Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబుకు మమతా, కేజ్రీవాల్ ఝలక్

ఈ రెండు సభలలోనూ వైఎస్ జగన్ పేరెత్తకపోవడంతో చంద్రబాబు నాయుడు ఖంగుతిన్నారు. ప్రధానిమోడి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. వారి ప్రసంగానికి ముందు చంద్రబాబు వైఎస్ జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ కు మోదీ రక్షకుడు అంటూ విమర్శించారు. ఆ తర్వాత ప్రసంగించిన మమతా బెనర్జీ కానీ, అరవింద్ కేజ్రీవాల్ కానీ వైఎస్ జగన్ ఊసెత్తలేదు

mamata and Kejriwal keep away from making comments against YS Jagan
Author
Visakhapatnam, First Published Apr 1, 2019, 1:43 PM IST

విశాఖపట్నం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు జాతీయ పార్టీ నేతలు ఝలక్ ఇచ్చారు. పశ్చిమబంగ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ల వల్ల తనకు ఏదో కలిసి వస్తుందని ఆశించిన చంద్రబాబు ఆశలపై నీళ్లు చల్లారు ఆ ముఖ్యమంత్రులు. 

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీని రంగంలోకి దించి ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్న చంద్రబాబు ఈసారి కూడా అదే ప్లాన్ ను అనుసరిస్తున్నారు. 

జాతీయ నాయకులను ఎన్నికల ప్రచారబరిలోకి దించి రాజకీయ వేడిని మరింత పెంచుతున్నారు. జాతీయ నాయకుడిగా జమ్ముకాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్ధుల్లా చంద్రబాబుకు జై కొట్టారు. చంద్రబాబుకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 

కడప జిల్లాలో చంద్రబాబుతోపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే రూ.1500 కోట్లు ఇస్తానని ఆఫర్ ఇచ్చారంటూ చెప్పుకొచ్చారు. 

ఫరూక్ అబ్ధుల్లా ఆ వ్యాఖ్యలు చేసి వెళ్లిపోయిన రెండు రోజుల వరకు టీడీపీ ఆ వ్యాఖ్యలను భుజాన ఎత్తుకుని జగన్ ను టార్గెట్ చేసింది. కాంగ్రెస్ పార్టీకి రూ.1500 కోట్లు ఇవ్వజూపారన్న ఆరోపణలతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సైతం దిగిరావాల్సి వచ్చింది. 

కాంగ్రెస్ పార్టీ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అదంతా అబద్దం అంటూ కొట్టిపారేశారు. అటు జాతీయ మీడియా సైతం ఫరూక్ అబ్దుల్లాను ఉతికి ఆరేసింది. ఈ ఇబ్బంది రాకూడదు అనుకున్నారో ఏమో ఆ తర్వాత వచ్చిన ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా వైఎస్ జగన్ ను కామెంట్ చెయ్యలేదు. 

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఏపీకి రెండుసార్లు వచ్చారు. ఇటీవలే విజయవాడలో ఉత్తరాది నేతల ఆత్మీయసమావేశంలో పాల్గొన్న ఆయన అనంతరం ఆదివారం మమతా బెనర్జీతో కలిసి చంద్రబాబు నాయుడు సభలో పాల్గొన్నారు. 

ఈ రెండు సభలలోనూ వైఎస్ జగన్ పేరెత్తకపోవడంతో చంద్రబాబు నాయుడు ఖంగుతిన్నారు. ప్రధానిమోడి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. వారి ప్రసంగానికి ముందు చంద్రబాబు వైఎస్ జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ కు మోదీ రక్షకుడు అంటూ విమర్శించారు. 

ఆ తర్వాత ప్రసంగించిన మమతా బెనర్జీ కానీ, అరవింద్ కేజ్రీవాల్ కానీ వైఎస్ జగన్ ఊసెత్తలేదు. ప్రధాని నరేంద్రమోదీని ఓ ఆట ఆడుకున్నారు. మోదీ హటావో అంటూ పిలుపునిచ్చారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 125 సీట్లు రావడం కూడా కష్టమేనని మోదీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందంటూ వ్యాఖ్యానించారు. 

ఇక కేజ్రీ వాల్ అయితే ఓటు ద్వారా ప్రజలే దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చిందన్నారు. మోదీ ని గద్దె దింపితే మన దేశం బాగుపడుతుందని వ్యాఖ్యానించారు. అయితే చంద్రబాబును మళ్లీ సీఎం చెయ్యాలని ఇరువు చెప్పుకొచ్చారు. కానీ తమ ప్రత్యర్థిని కనీసం పల్లెత్తుమాట కూడా అనకపోవడంతో చంద్రబాబు ఖంగుతిన్నారట. వీరిద్దరి కంటే ఫరూక్ అబ్ధుల్లాయే నయం కదా అని టీడీపీ నేతలతో అన్నారట.  

Follow Us:
Download App:
  • android
  • ios