Asianet News TeluguAsianet News Telugu

యనమలకు ఎదురీత తప్పదా....

తెలుగుదేశం పార్టీలో ఆయనకంటూ ప్రత్యేక స్థానం. దాదాపుగా చంద్రబాబు నాయుడు తర్వాత స్థానం ఆయనదే అంటే అతిశయోక్తి కాదు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరిచిందంటే చాలు ఆ ప్రభుత్వంలో కీలక పోర్ట్ పోలియో మాత్రం ఆయనదే. ఉమ్మడి ఆంధ్రప్రదేశంలో పలుమార్లు ఆర్థికశాఖ మంత్రిగా, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రిగా, స్పీకర్ గా పనిచేసిన ఆయన పలు రికార్డులను సైతం నెలకొల్పారు.  

ysrcp jet speed in thuni assembly constiuency east godavari district
Author
Kakinada, First Published Oct 6, 2018, 3:01 PM IST

కాకినాడ: తెలుగుదేశం పార్టీలో ఆయనకంటూ ప్రత్యేక స్థానం. దాదాపుగా చంద్రబాబు నాయుడు తర్వాత స్థానం ఆయనదే అంటే అతిశయోక్తి కాదు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరిచిందంటే చాలు ఆ ప్రభుత్వంలో కీలక పోర్ట్ పోలియో మాత్రం ఆయనదే. ఉమ్మడి ఆంధ్రప్రదేశంలో పలుమార్లు ఆర్థికశాఖ మంత్రిగా, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రిగా, స్పీకర్ గా పనిచేసిన ఆయన పలు రికార్డులను సైతం నెలకొల్పారు.  

నవ్యాంధ్రలో తొలి ఆర్థిక శాఖ మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన సాధారణంగా నోరు విప్పరు. విప్పారంటే ఏదో ఒకక సంచలనమే. బడ్జెట్ కేటాయింపులో పొదుపుగా ఎలా ఉంటారో మాటలను పొదుపుగానే వాడతారు. 

యనమల మీడియా సమావేశం అంటే ఆ రోజు ఏదో సంచలనం ఉంటుందనే అంతా భావిస్తారు. ఇక ప్రతిపక్ష పార్టీలను ఇరుకున పెట్టడంలో ఆయనకు ఆయనే సాటి...తనపదునైన మాటల తూటాలతో ప్రతిపక్ష పార్టీలను తూర్పారపడతారు. ఇంతకీ ఆయన ఎవరనుకుంటున్నారా ఆయన యనమల రామకృష్ణుడు.  

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో క్రియాశీలక పాత్రపోషిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం నుంచి యనమల రామకృష్ణుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1983 నుంచి 2004 వరకు ఆరుసార్లు వరుసగా విజయం సాధించారు. తుని నియోజకవర్గంలో టీడీపీ జెండా తప్ప ఇతర పార్టీ జెండా ఎగురవెయ్యనివ్వలేదు. అంతలా ప్రజల్లో నాటుకుపోయారు యనమల. 

అందుకే తుని నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా చెప్తుంటారు. 2004లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చినా తునిలో యనమలను మాత్రం ఓడించలేకపోయారు. అయితే 2009 ఎన్నికల్లో వైఎస్ వేవ్ తో తొలిసారిగా ఓటమి పాలయ్యారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 1983 నుంచి ఓటమెరుగని యనమల రామకృష్ణుడు 2009లో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజా అశోక్ బాబు చేతిలో పరాజయం పాలయ్యారు.   

యనమల రామకృష్ణుడు ఓటమిని జీర్ణించుకోలేని తెలుగుదేశం పార్టీ ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు బరిలో నిలిచారు. వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా చేతిలో కృష్ణుడు పరాజయం పాలయ్యారు.  

ప్రస్తుతం దాడిశెట్టి రాజా నియోజకవర్గంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మంచి వ్యక్తిగా, సౌమ్యుడిగా పేరుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దాడిశెట్టి రాజాయే బరిలో నిలిచే అవకాశం దాదాపు ఖాయమైపోయింది. ఇక టీడీపీ నుంచి మళ్లీ యనమల కృష్ణుడుకే అవకాశం ఇవ్వనుంది. 

అయితే టీడీపీకి కంచుకోటలా ఉన్న తుని నియోజకవర్గంలో యనమల బ్రదర్స్ ఎదురీదుతున్నారు. యనమల కుటుంబ పాలనపై ఉన్న తీవ్ర వ్యతిరేకత ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకత, యనమల అనుచరుల పెత్తనం ఆ పార్టీకి మరో సమస్యగా మారింది. దీంతో యనమల కృష్ణుడు గెలుపు ఓ సవాల్ అని ప్రచారం జరుగుతుంది. 

ఇకపోతే ఈ నియోకవర్గంలో జనసేన పార్టీ సైతం బలంగానే ఉంది. జనసేన పార్టీ అభ్యర్థిగా రాజా అశోక్ బాబు బరిలో నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. త్వరలోనే రాజా అశోక్ బాబు జనసేన పార్టీలోకి చేరే అవకాశం ఉందని సమాచారం. 2004లో ఎమ్మెల్యేగా గెలిచిన రాజా పాలనలో తనకంటూ ఓ ముద్ర వేసుకున్నారు. రాజా బహుదూర్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కావడం, ఎమ్మెల్యేగా అనుభవం, ఆయనకు కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. 

2014 ఎన్నికల్లో రాజా అశోక్ బాబు పోటీ చెయ్యకపోవడంతో 2019 ఎన్నికల్లో పోటీ చెయ్యాలని అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నుంచి దాడిశెట్టి రాజా బరిలో ఉండటం, టీడీపీ నుంచి యనమల కృష్ణుడు బరిలో ఉండే అవకాశం ఉండటంతో రాజా అశోక్ బాబు జనసేనలోకి వెళ్తారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో రాజా అశోక్ బాబు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో 2019లో త్రిముఖ పోటీ రసవత్తరంగా సాగే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న తుని నియోజకవర్గంలో యనమల బ్రదర్స్ మళ్లీ పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తారా....లేక దాడిశెట్టి రాజా ఫ్యాన్ గాలికి కొట్టుకుపోతారా అన్నది ప్రజలే నిర్ణయించాలి. లేకపోతే ఇద్దర్నీ కాదని రాజా అశోక్ బాబుకు ప్రజలు పట్టం కడతారా అన్నది వేచి చూడాలి. 

మరోవైపు తుని నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. వ్యక్తులకే ప్రాధాన్యత ఇస్తారు నియోజకవర్గ ప్రజలు. ఫలితంగానే తొలుత నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నిలిచింది. రాజా బహుదూర్ ఫ్యామిలీని ఆదరించారు నియోజకవర్గ ప్రజలు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 2014వరకు టీడీపీకి పట్టం కట్టారు నియోజకవర్గ ప్రజలు. అదే తరహాలో చూసుకుంటే దాడిశెట్టి రాజాకు మరో అవకాశం ఇస్తారన్న సెంటిమెంట్ కూడా వైసీపీలో వినిపిస్తోంది

Follow Us:
Download App:
  • android
  • ios