయూ)పై కస్టమ్స్‌ సుంకాన్ని మార్చవచ్చని సియామ్‌ సూచించింది.  ప్రస్తుతం టూవీలర్లు, కార్లపై కస్టమ్స్‌ సుంకం 50 శాతం నుంచి 100 శాతం వరకు ఉంది. కాగా 40 శాతం రేటును కంప్లీట్లీ నాక్డ్‌ డౌన్‌ యూనిట్లు (సీకేడీ), సెమీ నాక్డ్‌ డౌన్‌ (ఎస్‌కేడీ) యూనిట్లకు వర్తింపజేయాలని సియామ్‌ డిప్యూటీ జనరల్‌ సుగతో సేన్‌ తెలిపారు.

ప్రస్తుతం వాహనాన్ని బట్టి సీకేడీ యూనిట్లపై దిగుమతి సుంకం 15 శాతం నుంచి 30 శాతం వరకుంది. పరిశోధనా, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ) వ్యయాలపై 200 శాతం వెయిటెడ్‌ డిడక్షన్‌ నుంచి మళ్లీ తేవాలని ప్రభుత్వాన్ని సియామ్‌ అభ్యర్థించింది. త్వరలో నూతన ఉద్గార, భద్రతా ప్రమాణాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో తగిన విధంగా ఆటోమొబైల్‌ పరిశ్రమ ఆర్‌ అండ్‌ డీపై పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని సియామ్ పేర్కొంది. 
 
పర్యావరణ అనుకూల విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఇది అనుకున్నంత సులభంకాదు. ఎలక్ర్టిక్‌ వాహనాల్లో వినియోగించే లిథియం ఆయాన్‌ బ్యాటరీల ధర అధికంగా ఉంటోంది. ప్రస్తుతం దేశంలో చార్జింగ్‌ స్టేషన్ల సంఖ్య కూడా అంతంత మాత్రమే. 

ఈ నేపథ్యంలో బ్యాటరీ, లిథియం దిగుమతులపై సబ్సిడీ ఇవ్వాలని ఆటోమొబైల్ పరిశ్రమ ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ వ్యాపారాన్ని ప్రారంభించే కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇచ్చి ప్రభుత్వం దన్నుగా నిలవాలని కోరుతోంది. చార్జింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, స్మార్ట్‌ మొబిలిటీ గ్రిడ్‌కు ప్రభుత్వం నుంచి అదనపు నిధులు కేటాయించాలని ఆటోమొబైల్ రంగ ప్రముఖులు కోరుతున్నారు. 

ఆటోమొబైల్ పరిశ్రమ 2020 ఏప్రిల్‌ నాటికి దేశీయ కార్ల పరిశ్రమ భారత్‌ స్టేజ్‌-6 నిబంధనలను పాటించాల్సిందే. దీని వల్ల వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలు కాస్త తగ్గుముఖం పడతాయి. 2030నాటికి మొత్తం ఎలక్ర్టిక్‌ వాహనాలే ఉండాలన్న లక్ష్యం ఆటోమొబైల్ పరిశ్రమ ముందు ఉంది. ఈ దిశగా సాగేందుకు తగిన పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ) కార్యకలాపాలు చేపట్టేందుకు ప్రభుత్వం పరిశ్రమను ప్రోత్సహించనుందని చెబుతున్నారు.
 
డాలర్‌ మారకంలో రూపాయి విలువ క్షీణించడంతో దాని ప్రభావం ఆటోమొబైల్‌ పరిశ్రమపై పడుతోంది. ఇప్పటికే ముడిసరుకుల వ్యయం పెరగడంతో ఆయా సంస్థలు కార్ల ధరలను పెంచాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఆటోమొబైల్‌ పరిశ్రమకు అవసరమైన అల్యూమినియం, ఉక్కు దిగుమతులపై సుంకాలను తగ్గించాలని ఆటోమొబైల్ సంస్థల యాజమాన్యాలు కోరుతున్నాయి. 

అన్ని ఆటోమోటివ్‌ కాంపొనెంట్స్‌పై 18 శాతం జీఎస్‌టీని అమలు చేయాలని ఆటోమోటివ్‌ కాంపోనెంట్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ (ఏసీఎంఏ) ప్రభుత్వాన్ని కోరుతోంది. చాలా దేశాలతో పోల్చితే భారత్‌లో ఆటోమొబైల్స్‌పై పన్ను అధికంగా ఉందని, దీన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని మారుతి సుజుకి ఇండియా ఎండీ కం సీఈఓ కెనిచి అయుకవా పేర్కొన్నారు. అప్పుడే డిమాండ్‌ వృద్ధికి, పరిశ్రమ అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందన్నారు. ప్రస్తుతం ఆటోమొబైల్స్‌పై గరిష్ఠంగా 28 శాతం జీఎస్టీ అమలులో ఉందన్నదని గుర్తు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios