Asianet News TeluguAsianet News Telugu

బజాజ్‌ నుండి ఎలక్ట్రిక్ వాహనాలు: రాజీవ్ బజాజ్ ప్రకటన

దేశీయ ఆటోమొబైల్ మేజర్ ‘బజాజ్ ఆటో’ వచ్చే ఏడాది ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి అడుగు పెట్టనున్నది. బీఎస్ -6 నిబంధనల అమలుతోపాటు ఎలక్ట్రిక్ క్యూట్, ఆటోలు తమ ఎజెండాలో ముందు ఉన్నాయని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ తెలిపారు. త్వరలో విద్యుత్ వినియోగ స్కూటర్‌ను కూడా మార్కెట్లో అందుబాటులోకి తెస్తామన్నారు. 

Bajaj Auto set for foray into electric vehicles next year
Author
Mumbai, First Published Jan 22, 2019, 10:50 AM IST

న్యూఢిల్లీ: ఎప్పుడెపుడా అని ఎదురుచూస్తున్న వేళ వచ్చే ఏడాదే ఎలక్ట్రిక్‌ వాహనాల్లోకి ప్రవేశించనున్నట్టు బజాజ్‌ ఆటో ఎండీ రాజీవ్‌ బజాజ్‌ ప్రకటించారు. బీఎస్‌–6 కాలుష్య విడుదల నిబంధనలకు అనుగుణంగా తమ వాహనాల ఇంజన్లను మార్చడంతోపాటు ఎలక్ట్రిక్‌ వాహనాల్లోకి ప్రవేశం కూడా వచ్చే ఏడాది ఉంటుందన్నారు.

‘ఎలక్ట్రిక్‌ క్యూట్, ఎలక్ట్రిక్‌ త్రిచక్ర వాహనాలు (ఆటోలు) తమ ఎజెండాలో ముందు ఉన్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి అమల్లోకి రానున్న బీఎస్‌–6 ప్రమాణాలకు అనుగుణంగా మా పెట్రోల్, డీజిల్‌ ఇంజన్లను రూపొందించనున్నాం’అని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్‌ బజాజ్ తెలిపారు.

కేటీఎంకు చెందిన హస్క్‌వర్క్స్ మోటార్ సైకిల్‌ బ్రాండ్‌ను భారత మార్కెట్లోకి ఈ ఏడాదే తెస్తామని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్‌ బజాజ్‌ తెలిపారు. బజాజ్‌ ఆటో తన నాలుగు చక్రాల క్యూట్‌ (క్వాడ్రిసైకిల్‌)ను ఇప్పటికే 20 దేశాలకు ఎగుమతి చేస్తున్న విషయం గమనార్హం. 

వచ్చే మార్చినెలలో క్వాడ్రి సైకిల్ క్యూట్‌ను ఆవిష్కరిస్తామని బజాజ్‌ ఆటో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ శర్మ తెలిపారు. తుది అనుమతుల ప్రక్రియలో ఉందన్నారు. బజాజ్‌ ఈ స్కూటర్‌‌తోపాటు ఎలక్ట్రిక్‌ క్యూట్, మూడు చక్రాల ఎలక్ట్రిక్‌ వాహనాలు తమ అజెండాలో ముందున్నట్టు బజాజ్ ఆటో ఎండీ రాజీవ్‌ బజాజ్‌ ప్రకటించారు. 

బజాజ్‌ నుంచి ఎలక్ట్రిక్‌ ఈ స్కూటర్‌ కూడా రానుందని ప్రకటించి అందరినీ  బజాజ్ ఆటో ఎండీ రాజీవ్‌ బజాజ్‌ ఆశ్చర్యపరిచారు. ‘బజాజ్‌ నుంచి మీరు ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలను అంచనా వేస్తున్నట్టయితే అది ఈ రోజు సాధ్యపడదు. కానీ, త్వరలోనే ఇది జరగనుంది’అని రాజీవ్‌  చెప్పారు. 

దేశీయ సంస్థ బజాజ్‌ ఆటో 17 ఏళ్ల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా 70 దేశాల్లో సాధించిన పురోగతిపై ‘ద వరల్డ్‌ ఫేవరెట్‌ ఇండియన్‌’ పేరుతో కొత్త ప్రచార కార్యక్రమం చేపట్టింది. బజాజ్ ఆటో ఎండీ రాజీవ్‌ బజాజ్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ద్విచక్రవాహన ఎగుమతుల్లో బజాజ్‌ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు.

బజాజ్ ఆటో సంస్థ ఆదాయంలో 40% విదేశీ మార్కెట్ల నుంచే వస్తున్నట్టు బజాజ్ ఆటో ఎండీ రాజీవ్‌ బజాజ్‌ చెప్పారు. 70 దేశాల్లో 15 మిలియన్ల వాహనాల అమ్మకాలతో కేంద్ర ప్రభుత్వ ఆకాంక్ష అయిన ‘మేకిన్‌ ఇండియా’కు చిరునామాగా బజాజ్‌ నిలిచిందని రాజీవ్‌ వివరించారు. గత పదేళ్లలో సంస్థ 13 బిలియన్‌ డాలర్ల ఆదాయం ఆర్జించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నీతిఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌ కూడా పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios