Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ పై చంద్రబాబు దండయాత్ర: భవిష్యత్తులో ఎపికి గడ్డుకాలం?

రాజకీయ లబ్ధి కోసం ప్రాంతీయవిభేదాలు రెచ్చగొట్టి గెలవాలని చంద్రబాబు చూస్తున్నారే తప్ప హైదరాబాద్ లో ఉంటున్న 40లక్షల మంది ఆంధ్రులను పరోక్షంగా ఇబ్బంది పెడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను దోషిగా చూపేందుకు చంద్రబాబు కేసీఆర్ ను తెరపైకి తీసుకువచ్చి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. 

stand of Chandrababu on KCR may hit AP in future
Author
Amaravathi, First Published Apr 8, 2019, 4:41 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న వ్యాఖ్యలు పొరుగురాష్ట్రంతో గ్యాప్ పెంచుతోందా...?చంద్రబాబు వ్యాఖ్యలతో పొరుగు రాష్ట్రంతో ఉన్న సంబంధాలు బెడిసి కొడతాయా...?

ఇంకా పంచుకోవాల్సినవి అనేకం ఉన్నా చంద్రబాబు చీదరించుకొనడం వల్ల ఏపీ ప్రజలకు నష్టం కలగబోతుందా...?ఇప్పటికే జలవనరుల పంపకం విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య కాస్త అసంతృప్తి జ్వాల రగిలిపోతున్న విషయం తెలిసిందే. 

సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాల్సిన సమస్యలు చంద్రబాబు వ్యాఖ్యల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదని, టీఆర్ఎస్ పార్టీ అని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ను టార్గెట్ చెయ్యకుండా చంద్రబాబు నే టార్గెట్ చేశారు. అప్పటికే ఆంధ్రా ముఖ్యమంత్రులు పాలన వల్ల నష్టపోయామని భావించిన తెలంగాణ ప్రజలు చంద్రబాబుపై గుర్రు పెంచుకున్నారు. 

గంపగుత్తగా టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించుకున్నారు. ప్రాంతీయ విబేధాలే అందుకు కారణమని ప్రచారం కూడా జరిగిందనుకోండి. ఇకపోతే ఇదే అంశాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం అప్లై చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేసీఆర్ ను బూచిగా చూపించి వైఎస్ జగన్ ను దోషిగా నిరూపించాలని ప్లాన్. 

అందులో భాగంగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేసీఆర్ పై ఒంటికాలిపై లేస్తున్నారు. కేసీఆర్ ను చంద్రబాబు టార్గెట్ చెయ్యడంతో తెలంగాణ ప్రాంతంలో నివశిస్తున్న వాసులు కాస్త గందరగోళానికి గురవుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. 

రాజకీయ లబ్ధి కోసం ప్రాంతీయవిభేదాలు రెచ్చగొట్టి గెలవాలని చంద్రబాబు చూస్తున్నారే తప్ప హైదరాబాద్ లో ఉంటున్న 40లక్షల మంది ఆంధ్రులను పరోక్షంగా ఇబ్బంది పెడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.     

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను దోషిగా చూపేందుకు చంద్రబాబు కేసీఆర్ ను తెరపైకి తీసుకువచ్చి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. కేసీఆర్ ఖబడ్డార్ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. నీ భరతం పడతా అంటూ హెచ్చరిస్తున్నారు కూడా. 

తాజాగా కొన్ని ప్రాజెక్టులను చంద్రబాబు నాయుడు తెరపైకి తీసుకువస్తున్నారు. ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు, పోలవరం బహుళార్థక సాధక ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ అడ్డంకులు సృష్టిస్తోందంటూ పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. 

రాష్ట్ర విభజన సమయంలో ఇరు రాష్ట్రాల మధ్య అనేక వివాదాలు నెలకొన్నాయి. ఉద్యోగుల విభజన దగ్గర నుంచి ఆస్తుల పంపకం వరకు రోజూ వివాదాలే. ఈ వివాదాలనే తెరపైకి తెస్తున్నారు చంద్రబాబు. 

తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు కేసీఆర్ పదేపదే కేసులు వేస్తున్నారంటూ చంద్రబాబు ఆరోపిస్తున్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు 65శాతం పనులు పూర్తి చేశామని మే నెలలో పూర్తి చేసి ఖరీఫ్ పంటకు నీరందిస్తామని హామీలు ఇచ్చేస్తున్నారు. 

హామీలు ఇస్తూనే పక్క రాష్ట్రంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు చంద్రబాబు కేసీఆర్ ను విమర్శిస్తున్నారని విమర్శలు సైతం ఉన్నాయి. ఇప్పటికే కృష్ణా, గోదావరి జలాల వివాదంపై బ్రిజేష్ ట్రిబ్యునల్ వివాదం నెలకొంది. 

రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాన్ని పరిష్కరించడంలో ట్రిబ్యునల్ కత్తమీద సాము చెయ్యాల్సి వస్తున్న పరిస్థితి. ఇకపోతే ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో పాలేరు వాగుపై రూ.25 కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించింది. 

ఈ ఎత్తిపోతల పథకంపై తెలంగాణలోని కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఎత్తిపోతల పథకం వల్ల తెలంగాణ రాష్ట్రం కోదాడ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి సమస్య తలెత్తుతుందని కొందరు తెలంగాణ నేతలు నిరసన తెలిపారు.  
అటు
మరోవైపు తెలంగాణ, ఏపీల మధ్య విద్యుత్‌ బకాయిలను సైతం తెరపైకి తెస్తున్నారు చంద్రబాబు నాయుడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏపీకి రూ.5,600కోట్లు విద్యుత్ బకాయిలు ఇవ్వాలని ఎన్నికల ప్రచారంలో ఆరోపిస్తునన్నారు.  దీనిపై తెలంగాణ ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారులు సైతం స్పందించారు.  

తమకే విద్యుత్ బకాయిలు ఏపీ ప్రభుత్వం చెల్లించాలని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వానికే ఏపీ సర్కార్ రూ.2046 కోట్లు చెల్లించాల్సి ఉందని స్పష్టం చేసింది. సరైన ఆధాలు సమర్పించినప్పటికీ ఏపీ ప్రభుత్వం నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ ముందు తెలంగాణ విద్యుత్తు సంస్థలపై ఇన్‌సాల్వెన్సీ చట్టం కింద పిటిషన్‌ దాఖలు చేసిందని ఆరోపించారు. 
 
ఇకపోతే ఐటీ గ్రిడ్ వివాదం కూడా రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణానికి దారి తీసింది. ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ కేసు విచారణకు సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. 

వెస్ట్‌జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో సిట్ బృందం డేటా చోరీ కేసును ఛేదించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. మూడు బృందాలుగా విడిపోయిన సిట్ బృందం డేటా విశ్లేషణ, డేటా రికవరీ, కేసులో అనుమానితులు, సాక్షుల విచారణ ,ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ గాలింపు కోసం వివరాలు సేకరిస్తోంది. 

అంతేకాదు అమెజాన్, గూగుల్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం లేఖ రాసింది. గూగుల్, అమెజాన్ సర్వీస్ యూజర్ల సమాచారం త్వరగా ఇవ్వాలని లేఖలో పేర్కొంది. ఇదే కేసుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం సైతం రెండు సిట్ లను ఏర్పాటు చేసింది.  

ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రజలను కొడుతున్నారని వ్యాపారస్థులను కేసీఆర్ బెదిరిస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు పదేపదే ఆరోపిస్తున్నారు. ఈ వ్యాఖ్యల వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రాంతానికి చెందిన ప్రజలు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. 

తాము తెలంగాణ ప్రజలతో సఖ్యతతో ఉన్నామని కూడా వీడియోలు చేసి మరీ విడుదల చెయ్యాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యర్థి పార్టీల ను కాకుండా కేసీఆర్ ను టార్గెట్ చెయ్యడంతో ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న 40 లక్షల మంది ఓటర్లతో గందరగోళానికి గురవుతున్నారు. 

అంతేకాదు పొరుగు రాష్ట్రాలతో సత్సమ సంబంధాలు కలిగి ఉండాల్సిన తరుణంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం చర్చనీయాంశంగా మారింది. 

ఏపీపై కేసీఆర్ కక్ష గట్టారని పదేపదే చెప్తున్న చంద్రబాబు ఒకవేళ ఎన్నికల్లో గెలిస్తే తెలంగాణ నుంచి పంపకాలలోకానీ, నీటి వనరుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తోందా లేదా అన్న అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. 

రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సీఎం అయితే అటు కేసీఆర్ సహకరిస్తారా అన్నది హాట్ టాపిక్. అంతేకాదు భవిష్యత్ లో రెండు రాష్ట్రాల మధ్య సత్సమ సంబంధాలు ఎలా ఉంటాయోనని సాధారణ పౌరుడు సైతం ఆలోచిస్తున్నాడు. 

నేతలు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చెయ్యడం వారికి లబ్ధి చేకూరుతున్న అమాయక ప్రజలపై ఆ ప్రభావం పడే అవకాశం ఉందని మధ్యలో ప్రజలు నష్టపోయే ఛాన్స్ లేకపోలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

అయితే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నది వాస్తవం. కానీ చంద్రబాబు తన పరిధి దాటి విమర్శలు చేస్తున్నారని, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం తన అనూయులతో చెప్పినట్లు తెలుస్తోంది.  

Follow Us:
Download App:
  • android
  • ios