Asianet News TeluguAsianet News Telugu

వారితో నాకు పోలికేంటి: వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్ లపై చంద్రబాబు ఫైర్

నేర చరిత్ర ఉన్న జగన్‌కు, తనకూ పోలికా? అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీకు తాను సమాన దూరమంటూ పవన్‌ కళ్యాణ్ ఓ ఛానెల్ లో ప్రస్తావించిన అంశంపై ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. తన గురించి మాట్లాడే అర్హత పవన్‌కు లేదన్నారు. 
 

ap cm chandrababu naidu fires on ys jagan, pawan kalyan
Author
Visakhapatnam, First Published Mar 22, 2019, 5:56 PM IST

విశాఖపట్నం: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతిపరుడైన జగన్ , పవన్ కళ్యాణ్ లతో తనకు పోలికా అంటూ విమర్శించారు. 

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు జగన్, పవన్ లపై విరుచుకుపడ్డారు. అవినీతి పరుడైన జగన్‌కు, తనకు సమాన దూరం పాటిస్తామని పవన్‌ కళ్యాణ్ వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. 

నేర చరిత్ర ఉన్న జగన్‌కు, తనకూ పోలికా? అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీకు తాను సమాన దూరమంటూ పవన్‌ కళ్యాణ్ ఓ ఛానెల్ లో ప్రస్తావించిన అంశంపై ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. తన గురించి మాట్లాడే అర్హత పవన్‌కు లేదన్నారు. 

తనకు అనుభవం ఉంది గనకే రాష్ట్ర ప్రజలకు నీతిమంతమైన పాలన అందించానని చెప్పుకొచ్చారు. అవినీతిని నిర్మూలించి.. టెక్నాలజీని అభివృద్ధి చేసినట్టు స్పష్టం చేశారు. రాజకీయాలు చేస్తే తనకు బాధలేదని, తన కష్టాన్ని తక్కువగా అంచనా వేసి మాట్లాడితే సహించేది లేదన్నారు. 

రాష్ట్రం పక్షాన ఉంటారో, అవినీతిపరుల పక్షాన ఉంటారో జనసేన అధినేత పవన్‌ తేల్చుకోవాలంటూ చంద్రబాబు సూచించారు. టీడీపీకి ఓటేస్తే గెలుపు ప్రజలదేనన్న చంద్రబాబు వైసీపీకి  ఓటేస్తే మరణ శాసనం రాసుకున్నట్లేనని సీఎం ఆరోపించారు. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకోబోమని హెచ్చరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినని చెప్పుకొచ్చారు. తన తండ్రిని అడ్డుపెట్టుకొని రూ.లక్ష కోట్లు దోచుకున్న వ్యక్తి జగన్‌ అని చంద్రబాబు ఆరోపించారు. వైఎస్‌ వివేకా హత్య వారి ఇంట్లో జరిగితే గుండెపోటని చెప్పి ప్రజలను ఎందుకు నమ్మించారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

హత్య అని తెలుస్తున్నా ఎందుకు సాక్ష్యాలు తారుమారు చేశారు, రక్తపు మరకలను ఎందుకు తుడిచేశారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు రాష్ట్రంలో 98 లక్షల మంది ఆడబిడ్డలకు పసుపు - కుంకుమ కింద ఆర్థిక సాయం చేసిన ఘనత తనదేనని చెప్పుకొచ్చారు. 

ఇంటికి పెద్దకొడుకుగా ఉంటానని పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నానని తెలిపారు. రాష్ట్రంలో రూ.2వేల పింఛనుతో వృద్ధులు గౌరవంగా బతుకుతున్నారని స్పష్టం చేశారు. ఈ ఏడాది విశాఖ జిల్లాకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని తీసుకువస్తానని ధీమా వ్యక్తం చేశారు. 

విశాఖ జిల్లాను గోదావరి నీటితో సస్యశ్యామలం చేస్తామని స్పష్టం చేశారు. ఎవరు అడ్డుపడినా ఆగేది లేదని బుల్లెట్‌లా దూసుకెళ్తానని స్పష్టం చేశారు. చైనా, దిల్లీలో ఉండే కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చామని, దేశంలో తయారయ్యే మొత్తం ఫోన్లలో 30శాతం తిరుపతిలోనే  తయారవుతున్నాయని చెప్పుకొచ్చారు. 

నేరస్థుడికి రాష్ట్రాన్ని అప్పగిస్తే మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో ఒకసారి ఆలోచించాలని కోరారు. వైసీపీ వస్తే అందరిపై కేసులు పెట్టి జైళ్లకు తీసుకెళ్తారని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.   

Follow Us:
Download App:
  • android
  • ios