Asianet News TeluguAsianet News Telugu

ఉసూరుమనిపించిన పండుగలు: డబుల్ డిజిట్స్ తగ్గిన ఆటో సేల్స్

ఆన్ లైన్ విక్రయాలు, ఫ్రీ బుకింగ్‌లు హోరెత్తినా వాహనాల విక్రయాలు ఈ ఏడాది పండుగల సీజన్లో ఉసూరుమనిపించాయి. ప్రయాణ, ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు తగ్గితే, వాణిజ్య వినియోగ విక్రయాలు, త్రీ వీలర్ల విక్రయాలు కొంచెం మెరుగ్గా ఉన్నాయి.

Auto retail sales down 11 per cent in festive period
Author
New Delhi, First Published Nov 24, 2018, 6:17 PM IST

న్యూఢిల్లీ: దేశీయంగా వాహన కంపెనీల రిటైల్‌ అమ్మకాలు ఈ ఏడాది పండుగల సీజన్‌లో 11 శాతం తగ్గాయి. ప్రయాణికుల వాహనాలు, టూవీలర్ల అమ్మకాలు బలహీనంగా ఉండటమే దీనికి కారణమని ఆటోమొబైల్ డీలర్ల సంఘాల సమాఖ్య (ఎఫ్‌ఏడీఏ) తెలిపింది. గత కొన్నేళ్లలో పండుగల సీజన్‌ ఇంత నిస్సారంగా ఉండడం చూడలేదని ఫాడా ప్రెసిడెంట్‌ అశీష్‌ హర్షరాజ్‌ కాలే ఆందోళన వ్యక్తం చేశారు. ఇంధనం ధరలు అధికంగా ఉండటంతోపాటు నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు నిధుల కొరత తీవ్రంగా ఉండటం, బీమా వ్యయాలు పెరగడం, వినియోగదారులు కొనుగోళ్లను వాయిదా వేసుకోవడం వంటి అంశాలు వాహన అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపాయని తెలిపారు.

వాహన విక్రయాలకు ఎన్‌బీఎఫ్‌సీలు కీలకమని, ఎన్‌బీఎఫ్‌సీల లిక్విడిటీ సమస్యలను పరిష్కారమయ్యేలా చూడాలని ఆర్‌బీఐని, కేంద్ర ప్రభుత్వాన్ని ఆటోమొబైల్ డీలర్ల సంఘాల సమాఖ్య (ఎఫ్‌ఏడీఏ) ప్రెసిడెంట్‌ అశీష్‌ హర్షరాజ్‌ కాలే కోరారు. అక్టోబర్ నెలలో నవరాత్రి ఉత్సవాల నుంచి మొదలైన పండుగల సీజన్ మొదలు ధన త్రయోదశి ముగిసే వరకు వాహనాల డెలివరీకి 10 నుంచి 15 రోజులు కూడా పట్టవచ్చు. కానీ వ్యక్తిగత వినియోగ వాహనాల విక్రయాలు తగ్గుముఖం పడితే వాణిజ్య వాహనాల విక్రయాలు 16 శాతం, త్రీ వీలర్స్ 10 శాతం పెరిగాయి.  

రిజిస్ట్రేషన్లే రిటైల్ విక్రయాలకు ప్రాతిపదిక
రిటైల్‌ అమ్మకాలను రిజిస్ట్రేషన్ల ప్రాతిపదికగా గణిస్తారు. టూ వీలర్లు, ప్రయాణికుల వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు తగ్గాయి. దీంతో ఈ సెగ్మెంట్లో అమ్ముడు కాకుండా మిగిలిపోయిన నిల్వలు డీలర్లకు ఆందోళన కలిగిస్తున్నాయి.  గత ఏడాది పండుగల సీజన్‌లో 23,01,986గా మొత్తం  రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. కానీ ఈ ఏడాది పండుగల సీజన్‌లో 20,49,391కు పడిపోయాయి. ఇక ప్రయాణికుల వాహన రిజిస్ట్రేషన్లు 3,33,456 నుంచి 2,87, 717కు తగ్గాయి. టూ వీలర్ల రిజిస్ట్రేషన్లు 18,11,703 నుంచి 13 % తగ్గి 15,83,276కు పడిపోయాయి. 

ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ వాహన రిటైల్‌ అమ్మకాలు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ 1 నుంచి నవంబర్‌ 20 వరకూ 1,12,54,305గా ఉన్న వాహన రిటైల్‌ అమ్మకాలు ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి 7 శాతం పెరిగి 1,19,89,705కు పెరిగాయి. ఈ రెండు విభాగాల్లో డీలర్ల వద్ద నిల్వలు పెరగడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఎఫ్‌ఏడీఏ తెలిపింది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నవంబర్ 20 నాటికి మొత్తమ్మీద ఆటో మోబైల్ అమ్మకాలు 6.5 శాతం పెరిగాయి. 

పండుగ సీజన్ విక్రయాల కోసం డీలర్లు దాదాపు రెండు నెలల ముందు నుంచే తమ వద్ద స్టాక్ నిల్వలు పెంచుకుంటూ వచ్చాయి. కానీ పరిస్థితి తిరగబడటంతో వారు ఆందోళనకు గురవుతున్నారు.  ఈ నెల 20 వరకు జరిగిన రిజిస్ట్రేషన్లలో ఆరు శాతం మాత్రమే పెరుగుదల నమోదైంది. గతేడాదితో పోలిస్తే ప్రయాణ వాహనాల విక్రయం ఒక శాతం తగ్గింది. వచ్చే ఐదు నెలల్లోనైనా పురోగతి సాధించగలమని ఆటొమొబైల్ పరిశ్రమ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios