Asianet News TeluguAsianet News Telugu

టాప్‌గేర్‌లో హోండా అండ్ యమహా స్కూటర్లు


హోండా, హీరో విడిపోయి ఎనిమిదేళ్లవుతున్నా భారత మార్కెట్లో హోండా బైక్ లు, స్కూటర్లదే ప్రత్యేకించి హోండా యాక్టీవాదే పై చేయిగా ఉన్నది. మరోవైపు హోండా సేల్స్ నాలుగు కోట్లకు దాటిపోవడంలో యాక్టీవా హోండా సేల్సే రికార్డు. దేశీయ ఆటోమొబైల్ సంస్థలు బైక్ లపైనే కేంద్రీకరించడం కూడా జపాన్ అనుబంధ సంస్థల స్కూటర్లకు క్రేజ్ పెరగడానికి మరో కారణం. 

Eight years after split Honda leads India race while Hero lags
Author
New Delhi, First Published Dec 27, 2018, 10:52 AM IST

భారతదేశంలోని జపాన్ సంస్థల అనుబంధ మోటార్ బైక్ కంపెనీలు దేశీయ రోడ్లపై దూసుకెళుతున్నాయి. ఆ కంపెనీల స్కూటర్లు దేశీయ కంపెనీలను తోసిరాజని మార్కెట్‌ వాటాను చేజిక్కించుకుంటున్నాయి. జపాన్‌కు చెందిన హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్ఎంఎస్ఐ), సుజుకి మోటార్‌సైకిల్‌ ఇండియా (ఎస్ఎంఎస్ఐ), ఇండియా యమహా మోటార్‌ (ఐవైఎం) కలిసి నవంబర్ నెలలో 67 శాతం మార్కెట్‌ వాటాను కైవసం చేసుకోవడం ఆసక్తికర పరిణామం. 
 
2011లో హీరో మోటో కార్ప్స్ నుంచి విడిపోయింది హోండా మోటార్స్. కేవలం ఏడేళ్లలోనే ఒకేచోట నుంచి 16 లక్షల యూనిట్లు, నాలుగు యూనిట్లలో 64 లక్షల యూనిట్ల ఉత్పత్తి సాధించింది. హోండా మోటార్స్ సేల్స్ నాలుగు కోట్లకు చేరుకోవడంలో యాక్టీవా హోండా కీలక పాత్ర పోషించనున్నది. 

హోండా యాక్టీవా మార్కెట్లోకి వచ్చిన 11 ఏళ్లలో కోటి యూనిట్లు విక్రయించగా, మరో మూడేళ్లలో మరో కోటి జత విక్రయాలు జత కలిశాయి. 14 ఏళ్ల యాక్టీవా హోండా కెరీర్‌లో రెండు కోట్ల మంది వినియోగదారులు చేరారు. 

2001 - 11 మధ్య కాలంలో హోండా మోటార్స్ సంస్థను ద్విచక్ర వాహనాల విభాగంలో మొదటి స్థానంలో నిలుపడంలో హోండా యాక్టీవాదే కీలక భూమిక. తర్వాతీ కాలంలో హోండా మోటార్స్.. 150సీసీ సామర్థ్యం గల సీబీ యూనికార్న్, 125 సీసీ సామర్థ్యంతో కూడిన సీబీ షైన్ మోడల్ మోటారు సైకిలును మార్కెట్లోకి విడుదల చేసింది. 2009లో సీబీఎస్ సిస్టంతో ఈక్వలైజర్ బైక్ విడుదల చేసిన హోండా 2019లో బైక్‌ల తయారీలో టెక్నాలజీ ప్రధాన పాత్ర పోషించనున్నది. 

నవంబర్ నెలలో 5,21,542 స్కూటర్లు విక్రయం కాగా.. అందులో 50 శాతానికి పైగా అంటే 2,66,350 వాహనాలు హోండావేనని వార్తా సంస్థ కోజెన్సిస్‌ పేర్కొంది. ఇక యమహా బైక్స్ 29,395, సుజుకీ 49,294 చొప్పున స్కూటర్లను అమ్మాయి. తద్వారా సుజుకీ 9%, యమహా 5% చొప్పున మార్కెట్‌ వాటాను పొందాయి. 2001లో భారత స్కూటర్‌ మార్కెట్లోకి అడుగుపెట్టిన హోండా తన ప్రతిష్ఠాత్మక బ్రాండ్‌ యాక్టివా కింద 2 కోట్ల వాహనాలను విక్రయించింది. డియో, ఏవియేటర్‌, క్లిక్‌, గ్రేజియా వంటి ఇతర స్కూటర్‌ మోడళ్లనూ అది భారత దేశ మార్కెట్లో విక్రయిస్తూ అగ్రపథాన దూసుకెళుతోంది. 

జపాన్‌ కంపెనీలు స్కూటర్ల విక్రయాల్లో ముందుకు వెళ్లడానికి కారణం అవి ప్రవేశపెట్టిన కొత్త మోడళ్లు, ఆకర్షణీయమైన ధరలతోపాటు భారత కంపెనీలు చాలా కాలంగా మోటార్‌ సైకిళ్లపైనే దృష్టి పెట్టడమే. ఇదే విదేశీ కంపెనీలకు వరంగా మారింది. ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్‌ చాలా ఏళ్లుగా స్కూటర్లపై దృష్టి సారించకపోవడంతో జపాన్‌ కంపెనీలు రోడ్లపైకి తమ స్కూటర్లను వెల్లువెత్తించడానికి వీలు కలిగిందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. నవంబర్ నెలలో టీవీఎస్‌ మోటార్‌ 1,05,576; హీరో మోటోకార్ప్‌ 64,852 చొప్పున స్కూటర్లను విక్రయించి వరుసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచాయి. 

అన్ని వాహన తయారీ కంపెనీలు పండుగల సీజను కోసం ఎదురుచూస్తుంటాయి. కానీ ఈ సారి నవంబర్ నెలలో అంతక్రితం ఏడాది నవంబర్ నెలతో పోలిస్తే అన్ని కంపెనీలూ విక్రయాల్లో క్షీణతను నమోదు చేశాయి. 19 శాతం మేర విక్రయాలు తగ్గాయి. హోండా అమ్మకాలు కూడా నవంబర్ నెలలో 17% మేర తగ్గగా.. టీవీఎస్‌ 28%, హీరో మోటోకార్ప్‌ 12% చొప్పున విక్రయాల్లో క్షీణతను చవిచూశాయి. పండుగల సీజన్‌లో కొనుగోళ్లు లేకపోవడంతో పాటు, అన్ని వాహనాలకు బహుళ సంవత్సరాల తప్పనిసరి బీమా కవరేజీ, ఎన్‌బీఎఫ్‌సీల్లో ద్రవ్యలభ్యత సంక్షోభం కూడా విక్రయాలు తగ్గడానికి కారణమయ్యాయి.

ఈ ఏడాది ఏప్రిల్ - నవంబర్ మధ్య మొత్తం మోటారు సైకిళ్లు 49,18,027 వాహనాలు విక్రయిస్తే హోండా మోటార్ సైకిల్స్ సేల్స్ 25.71 లక్షలుగా నమోదయ్యాయి. ఇది గతేడాది కంటే లక్ష ఎక్కువ. మొత్తంగా ద్విచక్ర వాహనాల్లో హోండా మోటార్స్ ది 51 శాతంగా నమోదైతే, యమహా మోటార్స్ వాటా కేవలం ఆరు శాతం మాత్రమే. దేశీయ హీరో మోటార్స్ కేవలం 12 శాతానికి మాత్రమే పరిమితం. గమ్మత్తేమిటంటే టీవీఎస్ మోటార్స్ 20 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు టీవీఎస్ మోటార్స్ బైక్‌లు 8.96 లక్షలు అమ్ముడు పోతే, హీరో మోటార్స్ మోటారు సైకిళ్లు కేవలం 5.29 లక్షలు అమ్ముడయ్యాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios