Asianet News TeluguAsianet News Telugu

వైసీపీకి ఓటేస్తే కేసీఆర్‌కు వేసినట్టే: సినీ నటి దివ్యవాణి

వైసీపీకి ఓటేస్తే మోడీ, కేసీఆర్‌కు వేసినట్టేనని సినీ నటి దివ్యవాణి అభిప్రాయపడ్డారు. ఏపీ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోవాలంటే మరోసారి చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఉందని ఆమె ప్రజలను కోరారు. 

cine actress divyavani sensational comments on ysrcp leaders
Author
Amaravathi, First Published Mar 21, 2019, 12:47 PM IST

అమరావతి: వైసీపీకి ఓటేస్తే మోడీ, కేసీఆర్‌కు వేసినట్టేనని సినీ నటి దివ్యవాణి అభిప్రాయపడ్డారు. ఏపీ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోవాలంటే మరోసారి చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఉందని ఆమె ప్రజలను కోరారు. అభివృద్ధికి అడ్డుపడుతున్న శూర్పణఖ, రావణసురులను ఓడించాలని ఆమె వైసీపీ నేతలపై ఘాటైన విమర్శలు గుప్పించారు.

గురువారం నాడు ఓ తెలుగు న్యూస్ చానెల్‌కు సినీ నటి దివ్యవాణి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో వైసీపీ చీఫ్, జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యే రోజాపై ఘాటైన విమర్శలు చేశారు.

ఏపీలో టీడీపీ తరపున తాను విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. రానున్న 20 రోజుల పాటు  ఓ సైనికుడి మాదిరిగా ప్రచారం నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. అడవి మాదిరిగా ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే కొంత సమయం పడుతోందని ఆమె అభిప్రాయపడ్డారు.

ఏపీలో మరోసారి టీడీపీ అధికారంలోకి వస్తే హైద్రాబాద్ కంటే అభివృద్ధిలో మించిపోనుందన్నారు.  ఇప్పటివరకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినందున... ప్రతిఫలంగా ఓటు అనే కూలీని తాము అడుగుతున్నామని  దివ్యవాణి చెప్పారు.

వైసీపీకి ఓటేస్తే మోడీ, కేసీఆర్‌కు ఓటేసినట్టేనని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదాకు ఈ ఇద్దరూ కూడ అడ్డుపడుతున్నారని  ఆమె విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి నగరిలో ఉన్న ఓ శూర్పణఖ,  రావణసురుడు అడ్డుపడుతున్నాడని రోజా, జగన్‌లను ఉద్దేశించి ఆమె తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మృతి చెందిన విషయం తెలుసుకొని తాను రెండు రోజుల పాటు నిద్ర పోలేదన్నారు వివేకానందరెడ్డి మృతిని కూడ జగన్ రాజకీయం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వివేకానందరెడ్డి  హత్యలో వాస్తవాలు తెలుసుకోకుండా జగన్ మాట్లాడడం దారుణమని ఆయన అభిప్రాయపడ్డారు. 

స్వంత బాబాయ్‌ను కాపాడుకోలేని జగన్ ఐదు కోట్ల రాష్ట్ర ప్రజలను ఎలా కాపాడుతారని ఆమె ఎద్దేవా చేశారు.జగన్ సీఎం అయితే రాష్ట్రంలో రౌడీ పాలన సాగే అవకాశం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. రౌడీ పాలన కావాలో, చల్లని చంద్రబాబు పాలన కావాలో తేల్చుకోవాలని ఆమె ప్రజలను కోరారు. 

లోకేష్ నేరస్తుడు కాదన్నారు. లోకేష్‌పై విమర్శలు చేసే నేతలు ఒక్కసారి  ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆమె సూచించారు. లోకేష్‌కు  సరిగా తెలుగు మాట్లాడడం రాకపోయినా కూడ ప్రజలకు ఏం చేయాలని తెలుసునని ఆమె చెప్పారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios