Asianet News TeluguAsianet News Telugu

మెగాస్టార్ తో నాకు గొడవలు లేవు, జగన్ ను కలుస్తున్నారనే కుట్ర: ఎమ్మెల్యే చెవిరెడ్డి

తన అభిమాన సంఘం పేరుమీద చలామణి అవుతున్న పోస్టింగుల్ని తక్షణమే తొలగించాల్సిందిగా పోలీసులకు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 

ysrcp mla chevireddy bhaskarreddy condemned negative campaign for chiru-jagan meeting
Author
Tirupati, First Published Oct 12, 2019, 2:51 PM IST

తిరుపతి: మెగాస్టార్ చిరంజీవికి ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరిట సోషల్ మీడియాలో విమర్శలు హల్ చల్ చేస్తున్నాయి. 

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అభిమాన సంఘం పేరుతో చిరంజీవిని విమర్శిస్తూ ఫేస్ బుక్ అకౌంట్లలో పోస్టులు పెట్టారు. ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. 

మెగాస్టార్ చిరంజీవితో తనకు ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. చిరంజీవిపై తన అభిమాన సంఘం పేరిట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్ని ఖండించారు. తన అభిమాన సంఘంపేరుతో సర్క్యలేట్ అవుతున్న పోస్టింగులకు తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. తనకు ట్విట్టర్ అకౌంట్లు గానీ ఫేస్ బుక్ అకౌంట్లుగానీ లేవన్నారు. 

తాను తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా ఉన్న రోజుల్లో చిరంజీవి ఎమ్మెల్యేగా ఉండేవారని గుర్తుచేశారు. ఆనాటి నుంచి చిరంజీవితో తనకు సత్సంబంధాలే ఉన్నాయని చెప్పుకొచ్చారు. 

సీఎం జగన్, చిరంజీవి మధ్య సంత్సబంధాలు ఉండకూడదన్న క్షుద్ర ఆలోచనలతో తెలుగుదేశం పార్టీయే ఈ దుష్ప్రచారం చేస్తుందని ప్రభుత్వ విప్ చెవిరెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా తనకు ఎలాంటి అభిమాన సంఘాలు లేవని తెలిపారు. 

అభిమాన సంఘాలు అంటూ ఉంటే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే ఉంటాయన్నారు. తాను కూడా జగనన్న అభిమానినేనని చెప్పుకొచ్చారు. తన అభిమాన సంఘం పేరుమీద చలామణి అవుతున్న పోస్టింగుల్ని తక్షణమే తొలగించాల్సిందిగా పోలీసులకు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios