Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు సరళీకరణ: అమరావతిలో ‘బుక్’ ను అటకెక్కించిందా?

మరో పదహారు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి అవుతాయి అనగా, ఈ రోజు మధ్యాహ్నం నాటికి ఏ.పి.లో మీడియా కార్యాలయాలకు చేరిన పత్రికాప్రకటన ‘లీడ్’ ‘సంక్లిష్టతల్లో నుండి నేను సానుకూలతను వెతుక్కుంటాను’ తన నాయకత్వ శైలి గురించి, ఆయన తరచూ చేసే వ్యాఖ్య ఇది.

Johnson Choragudi on Chnadrababu experience on liberalisation
Author
Hyderabad, First Published May 7, 2019, 5:36 PM IST

రచయిత: జాన్ సన్ చోరగుడి 

“ముందుగా అన్నట్టు ఈ ఏడాది జూన్ నాటికి నీళ్ళు ఇవ్వలేమని, 2020 జూన్ నాటికి గ్రావిటీ ద్వారా పోలవరం ప్రాజెక్టు నుండి నీటిని ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (సి.బి.ఎన్) వెల్లడించారు. మే 6 న ఆయన పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న చోటును సందర్శించారు” 

మరో పదహారు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి అవుతాయి అనగా, ఈ రోజు మధ్యాహ్నం నాటికి ఏ.పి.లో మీడియా కార్యాలయాలకు చేరిన పత్రికాప్రకటన ‘లీడ్’ ‘సంక్లిష్టతల్లో నుండి నేను సానుకూలతను వెతుక్కుంటాను’ తన నాయకత్వ శైలి గురించి, ఆయన తరచూ చేసే వ్యాఖ్య ఇది. విభజన తర్వాత, పదేళ్ళు హైదరాబాద్ నగరాన్ని ఏ.పి. రాజధానిగా వినియోగించుకోవడానికి ఉన్న చట్టపరమైన అవకాశాన్నివద్దని, దాన్ని  వదులుకొని వచ్చాక, గత ఐదేళ్లుగా ఏటా జూన్ 2 న విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద జరుగుతున్న‘నవనిర్మాణ దీక్ష’ సభలో ఆయన చెబుతున్న మాట ఇది. 

ఇప్పుడు 2019 సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఫలితాల కోసం సుదీర్ఘకాలం ఎదురు చూడవలసి వచ్చాక, మునుపెన్నడూ లేనివిధంగా కొత్తగా సి.బి.ఎన్ లెజిస్లేచర్-ఎక్జిక్యూటివ్ ల మధ్య పని పరిధి గురించి లేవనెత్తిన వివాదంలో కూడా, ఆయన తరుచూ చెప్పే “సానుకూలత” ను వెతుక్కుంటున్నారు. యావత్ దేశం కోసం ఏనాడో ‘నలుపు తెలుపు’ల్లో రాసుకున్న లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ మధ్య పని విభజన, ఆ నియమ నిబంధనలను పాటించల్సిన నైతికత ఇప్పుడు ఇలా మళ్ళీ మొదటికి వచ్చింది. 

నూతన ఆర్ధిక సంస్కరణలతో మొదలయిన ‘సరళీకరణ’ (లిబరలైజేషన్) ప్రక్రియను రాజకీయాల్లో దేశంలోనే అందరికంటే ముందుగా వొడిసి పట్టుకున్నవాడు సి.బి.ఎన్.  నేరుగా దాన్ని రాష్ట్ర రాజకీయాలలోనే ప్రవేశపెట్టి, ఎన్నికతో పనిలేకుండా - ‘పొలిటికల్ మేనేజ్ మెంట్’ ద్వారా 1995 లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటినుంచీ ఇప్పటివరకు కూడా ఎటువంటి వెరపు లేకుండా; చట్టాన్ని. న్యాయాన్ని, నిబంధనల్ని, సంప్రదాయాల్ని, చివరికి రాజ్యాంగ వ్యవస్థల్నిఅన్నింటినీ తనదైన శైలిలో ‘సరళీకరిస్తూ’ దాన్నిఇప్పుడు ఆయన ఒక ‘పొలిటికల్ స్కూల్’ స్థాయికి చేర్చారు. అది అక్కడ ఆగలేదు. ప్రపంచంలో ఎక్కడ కొత్తదనం వున్నా దాన్ని ఇక్కడకు తెచ్చి మనమూ దాన్ని అనుకరించడానికి మనకు వెరపు ఎందుకు వుండాలి? అనే ధోరణి క్రమ క్రమంగా ఇక్కడ ఆయన ‘స్టేట్ పాలసీ’ గా మార్చారు. 

ఎన్టీఅర్ స్వంత ప్రాంతానికి చెందిన వారి యాజమాన్యంలో ఉన్న బలమైన ప్రసార సాధనాల వ్యవస్థ తోడ్పాటు మొదటినుండి టి.డి.పి. కి అండగా ఉండడంతో, సి.బి.ఎన్. కొత్త ‘పొలిటికల్ ఫిలాసఫీ’ చాలా తక్కువ సమయంలో ముందు తెలుగునాట మధ్యతరగతిని లోబర్చుకుంది. ఇక అన్ని జిల్లాల నుండి ఆరంభంలోనే పార్టీలోకి వచ్చిన బి.సి. లు ఇది తమ పార్టీ అనుకున్నారు. ఉపరితలంలో అన్ని వ్యవస్థల్లో అధికార వికేంద్రీకరణ ఉన్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ, కేంద్రీకృత అధికార వ్యవస్థ - టి.డి.పి.‘పొలిటికల్ ఫిలాసఫీ’. అయినప్పటికీ తొలుత ఆ అంచెల్లో వుండే పొరల్ని వాటి లోతుల్నిబి.సి.లు పెద్దగా పట్టించుకోలేదు. ఈ కాలంలో ‘విపణి’ (మార్కెట్) అన్ని సామాజిక సమూహల్నిఆసాంతం ఆక్రమించేసింది. 

చానళ్ళకు వొక కవి ‘పల్లె కన్నీరు పెడుతుందో...’ అంటూ ఉత్పత్తి కులాల వర్తమాన వాస్తవిక స్థితి గురించి రాసినప్పుడు, ‘అర్బన్ ప్రోగ్రెసివ్’ సమూహాలు సైతం ఇన్నాళ్ళుగా ఇక్కడ జరుగుతున్నది ఏమిటి అంటూ, వెనక్కి తిరిగి చూడలేదు! అయితే ఈ కులాలు వీటి వృత్తులు ఇంకా వుండాలా అంటే, ఇప్పుడు అవి లేకుండా పోయింది కూడా లేదు. ఇక జరుతున్నఈ ‘మార్పు’ ఇక్కడి యూనివర్సిటీలలో జరిగే పరిశోధనల్లో ప్రభావవంతమైన విషయమే కాకుండా పోయింది. ‘అర్బన్ ప్రోగ్రెసివ్’ వొత్తిడి గుంపులు (ప్రెషర్ గ్రూప్స్) కూడా మానవీయ శాస్త్రాల అధ్యయనానికి తలుపులు మూస్తున్న‘సరళీకరణ’ ప్రభుత్వాలను నిలువరించలేదు. విదేశీ ఎన్.జి.వో.ల ప్రభావంతో వారి ప్రాధాన్యత కూడా అప్పటికే మారి వాళ్ళు ఇతోధికంగా తమ వంతు సహకారం ప్రభుత్వాలకు అందించారు. అందుకే అప్పట్లో ఎటువంటి  బెరుకు లేకుండా - ‘ఇంకా ఏ ఇజం లేదు టూరిజం తప్ప’ అని సాక్షాత్తూ ఒక వ్యవసాయ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సి.బి.ఎన్ అనగలిగారు. 

జిల్లా కేంద్రాల్లో టూరిజం ఫెస్టివల్స్ అంటే, అది స్థానిక కళలు కళాకారులకు ప్రోత్సాహం అనుకున్నారు. కాని ఆ తర్వాతి కాలంలో జరిగిన పట్టణీకరణలో అది నిరుపేదలకు పునరావాస సమస్య అయింది! ‘టూరిజం’ పేరుతో టు-టైర్ పట్టణాల్లో జరిగిన ఇటువంటి రూరల్-అర్బన్ ‘కాక్ టైల్’ వికటించి, తర్వాతి కాలంలో అది - ‘ట్రాఫికింగ్’ ‘కాల్ మనీ’ వంటి కొత్త సామాజిక కాలుష్యాన్ని దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో నింపింది. ఈ కాలంలో పలు విరామాల మధ్య కమ్యూనిస్ట్ పార్టీలు టి.డి.పి.తో పెట్టుకున్న పొత్తులు కారణంగా, ప్రతిపక్షంగా కాంగ్రెస్ చేసే విమర్శ కూడా రాజకీయ పరిధిని మించేది కాదు. ‘లెఫ్ట్’ మేధావులు కూడా సి.బి.ఎన్. “సరళీకరణ” రాజ్యాంగ వ్యవస్థల అస్తిత్వ మూలాలను తాకుతున్న వైనాన్ని ప్రభావవంతంగా ప్రశ్నించలేకపోయారు. 

‘విన్-విన్’ లేదా ఉభయ తారకం గా మారిన ఈ పద్దతి వల్ల, తర్వాతి దశలో ‘ప్రైవేట్’ రంగలో వున్న ఆధిపత్య శక్తులు ఇక్కడి ‘రాజ్యాంగ’ వ్యవస్థల్లో కాలుమోపడానికి ప్రభుత్వం అన్ని ద్వారాలను తెరిచింది. ఇదేకాలంలో హిందీ బెల్ట్ నుండి ఐ.ఐ.టి; ఐ.ఐ.ఎం. నేపధ్యంతో వస్తున్న కొత్త తరం యువ ఐ.ఏ.ఎస్. ఐ.పి.ఎస్.లకు ‘సరళీకరించబడుతున్న’ ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కొరకు తొలి ప్రాధాన్యత రాష్ట్రంగా మారింది. ఇక్కడి మధ్యతరగతి వ్యవసాయ కుటుంబాలు నుండి మన యూనివర్సిటీలలో చదివి ఇక్కడి సామాజిక క్షేత్ర పరిస్థితుల అనుభవం వున్నతెలుగు ఐ.ఏ.ఎస్. ఐ.పి.ఎస్. అధికారులకు అప్పటికే సగం సర్వీస్ ముగిసాక, మారిన ఇక్కడి కొత్త పరిపాలనా వాతావరణంలో క్రమంగా ఉక్కబోత మొదలయింది. దాంతో కొందరు అప్రధన్యతా శాఖలకు పరిమితం అయితే, మరికొందరు ఇక్కణ్ణించి బయట సర్వీసులకు వలసలు వెళ్ళారు. సి,బి.ఎన్. తన ప్రచారానికి 1996-2004 మధ్య పెద్ద ఎత్తున వాడుకున్న‘జన్మ భూమి’ కార్యక్రమాన్నిఒక ఒరియా అధికారి రూపకల్పన చేస్తే, మరొక ఉత్తర భారతీయ అధికారి సి.ఎం. కార్యాలయం నుంచి దానికి   కంప్యూటర్ అనుసంధానం పనులు చూసేవారు. కానీ చిత్రం, ఇన్నేళ్ళలో ఒక్క ఎన్నికలోనూ ‘జన్మభూమి’ సి,బి.ఎన్. ప్రచార అంశం కాలేదు! 

పదేళ్ళ విరామం తర్వాత 2014 లో తిరిగి సి,బి.ఎన్. అధికారం చేపట్టాక, 2004 వరకు చదువుతూ మధ్యలో మూసిన పుస్తకంలో అదే పాత పేజీని మళ్ళీ తెరవడంతో సి.బి.ఎన్. సర్కార్ పాలన తిరిగి మొదలయింది. నిజానికి పదేళ్ళ ‘విరామం’ ఇచ్చిన గుణ పాఠాలను ముందుగా ఎవరైనా తలుస్తారు, కానీ అదేమీ లేదు, ఆగిన ప్రయాణాన్ని మళ్ళీ మొదలుపెట్టి, మరింత వేగంతో తక్కువ సమయంలో ఎక్కువ ప్రభుత్వ నిధులు ఖర్చుపెట్టే పరిపాలనా పద్దతిని ఆయన ఈసారి ఎంచుకున్నారు. ఖజానాలో ‘రిసిట్స్’ ద్వారా వచ్చే రెవెన్యూకు ఈసారి అదనంగా ఆయన భూమి ఇసుక మట్టి వంటి ఇతర ఖనిజ వనరుల ద్వారా వచ్చే ద్రవ్యాన్ని కూడా జోడించారు.  

రాష్ట్ర విభజనతో మునుపున్న పది జిల్లాల పరిపాలనా పరిధి ఇప్పుడు తగ్గింది. దాంతో 1996-2004 మధ్య కాలంలోనే లోబర్చుకున్న అధికార వ్యవస్థల పరిధులను పూర్తిగా అతిక్రమించి మరీ, నేరుగా ఖండాంతర లావాదేవీలకు సి.బి.ఎన్. తెరతీసారు. రాష్ట్రంలోకి 2004 ముందు ఇజ్రాయేల్ నుండి మైక్రో ఇరిగేషన్ టెక్నాలజీని తెస్తే, ఈ సారి అక్కడనుంచి ప్రత్యర్ధుల టెలిఫోన్ ట్యాపింగ్ ఉపకరణాలను తెచ్చే స్థాయికి వెళ్లారు. తొలిదశలో ప్రభుత్వంలోకి కేవలం ‘సర్వీస్ ప్రొవైడర్’ గా మొదలయిన ‘ప్రైవేట్’ రంగం చొరబాటు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పబ్లిక్-ప్రైవేట్ నిష్పత్తి 50: 50 స్థితికి చేరాయి. ఈ  క్రమంలో  ముఖ్యమంత్రి, మంత్రిమండలి, లెజిస్లేచర్ వైఖిరి తాము ఏ ప్రభుత్వ నియమ నిబంధనలు, ఆడిటింగ్ పరిధిలోకి రాని ‘సూపర్ పవర్’ గా మారింది. ఈ పరిణామాల మధ్య  అధికార యంత్రాంగం పూర్తిగా నిస్సహాయ స్థితికి చేరింది.  

గత ఐదేళ్లుగా ఎన్.డి.ఏ. ప్రభుత్వం పాత్రకూడా తక్కువేమీ కాదు. నిజానికి ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖిరి కూడా ఇక్కడ సి.బి.ఎన్. కు బాగా కలిసొచ్చింది. కొత్త రాష్ట్ర రాజధాని నిర్మాణం విషయంలో విభజన చట్టం అమలును పర్యవేక్షిస్తున్న కేంద్ర హోం శాఖ లోని కేంద్ర-రాష్ట్ర సంబంధాలు చూసే విభాగం, రాజధాని విషయంలో సి.బి.ఎన్. స్వంత నిర్ణయాలకు అనుకూలంగా గాని ప్రతికూలంగా గాని ఎటువంటి స్పష్టమైన వైఖిరి అధికారికంగా తీసుకోలేదు. ఎందుకంటే మోడీ సర్కార్ ఏ.పి. విషయంలో తీసుకునే ఏ నిర్ణయం అయినా అది ఇక్కడ తమ పార్టీ విస్తరణకు తోడ్పడదు, రాజకీయంగా ప్రయోజనం లేదు. సి.బి.ఎన్ కూడా మొదట మూడున్నర ఏళ్ళు మోడీవిషయంలో, ‘నువ్వు ఇటు మావైపు చూడక పోవడం మాకు మంచిది’ అనుకుంటే, చివరి ఏడాదిన్నరలో అదే - ‘ఇన్నాళ్ళు నువ్వు అస్సలు మావైపు చూసావా?’ అనడానికీ కుదిరింది! 
నూతన రాజధాని ప్రాంత ఎంపిక కోసం భారత ప్రభుత్వం నియమించిన జస్టిస్ శివరామ కృష్ణన్ కమిటీ నివేదిక మీద అసెంబ్లీలో చర్చగానీ, కమిటీ ప్రతిపాదనల మీద రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారత ప్రభుత్వానికి అధికారికంగా నివేదించడం గానీ ఇప్పటికీ జరగలేదు. విభజన చట్టంలో హైదరాబాద్ నగరాన్ని ఏ.పి. తెలంగాణ రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా, అక్కడ వున్న ప్రభుత్వ భవనాలు ఏ.పి. పదేళ్ళు వాడుకోవడానికి ‘క్లాజ్’ వుంది. అయితే చట్టంలో వున్న అటువంటి వెసులుబాటును మొదటి ఏడాదే ఏ.పి. వద్దు అనుకున్నప్పుడు, దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేశాక, కేంద్రం రాష్ట్ర విభజన చట్టానికి సవరణ చేసిన తర్వాతే ఏ.పి. రాజధాని అధికారకంగా అమరావతికి మారవలిసి వున్నదా లేదా? అనే అంశంపై కేంద్ర హోం శాఖ మౌనం మనకు ఇప్పటికీ అర్ధం కాని విషయం!

ఇక రాజధాని నిర్మాణం విషయంలో చట్టం మేరకు నిధులు కేంద్రం విడుదల చేసేవి అయినప్పటికీ వాటిని ఖర్చుపెట్టే విషయంలో సి.బి.ఎన్. తనకు తానే తీసుకున్నలేదా కేంద్రం ఆయనకు ఇచ్చిన స్వేఛ్చ- మొదటినుండీ ఆయన అనుసరిస్తున్న‘సరళీకరణ’ వైఖిరికి పరాకాష్ట! మూడున్నర ఏళ్ళు పైగా డిజైన్ల వద్ద ఆగి వున్న ‘కోర్ క్యాపిటల్’ ప్రాజెక్టు విషయంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల్లో ఇరువురిలో కూడా నిజాయితీ లేకపోవడం ఇప్పటికే స్పష్టమైన అంశం. అమరావతిలో ఇప్పుడు ఒక శాఖగా విదేశీ వాణిజ్య మంత్రి లేరు గాని, ఏడాది పొడవున రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులు వార్తలతో, అటు జిల్లాల పరిపాలన యంత్రాంగాన్ని ఇటు రాష్ట్ర స్థాయిలో వుండే ‘బ్యురోక్రసీ’ని తనదైన విశిష్టమైన ‘మైండ్ గేమింగ్’ శైలితో ఐదేళ్ళు సి.బి.ఎన్. విజయవంతంగా నిశబ్దపర్చగలిగారు!  

ఇటువంటి పాతికేళ్ళ అనుభవంతో సి.బి.ఎన్. ఇప్పుడు తాను ఆంగ్ల కాల్పనిక సాహిత్యలోని ప్రముఖ ఫాంటసీ పాత్ర – ‘గలివర్’ గా తన గురించి తాను భావించుకుంటూ, ‘బ్యురోక్రసీ’ ఇతర రాజ్యాంగ సంస్థలు అన్నింటినీ ‘లిల్లీపుట్స్’ అని కూడా ఆయనే అనుకోవడం, ప్రస్తుతం ఏ.పి. లో నడుస్తున్నసరికొత్త పరిపాలన ప్రహసనం! ఎన్నికల కోడ్ అమలులో వున్న కాలంలో ‘క్యాబినెట్ మీటింగ్ పెడతా, ఎలా రాకుండా వుంటారో చూస్తా...’ అంటూ మీడియాలో ఆయనిప్పుడు ప్రకటనలు ఇస్తున్నారు. మరోపక్క ఐ.ఏ.ఎస్. అధికారులు సమావేశమై ఇటువంటి ప్రత్యేక పరిస్థితిలో తమ నిర్ణయం ఎలావుండాలి, అనే దాని మీద సమాలోచనలు చేస్తున్నారు. అధికారంలో వున్నా ప్రతిపక్షంలో వున్నా, తను చెప్పిందే ‘రూల్’ అనే తరహాలో ఇన్నాళ్ళు ప్రవర్తించిన సి,బి.ఎన్ “సరళీకరణ” ఇప్పుడు ఇలా ఒక పరాకాష్ట స్థితికి చేరింది. 

ఇప్పుడు సి.బి.ఎన్. మాదిరిగా ఎన్నికల కమీషనర్, చీఫ్ సెక్రటరీలతో ఇదే తరహా సమస్య ఎదుర్కొంటున్నఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కనుక వుంటే, వారితో కల్సి ఈ మూడు కార్యాలయాల మధ్య పని విభజన మీద దేశ వ్యాప్తంగా చంద్రబాబు చర్చ మొదలుపెట్టవచ్చు. అప్పుడు కొత్త ప్రతిపాదనలతో పార్లమెంట్ కొత్త చట్టం తీసుకువస్తే, లెజిస్లేచర్-ఎగ్జిక్యుటివ్ ల మధ్య ఇటువంటి ప్రత్యేక సమయంలో తలయెత్తే ప్రతిస్థంభనకు ఇకముందు శాశ్విత పరిష్కారం దొరుకుతుంది. 

గమనిక: వ్యాస రచయిత అభిప్రాయాలతో ఏషియా నెట్ న్యూస్ కు సంబంధం లేదు. ఈ వ్యాసంలో అభిప్రాయాలన్నీ రచయితకే చెందుతాయి.

Follow Us:
Download App:
  • android
  • ios