Asianet News TeluguAsianet News Telugu

బాబాయ్ కి నో టికెట్: ఒంగోలు సీటుపై జగన్ వ్యూహం ఇదీ...

నెల్లూరు జిల్లాకు చెందిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఇప్పటికే ఒంగోలు పార్లమెంట్ నుంచి మూడుసార్లు గెలుపొందారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి ఒకసారి గెలుపొందారు. ఇద్దరిలో ఎవరో ఒకరిని బరిలో దించాలని జగన్ ప్లాన్. అంతేకానీ వైవీ సుబ్బారెడ్డిని మాత్రం బరిలో దించే యోచనలో లేనట్లు తెలుస్తోంది. 

YS Jagan will keep away YV from election contest
Author
Ongole, First Published Mar 4, 2019, 6:32 PM IST

ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది వైసీపీలో వైవీ సుబ్బారెడ్డి వ్యవహారం. ఒంగోలు మాజీఎంపీ వైవీ సుబ్బారెడ్డి రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారా చెయ్యరా అన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వైవీ సుబ్బారెడ్డి 2014 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 

అయితే రాబోయే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. వైవీ సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మాగుంటను వైసీపీలోకి రావాలని పార్టీ ఆహ్వానిస్తోంది. 

గత కొద్ది రోజులుగా ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. మాగుంట శ్రీనివాసుల రెడ్డి సైతం వైసీపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారని ప్రచారం. వైవీ సుబ్బారెడ్డికి ఒంగోలు పార్లమెంట్ లో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని మాగుంట శ్రీనివాసుల రెడ్డికి సానుకూల పవనాలు వీస్తున్నాయని జగన్ కు సర్వే నివేదిక అందింటున్నారు. 

అంతేకాదు మాగుంటకు అవకాశం ఇస్తే ఒంగోలు పార్లమెంట్ తోపాటు పార్లమెంట్ పరిధిలోని ఒంగోలు, కొండపి, దర్శి అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల గెలుపు మరింత ఈజీ అవుతుందని వైఎస్ జగన్ భావిస్తున్నారు. అటు ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సైతం మాగుంట శ్రీనివాసులరెడ్డికి మద్దతు పలుకుతున్నారు. 

మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఇప్పటికే మూడు సార్లు ఒంగోలు పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందారు. ఆ అనుభవం, జిల్లా నేతలతో ఉన్న పరిచయాలు, గతంలో ఓడిపోవడంతో ప్రజల సానుభూతి మాగుంట శ్రీనివాసుల రెడ్డి గెలుపుకు దోహదపడతాయన్న ప్రచారం కూడా ఉంది. 

అయితే మాగుంట శ్రీనివాసుల రెడ్డి మాత్రం మౌనం వహిస్తూనే ఉన్నారు. అయితే త్వరలోనే ఆయన వైసీపీ గూటికి వస్తారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న మాగుంట శ్రీనివాసుల రెడ్డి మార్చి 9 తర్వాత వైసీపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. 

మాగుంట శ్రీనివాసుల రెడ్డి పార్టీలోకి రాకపోతే మేకపాటి రాజమోహన్ రెడ్డిని అయినా బరిలోకి దించాలని జగన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మేకపాటి రాజమోహన్ రెడ్డి గతంలో ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు కూడా. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం నాన్ లోకల్ నేతలకు కలిసివస్తోందని ప్రచారం ఉంది. 

ఇదే సెంటిమెంట్ మాగుంట శ్రీనివాసుల రెడ్డి విషయంలో వర్కవుట్ అవుతోందని వైసీపీ భావిస్తోంది. నెల్లూరు జిల్లాకు చెందిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఇప్పటికే ఒంగోలు పార్లమెంట్ నుంచి మూడుసార్లు గెలుపొందారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి ఒకసారి గెలుపొందారు. ఇద్దరిలో ఎవరో ఒకరిని బరిలో దించాలని జగన్ ప్లాన్. అంతేకానీ వైవీ సుబ్బారెడ్డిని మాత్రం బరిలో దించే యోచనలో లేనట్లు తెలుస్తోంది. 

వైవీ సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపించి ఆంధ్రా ఎంపీల ఫోరం కన్వీనర్ గా నియమించాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వైవీ సుబ్బారెడ్డి మాత్రం పోటీపై ఘాటుగా స్పందించారు. జగన్ లండన్ పర్యటనలో ఉండగా వైవీ సుబ్బారెడ్డి రెచ్చిపోయారు. 

గతంలో తనపై ఓడిపోయిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి పార్టీలోకి తీసుకోవడం అవసరమా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పోటీపై ఆసక్తి చూపకపోవడానికి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎవరూ అంటూ వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. తనకు కాదని ఓడిపోయిన అభ్యర్థిని ఎందుకు బరిలోకి దించుతారంటూ ఎదురుప్రశ్నించారు. 

మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీని వీడి వైసీపీలోకి వస్తున్నారంటే అక్కడ టికెట్ ఇవ్వరనే భయంతోనే కదా అంటూ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపాయి. మరోవైపు లండన్ పర్యటన అనంతరం హైదరాబాద్ చేరుకున్న వైఎస్ జగన్ మాజీఎంపీ చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి వ్యవహారంపై తెలుసుకున్నారట.

బాబాయ్ పై కస్సుబుస్సులాడారట. ఇలా వ్యాఖ్యలు చేస్తే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారంట. దీంతో వైవీ సుబ్బారెడ్డి గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ మందలించడం వల్లే గృహప్రవేశానికి వైవీ సుబ్బారెడ్డి గైర్హాజరయ్యారని తెలుస్తోంది. అయితే అబ్బాయ్ పై బాబాయ్ అలక అంటూ వార్తలు రావడంతో జగన్ అప్రమత్తమయ్యారు. 

అయితే జగన్ ఇండియా టుడే 18వ కాన్ క్లేవ్ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లగా వెంట విజయసాయిరెడ్డి, బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని తీసుకెళ్లారు. వైవీ సుబ్బారెడ్డి, జగన్ మీడియాకంట పడటంతో కలిసిన బాబాయ్ అబ్బాయ్ అంటూ వార్తలు వచ్చాయి. 

మీడియా ముందు తామిద్దరం ఒక్కటే అనిచెప్పుకొచ్చినా అలక మాత్రం అలాగే ఉందని ప్రచారం. జగన్, వైవీ సుబ్బారెడ్డి కలిసి ఢిల్లీ వెళ్లినా ఎడమెుహం, పెడమెుహం గానే ఉన్నారని తెలుస్తోంది. అయితే వైవీ సుబ్బారెడ్డి పోటీపై జగన్ తన ఆలోచనను మార్చుకుంటారని వైవీ సుబ్బారెడ్డి అనుచరులు ఆశగా ఎదురుచూస్తున్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

అబ్బాయ్ జగన్ పై బాబాయ్ అలక: గృహప్రవేశానికి గైర్హాజరు

Follow Us:
Download App:
  • android
  • ios