Asianet News TeluguAsianet News Telugu

మళ్లీ మోదీ ప్రధాని అయ్యి, చంద్రబాబు సీఎం అయితే జరిగేది ఇదే.....

మోదీ ప్రధాని అయితే ఏపీకి ఇవ్వాల్సిన నిధులపై మెుండి చేయి చూపిస్తారని చంద్రబాబుని ఊరికే వదిలిపెట్టరని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఐదు కోట్ల ఆంధ్రుల ప్రత్యేక హోదా సాధనకు గండిపడే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా చంద్రబాబు మోదీని టార్గెట్ చేసే దానికన్నా తాను చేసిన అభివృద్ధిపై ప్రచారం చేస్తే మంచిదని ప్రజలు చెవులుగొరుక్కుంటున్నారు. 

Chandrababu may face trouble, if Modi ragains power at Delhi
Author
Amaravathi, First Published Apr 8, 2019, 5:19 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు సంధిస్తున్న ప్రధాన అస్త్రం ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా ఇచ్చేది కేంద్రప్రభుత్వమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. 

ప్రత్యేక హోదా సాధన తమ బాధ్యత అంటే తమదే బాధ్యత అని అటు అధికార తెలుగుదేశం పార్టీ, ఇటు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు మైకుల ముందు ఊదరగొడుతున్నాయి. వైసీపీ మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా అంశాన్నే పొందుపరచలేదని టీడీపీ ఆరోపిస్తోంది. 

చంద్రబాబు నిర్వాకం వల్లే ప్రత్యేక హోదా రాలేదని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ మెడలు వంచుతానని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో దంచుకొడుతున్నారు. 25 ఎంపీలు ఇస్తే ఢిల్లీలో ప్రధాని పీఠం ఎవరిదో తేల్చేది టీడీపీయేనంటూ చెప్పుకొస్తున్నారు. 

మరోవైపు 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా సాధించి తీరుతానని వైఎస్ జగన్ హామీ ఇస్తున్నారు. ప్రత్యేక హోదా ఎవరు సాధిస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేంద్రంతో సఖ్యంగా ఉంటేనే ప్రత్యేక హోదా సాధ్యమన్నది అందరికీ తెలిసిన విషయమే. 

బీజేపీకి దూరమైనప్పటి నుంచే ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదంటూ చంద్రబాబు నాయుడు పదేపదే చెప్తున్నారు. బీజేపీ వైఖరిని నిందిస్తూ కాంగ్రెస్ పార్టీతోపాటు బీజేపీ యేతర పార్టీలనంతా ఏకం చేస్తున్నారు. మోదీయే టార్గెట్ గా చంద్రబాబు విరుచుకు పడుతున్నారు. 

ప్రధాని మోదీ వ్యక్తిగత జీవితంలోకి కూడా వెళ్లి మరీ విమర్శలు చేస్తున్నారు చంద్రబాబు. నీ అంతు చూస్తా, భరతం పడతా అంటూ నానా మాటలు ఆడుతున్నారు. అంతేకాదు గుజరాత్ అల్లర్లలో నరేంద్రమోదీని ముఖ్యమంత్రి పీఠం నుంచి గద్దె దించాలని కోరింది తానేనని అందుకే తనపై మోదీ కక్ష గట్టారంటూ చంద్రబాబు నాయుడు గొప్పలు చెప్పుకున్న సందర్భం లేకపోలేదు. 

అక్కడితో వదిలెయ్యలేదు జాతీయ నాయకులను సైతం ఏపీకి రప్పించి మోదీపై దండయాత్ర చేయిస్తున్నారు చంద్రబాబు. పశ్చిమబంగ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీప్రధాని హెచ్.డి.దేవెగౌడ, ఫరూక్ అబ్దుల్లా వంటి జాతీయ నేతలను తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ వేదికగా మోదీపై విమర్శల దాడి చేయిస్తున్నారు. 

మోదీని గద్దె దించుతాం అంటూ గ్రూప్ ఫోటోలు సైతం దిగుతున్నారు. రాబోయేది బీజేపీ యేతర ప్రభుత్వమేనని చెప్పుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు. అయితే సర్వేలు మాత్రం బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. సీట్లు తగ్గినా మోదీ అధికారంలోకి రావడం ఖాయమని అటు బీజేపీ సైతం ధీమాగా ఉంది. 

ఒకవేళ బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఏపీ పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే చంద్రబాబు పరిస్థితి ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్. 

ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ ఇవ్వలేదని ఆరోపిస్తూ మోదీని ఒక రేంజ్ లో ఉతికి ఆరేసిన చంద్రబాబును ప్రధాని నరేంద్రమోదీ దరి చేరనిస్తారా అంటూ సందేహం నెలకొంది. మోదీ ఐటీ దాడులు, కేసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని బాబ్లీ కేసును మళ్లీ తెరపైకి తెచ్చి తనను వేధిస్తున్నారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. 

అవసరమైతే తాను జైలుకైనా వెళ్తానని కూడా వ్యాఖ్యలు చేశారు. గోద్రా అల్లర్లపై తాను మెుదట స్పందించానని అందువల్లే కక్ష పెట్టుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇంతటి తీవ్ర వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు ఒకవేళ మోదీ ప్రధాని అయితే సాధించగలరా అంటూ చర్చ జరుగుతోంది. 

నాలుగేళ్లు మిత్రపక్షంగా ఉండి చివరలో తప్పుకుంటేనే చుక్కలు చూపించిన మోదీ మరి రాబోయే ఐదేళ్లలో చంద్రబాబును వదులుతారా అన్న ఆసక్తికర చర్చ జరుగుతోంది. పోనీ ఇతర పార్టీలను కలుపుకుపోయి దండెత్తుదామంటే అవి ఎంతవరకు సహకరిస్తాయి అన్నది ప్రశ్నార్థకం. 

బీఎస్పీ అధినేత్రి మాయావతి, పశ్చిమబంగ సీఎం మమతా బెనర్జీలు చంద్రబాబుపై అంతగా సానుకూలంగా లేరు. యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ ఎప్పుడు ఎటువైపు ఉంటారో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంలో చంద్రబాబు నెగ్గుకు రాగలరా అన్న చర్చ జరుగుతోంది. 

ఇకపోతే ప్రత్యేక హోదా కోసం జాతీయ పార్టీలను ఏకం చేస్తామని చెప్తున్న చంద్రబాబు పక్కనే ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలుపుకుపోకుండా ఆయనపై యుద్ధానికి దిగుతున్నారు. ఇటీవలే ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్రానికి లేఖ రాస్తానంటూ కేసీఆర్ ప్రకటించారు కూడా. 

పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీ కవిత సైతం ప్రత్యేక హోదాకు మద్దతుగా మాట్లాడిన విషయం తెలిసిందే. పక్కను ఉన్న తెలుగురాష్ట్రంతో గొడవలు పెట్టుకుంటూ ఇతర రాష్ట్రాలను కలుపుకుపోతానంటున్న వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్న నెలకొంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios