Asianet News TeluguAsianet News Telugu

అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా కొణతాల, విశాఖపట్నం పెండింగ్: భీమిలి నుంచే లోకేష్ పోటీ

అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా కొణతాల రామకృష్ణను ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈనెల 17న విశాఖపట్నంలో కొణతాల రామకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. విశాఖపట్నం పార్లమెంట్ నుంచి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ లేదా మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్లను పరిశీలిస్తున్నారు చంద్రబాబు. ఇకపోతే విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ పోటీ చెయ్యనున్నారు.

konathala ramakrishna contestant anakapalli parliament, lokesh contestant bheemili
Author
Visakhapatnam, First Published Mar 8, 2019, 9:36 PM IST

విశాఖపట్నం: ఉత్తరాంధ్ర జిల్లాలలోని అభ్యర్థుల ఎంపికపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. తెలుగుదేశానికి మంచి పట్టున్న ఉత్తరాంధ్రలో మరోసారి పాగా వెయ్యాలని భావిస్తున్న చంద్రబాబు నాయుడు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. 

ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా అభ్యర్థులను దాదాపు ఖరారు చేసిన చంద్రబాబు నాయుడు విశాఖపట్నం జిల్లా అభ్యర్థులపై కసరత్తు చేపట్టారు. శుక్రవారం సాయంత్రం విశాఖపట్నం, అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై సమీక్ష సమావేశం నిర్వహించారు. 

సమావేశంలో దాదాపు అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తి కావొచ్చిందని తెలుస్తోంది. అయితే అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా కొణతాల రామకృష్ణను ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈనెల 17న విశాఖపట్నంలో కొణతాల రామకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. 

మరోవైపు గతంలో కూడా అనకాపల్లి పార్లమెంట్ నుంచి గెలుపొందారు కొణతాల. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన అభ్యర్థిత్వాన్ని ఫైనల్ చేశారు చంద్రబాబు. అయితే విశాఖపట్నం పార్లమెంట్ స్థానాన్ని పెండింగ్ లో పెట్టారు. 

విశాఖపట్నం పార్లమెంట్ నుంచి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ లేదా మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్లను పరిశీలిస్తున్నారు చంద్రబాబు. ఇకపోతే విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ పోటీ చెయ్యనున్నారు. 

విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గణబాబు, విశాఖ దక్షిణ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్‌, గాజువాక అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, పెందుర్తి అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తిలను ఎంపిక చేశారు.   

వీరితోపాటు శృంగవరపు కోట అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, నర్సీపట్నం అభ్యర్థిగా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, యలమంచిలి అభ్యర్థిగా పంచకర్ల రమేశ్‌బాబు, అనకాపల్లి అభ్యర్థిగా పీలా గోవింద్‌కు తిరిగి టికెట్లు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

కొణతాల రామకృష్ణను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో సామాజిక లెక్కల పరంగా పీలా గోవింద్ ను అనకాపల్లి నుంచి తప్పించే యోచనలో ఉన్నారు చంద్రబాబు. కొణతాల, పీలా గోవింద్ ఒకే సామాజిక వర్గం కావడంతో ఆయనను తప్పించి ఆయన స్థానంలో మంత్రి గంటా శ్రీనివాసరావును దించితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా చేస్తున్నారు చంద్రబాబు. 

ఇకపోతే పాయకరావుపేట అభ్యర్థి ఎంపిక విషయంపై చంద్రబాబు నాయుడు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే వంగలపూడి అనితపై అసమ్మతి పెద్ద వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అభ్యర్థి ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు చంద్రబాబు. వంగలపూడి అనితతోపాటు టీడీపీ కీలక నేత విజయ్ కుమార్, మాజీఎమ్మెల్యే చెంగల వెంకట్రావు కుమార్తె పేర్లను కూడా పరిశీలిస్తున్నారు.

 మరోవైపు చోడవరం నియోజకవర్గంలోనూ ప్రస్తుత ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజుపై కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీంతో వేరే పేర్లను చంద్రబాబు పరిశీలిస్తున్నారు. మాడుగుల అసెంబ్లీ విషయానికి వస్తే ప్రస్తుత టీడీపీ ఇన్ చార్జ్ రామానాయుడు గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. మాజీ ఎంపీ సబ్బం హరి కూడా మాడుగుల నుంచి పోటీ చెయ్యాలని ఉవ్విళ్లూరుతున్నారు. వీరితోపాటు పైడా ప్రసాదరావుపేరుకూడా పరిశీలనలో ఉంది. 

ఇకపోతే అరకు పార్లమెంట్ పరిధిలో ఉన్న రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు సీఎం చంద్రబాబు. అరకు అభ్యర్థిగా మంత్రి కిడారి శ్రావణ్‌ కుమార్‌, పాడేరు అభ్యర్థిగా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఎంపిక దాదాపు కన్ఫమ్ అయినట్లు తెలుస్తోంది.  

ఇకపోతే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ భీమిలి నుంచి పోటీ చేసేందుకు దాదాపు రూట్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. భీమిలి నుంచే లోకేష్ పోటీ చేస్తారని చంద్రబాబు నాయుడు ఫైనల్ చేశారని విశాఖ జిల్లా నేతలు చెప్తున్నారు.  

ఇకపోతే విశాఖ జిల్లాలో మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీపై సర్వం ఉత్కంఠ నెలకొంది. గంటా శ్రీనివాసరావు ఎక్కడ నుంచి పోటీ చేస్తారో అన్నది చెప్పడం ఎవరి తరం కావడం లేదు. గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నుంచి టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పోటీ చేస్తున్నారు. 

దీంతో గంటా శ్రీనివాసరావు పోటీపై గందరగోళం నెలకొంది. మంత్రి గంటా శ్రీనివాసరావును విశాఖపట్నం పార్లమెంట్ నుంచి లేదా అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా, విశాఖ ఉత్తరం నుంచి పోటీ చెయ్యించాలా అన్న కోణంలో చర్చిస్తున్నారు చంద్రబాబు నాయుడు. దీంతో గంటా శ్రీనివాసరావు పోటీపై ఒక పార్లమెంట్, రెండు అసెంబ్లీ నియోజకవర్గాలలో చంద్రబాబు పరిశీలిస్తున్నారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

విశాఖ అభ్యర్థులు దాదాపు ఖరారు: సబ్బం హరి, కొణతాలకు సీట్లు కన్ఫమ్

Follow Us:
Download App:
  • android
  • ios