Asianet News TeluguAsianet News Telugu

కోడెలపై కేసులు పెట్టకపోతే నిరాహారదీక్షకు దిగుతా: వైసీపీ నేత అంబటి రాంబాబు హెచ్చరిక

స్పీకర్ కోడెల కులాలు, ప్రాంతాలను రెచ్చగొట్టి అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో అశాంతి సృష్టిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెలపై ఐదుగురు పోలింగ్‌ ఏజెంట్లు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం సాయంత్రంలోగా కోడెలపై కేసు నమోదు చెయ్యకపోతే నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు.

ysrcp leader ambati rambabu demands to  file case against speaker kodela
Author
Guntur, First Published Apr 15, 2019, 9:18 PM IST

గుంటూరు : గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుల మధ్య నెలకొన్న వివాదం తారా స్థాయికి చేరుకుంది. స్పీకర్ కోడెల శివప్రసాదరావు పోలింగ్ బూత్ క్యాప్చరింగ్ కు ప్రయత్నించి దొరికిపోయారని అంబటి రాంబాబు ఆరోపించారు. 

సోమవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించిన ముప్పాళ్ల ఎస్సై ఏడుకొండలును సస్పెండ్‌ చేయాలని డిమాండ్ చేశారు. 

స్పీకర్ కోడెల కులాలు, ప్రాంతాలను రెచ్చగొట్టి అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో అశాంతి సృష్టిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెలపై ఐదుగురు పోలింగ్‌ ఏజెంట్లు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. 

మంగళవారం సాయంత్రంలోగా కోడెలపై కేసు నమోదు చెయ్యకపోతే నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. పోలింగ్‌ సమయంలో 30 యాక్ట్‌, 144 సెక్షన్‌ అమల్లో ఉంటే టీడీపీ నేతలు ఎలా ధర్నా చేస్తారని అంబటి రాంబాబు నిలదీశారు. 

తమపై నకిలీ వ్యక్తులు ఫిర్యాదులు చేస్తే  హత్యాయత్నం కేసులు నమోదు చెయ్యడం దారుణమన్నారు. తమ ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చెయ్యాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలోని ఎన్నికల్లో అశాంతి సృష్టించిన కోడెల, ఆయన అనుచరులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

ఇనిమెట్ల కేసును నిష్పక్షపాతంగా విచారించాలని అంబటి రాంబాబు కోరారు.  ఇనిమెట్ల గ్రామంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు బీభత్సం సృష్టించారని ఆరోపించారు. 160 నెంబర్‌ పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి స్పీకర్ కోడెల తలుపులు వేసుకుని గంటన్నరకు పైగా అక్కడే కూర్చొని ఉండటం ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడమేనన్నారు. 

దాంతో కోడెలను బయటకు పంపాలంటూ ఓటర్లు ఆందోళకు దిగారని అయినప్పటికీ తాను ఇక్కడే ఉంటా ఏం చేసుకుంటారో చేసుకోండంటూ ఓటర్లపై కోడెల ఆగ్రహం వ్యక్తం చేశరాని తెలిపారు. దాంతో ఓటర్లు కోడెలపై తిరుగుబాటు చేశారని ఆరోపించారు. 

స్వయంగా ఒక అభ్యర్థి పోలింగ్ బూత్ లోకి వెళ్లి తలుపులేసుకుని ఉండటం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. ఓటర్ల తీరుతో కంగుతిన్న కోడెల సొమ్మసిల్లి పడిపోయారని తెలిపారు. దాన్ని ఆసరాగా చేసుకుని కోడెలపై దాడి పేరుతో వైసీపీ నాయకులు అయిన తమపై కేసులు బనాయించారని ఆరోపించారు అంబటి రాంబాబు. 

Follow Us:
Download App:
  • android
  • ios