Asianet News TeluguAsianet News Telugu

తప్పు చేశానా...కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఆవేదన: చంద్రబాబు సభకు డుమ్మా

పార్టీ మారి తప్పు చేశానా అని సన్నిహితుల వద్ద వాపోయారట. ఇలానే ఉంటే పార్టీ వీడాల్సిందేనని ఇంతకంటే అవమానాలు భరించలేనని రెండు రోజుల క్రితం సన్నిహితుల వద్ద వాపోయారట. అందువల్లే ఆమె చంద్రబాబు నాయుడు సభకు గైర్హాజరయ్యాని ప్రచారం జరుగుతుంది. 
 

kurnool mp butta renuka can t attend chandrababau meeting
Author
Kurnool, First Published Mar 2, 2019, 8:04 PM IST

కర్నూలు: కర్నూలు ఎంపీ బుట్టా రేణుక అలక బూనారు. తన టికెట్ పై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆమె గత కొద్ది రోజులుగా అలకబూనారు. దీంతో ఆమె కర్నూలు జిల్లాలో చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు డుమ్మా కొట్టారు. 

కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరే కార్యక్రమంలో భాగంగా కోడుమూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. బహిరంగ సభ సాక్షిగా కోట్ల కుటుంబం సైకిలెక్కేసింది. పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. 

కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి రాజకీయ శత్రువుగా ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సైతం ఆ బహిరంగ సభకు హాజరయ్యారు. కానీ కర్నూలు ఎంపీ బుట్టా రేణుక మాత్రం గైర్హాజరయ్యారు. ఆమె డుమ్మాకొట్టడంపై సర్వత్రా చర్చ మెుదలైంది. 

బుట్టా రేణుక పోటీ చేసే విషయంపై చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవడంతో ఆమె పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆమె సభకు గైర్హాజరైనట్లు సమాచారం. 

ఇకపోతే బుట్టా రేణుక 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. గెలిచిన కొద్ది రోజులకే బుట్టా రేణుక తెలుగుదేశం గూటికి చేరారు. తెలుగుదేశం పార్టీలో అధికారికంగా చేరకపోయినప్పటికీ అనుబంధంగా కొనసాగుతూ వచ్చారు. 

వైసీపీకి పూర్తిగా దూరమయ్యారు. తెలుగుదేశం పార్టీ నేతగా వైసీపీ పైనా విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్నప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు బుట్టా రేణుక. తెలుగుదేశం పార్టీ నేతలు గైర్హాజరైనా బుట్టా రేణుక మాత్రం గైర్హాజరు కాలేదు. 

అయితే తొలిసారిగా చంద్రబాబు నాయుడు పాల్గొన్న బహిరంగసభకు డుమ్మాకొట్టారు. బుట్టా రేణుక రాబోయే ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చెయ్యాలని భావించారు. అయితే అనూహ్యంగా కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఎంట్రీతో అది కాస్త బ్రేక్ పడింది. 

పోనీ ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని భావించిన ఆమె ఎమ్మిగనూరు నియోజకవర్గం ఇవ్వాలని కోరారు. అందుకు కూడా చంద్రబాబు నాయుడు ససేమిరా అన్నారు. ఆదోని నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యాలని చెప్పారట చంద్రబాబు. అది కూడా క్లారిటీ ఇవ్వలేదట. 

మీనాక్షినాయుడు కూడా పోటీపడుతున్నారని సర్వే నివేదిక ఆధారంగా టికెట్లు ఇస్తానని చెప్పుకొచ్చారట. దీంతో ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన రాజకీయ భవిష్యత్ తన చేతుల్లో  లేకుండా పోయిందని ఎక్కడ నుంచి పోటీ చెయ్యాలో కూడా చెప్పకుండా చంద్రబాబు నాయుడు వ్యహరిస్తున్న తీరుపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

పార్టీ మారి తప్పు చేశానా అని సన్నిహితుల వద్ద వాపోయారట. ఇలానే ఉంటే పార్టీ వీడాల్సిందేనని ఇంతకంటే అవమానాలు భరించలేనని రెండు రోజుల క్రితం సన్నిహితుల వద్ద వాపోయారట. అందువల్లే ఆమె చంద్రబాబు నాయుడు సభకు గైర్హాజరయ్యాని ప్రచారం జరుగుతుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios