Asianet News TeluguAsianet News Telugu

జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారు: వైఎస్ వివేకా హత్యపై చంద్రబాబు

వైఎస్ వివేకాను హత్య చేసి డ్రైవర్ పైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్ ఇంట్లోనే వైఎస్ వివేకా హత్యకు గురయ్యారని ఆయన అన్నారు. 

Chandrababu says Jagan is playing mind game
Author
Kurnool, First Published Mar 19, 2019, 2:41 PM IST

కర్నూలు: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కర్నూలు ఎన్నికల ప్రచార సభలో ఆయన మంగళవారంనాడ ప్రసంగించారు. 

వైఎస్ వివేకాను హత్య చేసి డ్రైవర్ పైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్ ఇంట్లోనే వైఎస్ వివేకా హత్యకు గురయ్యారని ఆయన అన్నారు. జగన్ కు బీహార్ క్రిమినల్ ప్రశాంత్ కిశోర్ తోడయ్యారని, ప్రశాంత్ కిశోర్ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. 

జగన్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్‌ మద్దతు ఇస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రధాని మోడీ దొంగలను కాపాడుతున్నారని, మంచివారిపై దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. నేరస్థుడు ఎప్పుడూ అపరాధ భావంతోనే ఉంటారని, ఎదుటివారిని నిందించి పబ్బం గడుపుకుంటారని అన్నారు. ఎంతోమంది అధికారులు జగన్‌ వల్ల జైలు పాలయ్యారని చంద్రబాబు అన్నారు.
 
బిహార్‌ నుంచి డెకాయిట్‌ ప్రశాంత్‌కిషోర్ (పీకే) వస్తున్నారని, బందిపోట్లకు ఆయన నాయకుడని అన్నారు. గాలి, తప్పుడు వార్తలతో నేతలను భయపెడుతున్నారని, టీడీపీ ఆర్థికమూలాలను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో సంపద సృష్టిస్తే.. ఏపీకి వాటా రాకుండా కేసీఆర్‌ అడ్డుకుంటున్నారని విమర్శించారు. 

హైదరాబాద్‌ నుంచి ఏపీకి రూ.లక్ష కోట్ల వాటా రావాలని చంద్రబాబు అన్నారు. పోలవరంపై సుప్రీంకోర్టులో కేసీఆర్‌ పిటిషన్‌ వేశారని గుర్తు చేశారు. గోదావరి మిగులు జలాలు వాడుకుంటే కేసీఆర్‌కు ఎందుకు బాధని, కేసీఆర్‌ అనవసరంగా ఇతర రాష్ట్రాలను రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు.

టీడీపీ విజయరహస్యం 68లక్షల పసుపు సైన్యమని, ప్రతిరోజు 4లక్షల మంది కార్యకర్తలతో మాట్లాడుతున్నానని చెప్పారు. ప్రజల బాధ్యత కార్యకర్తలదని, వారి బాధ్యత తనదని చంద్రబాబు స్పష్టం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios