Asianet News TeluguAsianet News Telugu

పొమ్మనలేక పొగబెట్టారా.?: వైసీపీకి దగ్గుబాటి గుడ్ బై, పురంధేశ్వరికి అడ్డుకాకూడదని....

బీజేపీలో భార్య దగ్గుబాటి పురంధేశ్వరి చాలా యాక్టివ్ గా ఉన్న నేపథ్యంలో తాను అడ్డుగా ఉండకూడదని దగ్గుబాటి వెంకటేశ్వరరావు భావిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే దగ్గుబాటి వెంకటేశ్వరరావును పొమ్మనలేకే వైసీపీ పొగబెడుతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ysrcp leader daggubati venkateswara rao may quit to ysrcp
Author
Ongole, First Published Oct 26, 2019, 9:35 PM IST

ప్రకాశం: ఎట్టకేలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. గత కొద్దిరోజులుగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయ భవిష్యత్ పై గందరోగోళం నెలకొంది. 

దగ్గుబాటి వెంకటేశ్వరరావు భార్య బీజేపీ మహిళామోర్చా అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలే అందుకు కారణమని తెలుస్తుంది. బీజేపీలో యాక్టివ్ గా ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. 

తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న తప్పులనే సీఎం జగన్ చేస్తున్నారంటూ పదేపదే విమర్శించారు. అలాగే రాజధాని విషయంలో కూడా జగన్ తో విబేధించారు. వైసీపీ ప్రభుత్వంపై దగ్గుబాటి పురంధేశ్వరి వ్యాఖ్యలను సీఎం జగన్ సీరియస్ గా తీసుకున్నారు. 

ఇటీవలే సీఎం జగన్ తో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆయన కుమారుడు హితేష్ చెంచురాంతో కలిసి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ భార్య భర్తలు ఇద్దరూ వేర్వేరు పార్టీలో ఉండటం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఇద్దరూ ఒకే పార్టీలో ఉండాలంటూ జగన్ కండీషన్ పెట్టారు. 

దగ్గుబాటి పురంధేశ్వరి వైసీపీలో చేరితే ఆమెకు తగిన ప్రాధాన్యత ఇస్తామని జగన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఆమెను రాజ్యసభకు పంపిస్తామని కూడా హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇదేవిషయాన్ని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సైతం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 

ఇకపోతే పర్చూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత రామనాథం బాబు తిరిగి వైసీపీలో చేరడంతో గందరగోళం నెలకొంది. ఆయనను పర్చూరు నియోజకవర్గం ఇంఛార్జ్ గా నియమిస్తారంటూ ప్రచారం జరిగింది. 

ఈ పరిణామాల నేపథ్యంలో దగ్గుబాటి అనుచరులు జిల్లా మంత్రి అయిన బాలినేని శ్రీనివాస్ రెడ్డితో భేటీ అయ్యారు. పర్చూరు నియోజకవర్గ ఇంఛార్జ్ గా దగ్గుబాటి వెంకటేశ్వరరావునే కొనసాగించాలని డిమాండ్ చేశారు. 
  
అయితే దగ్గుబాటి వెంకటేశ్వరరావు దంపతులు ఒకే పార్టీలో ఉంటే బాగుంటుందని సీఎం జగన్ స్పష్టంగా తెలియజేశారని చెప్పుకొచ్చారు. ఏపార్టీలో ఉంటారో దగ్గుబాటి దంపతులే తేల్చుకోవాలని సీఎం జగన్ చెప్పారని వారి చేతుల్లోనే ఉందని బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. 

ప్రస్తుతానికి పర్చూరు ఇంఛార్జ్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొనసాగుతున్నారని వారం రోజుల తర్వాత మరింత క్లారిటీ వస్తుందని స్పష్టం చేశారు. ఇకపోతే జగన్ కండీషన్ పై దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కుమారుడు హితేష్ చెంచురాం పురంధేశ్వరితో చర్చించినట్లు తెలుస్తోంది. 

అయితే పురంధేశ్వరి బీజేపీని వీడేందుకు సుముఖుంగా లేరని సమాచారం. తాను బీజేపీలోనే కొనసాగుతానని స్పష్టం చేయడంతో చేసేది లేక భార్య వెంటే ఉండాలని దగ్గుబాటి వెంకటేశ్వరరావు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

ఇకపై రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. శనివారం పర్చూరు నియోజకవర్గానికి సంబంధించిన సమావేశంలో గందరగోళం నెలకొంది. రామనాథం వర్గీయులు, దగ్గుబాటి వర్గీయుల మధ్య పెద్ద వివాదమే నడించింది. ఈ సందర్భంలో దగ్గుబాటి అనుచరుడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.  

ఈ పరిణామాలను పరిశీలించిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు మరోసారి రాజకీయ సన్యాసం తీసుకునేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. దీపావళి అనంతరం సీఎం వైయస్ జగన్ తో భేటీ అయిన తర్వాత పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. 

ఇకపోతే గతంలో మాదిరిగా ఇక రాజకీయ సన్యాసం తీసుకుంటారని ప్రచారం. బీజేపీలో భార్య దగ్గుబాటి పురంధేశ్వరి చాలా యాక్టివ్ గా ఉన్న నేపథ్యంలో తాను అడ్డుగా ఉండకూడదని దగ్గుబాటి వెంకటేశ్వరరావు భావిస్తున్నట్లు సమాచారం. 

ఇకపోతే దగ్గుబాటి వెంకటేశ్వరరావును పొమ్మనలేకే వైసీపీ పొగబెడుతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. పర్చూరు ఇంఛార్జ్ గా రామనాథంబాబును నియమించేందుకు ఈ వ్యవహారమంతా నడుపుతున్నారంటూ పొలిటికల్ సర్కిల్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

ఈ వార్తలు కూడా చదవండి

జగన్ షరతు బేఖాతరు: బిజెపిలోనే పురంధేశ్వరి, హితేష్ కన్నీటి పర్యంతం.

Follow Us:
Download App:
  • android
  • ios